అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

684

ఎన్నికల వాయిదా సబబేనన్న సుప్రీంకోర్టు
జగన్ తొందరపాటుకు వరస బ్రేకులు
పథకాల అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఒక్కటే ఊరట
సంకటంలో ఏపీ సీఎస్
ఇప్పుడైనా అధికారులను బదిలీ చేస్తారా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పటివరకూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు హైకోర్టులో మాత్రమే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా, జగనన్న సర్కారుకు ఎదురుదెబ్బ తగలటం అధికార పార్టీకి శరాఘాతంగా పరిణమించింది. స్థానిక సంస్థలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పరిణామం.. ఎన్నికలు నిర్వహించాలన్న సీఎం డిమాండుకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా  సంకటంలోకి నెట్టేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. ఆరువారాల తర్వాత కరోనాపై పరిస్థితిని అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే ప్రకటించిన పథకాలు కొనసాగించవచ్చని, ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని తీర్పు ఇచ్చింది. కొత్త పథకాలు, ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలు ప్రకటించకూడదని స్పష్టం చేసింది. తాజా తీర్పు పరిశీలిస్తే.. సుప్రీంకోర్టు కూడా, ఎన్నికల వాయిదాపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిందని అర్ధమవుతోంది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల వాయిదాపై తీసుకున్న నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులంతా తప్పు పట్టారు. ఆయన నిర్ణయానికి-కులానికి ముడిపెట్టి, మీడియా సాక్షిగా దారుణమైన విమర్శలు చేశారు. కాపు రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేలయితే ‘వాడొక కులగజ్జి వెధవ’ అని తిట్టిపోసే వరకూ వెళ్లారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే, ‘కరోనా వైరస్ వచ్చిందా? కమ్మ వైరస్ వచ్చిందా’ అని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దాదాపు వైసీపీ నేతలంతా నిమ్మగడ్డ రమేష్‌తోపాటు, ఆయన సామాజికవర్గమైన కమ్మ కులాన్నీ నిందించడం చర్చనీయాంశమయింది.

అయితే, తాజా తీర్పుతో.. నిమ్మగడ్డ రమేష్, విపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని నిన్నటివరకూ దుమ్మెత్తిపోసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇప్పుడు కోర్టు తీర్పు ముదావహమని మాటమార్చడం విస్మయం కలిగిస్తోంది. అటు తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు బట్టి.. సీఎం జగన్‌కు అధికారులెవరూ, వాస్తవాలు చెప్పే పరిస్థితిలో లేరని, ఆయన కూడా ఎవరి మాట వినే పరిస్థితిలో లేరన్నది మరోమారు నిజమయింది. సలహాదారుల నుంచి మంత్రుల వరకూ జగనన్నను మెప్పించేందుకు, ఆయన చెప్పింది వింటున్నారే తప్ప, ఎవరూ ఆయనకు హితవు పలికే ధైర్యం చేయడం లేదని కూడా స్పష్టమవుతోంది. బహుశా ఇలాంటి హితవచనాలు చెప్పినందుకే, సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంపై, వేటు వేసినట్లు ఇప్పటి పరిణామాలు చూస్తే మెదడుైపై తల ఉన్న ఎవరికైనా సులుభంగా అర్ధమవుతుంది.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు తప్పుపట్టలేవని తెలిసిన సీఎస్, ఐఏఎస్ అధికారులు.. ఆ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లకపోవడం నిస్సందేహంగా తప్పేనంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. తమ పార్టీ నేతల ఫిర్యాదు మేరకే సీఎస్, ఏడీజీ, ముగ్గురు ఐపిఎస్‌లను ఎన్నికల సంఘం బదిలీ చేసిందన్న  విషయాన్ని, కనీసం జగన్ ఏరికోరి ఎంపిక చేసుకున్న, న్యాయనిపుణులు కూడా చెప్పకపోవడం విచారకరం. ఇప్పటిదాకా దాదాపు 51 కేసులలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలతోపాటు, కొన్ని తీర్పులు ఇవ్వడం గమనార్హం. సీఎం హితవు కోరేవారు చాలామంది ఉన్నప్పటికీ, వారి సలహాలు ఆయన పట్టించుకోనందుకే, ఇలాంటి పరిణామాలు తలె త్తుతున్నాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


‘మా పార్టీకి ప్రజలిచ్చినంత భారీ మెజారిటీ, బహుశా వైఎస్ బతికివచ్చి పార్టీ పెట్టినా మళ్లీ రాదేమో. కానీ దానిని కాపాడుకోలేకపోతున్నాం. పాలనానుభవం లేకపోవడం ఒక కారణమైతే, తనకు అన్నీ తెలుసనన్న ధోరణి ఆయనలో ఉండటం మరో కారణం. జగన్ సంగతి తెలుసుకాబట్టి, మంత్రులు, సీనియర్లు కూడా పెదవి విప్పి వాస్తవాలు చెప్పకపోవడం, ఈ దుస్థితికి మరో కారణం. ప్రజల్లో పార్టీపై ఇప్పటికీ అభిమానం ఉంది. కానీ దానిని మేం ఎక్కువకాలం నిలబెట్టుకునేలా కనిపించడం లేదు’ అని ఓ సీనియర్ వైసీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉంటే బాగుండేదని, ప్రభుత్వ న్యాయవాదులు కూడా వాస్తవాలు చెప్పకుండా, ప్రతిష్ఠకు పోవడం కూడా ఈ దుస్థితికి మరో కారణమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తీర్పుతో నిలిచిన పరువు

అయితే సుప్రీంకోర్టు తీర్పుతో,  కొంత పరువు పోయినప్పటికీ, మరికొంత పరువు నిలిచింది. గతంలో ప్రకటించిన పథకాల అమలు, కోడ్ నిలిపివేత వంటి ఆదేశాలు నిస్సందేహంగా జగన్ సర్కారుకు నైతిక విజయమే. దానితో జగన్ కలలు కన్న 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ నిరభ్యంతరంగా చేసుకోవడం ద్వారా, ఆయా వర్గాలకు చేరువకావచ్చు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున, కొత్త వ్యూహాలకు బోలెడంత వెసులుబాటు లభించినట్టయింది.

పాపం… సీఎస్!

ఎటొచ్చీ,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరిస్థితే సంకటంలో పడింది. ఎన్నికలు వాయిదాపై సీఎం జగన్ విరుచుకుపడిన  మరుక్షణం, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్‌ఈసీకి లేఖ రాసి ఇరుకున పడ్డారు. ఇప్పుడు కోర్టు కూడా ఎన్నికల సంఘం పక్షానే నిలిచింది. అసలు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్వహించమని లేఖ రాయడమే తప్పు. ఒకవేళ రాసినప్పటికీ అది అభ్యర్థన, లౌక్యంగా ఉంటే సరిపోయేది. అందుకు విరుద్ధంగా ఆమె రాసిన లేఖకు, నిమ్మగడ్డ రమేష్ కూడా సుతిమెత్తగా బదులిచ్చారు. కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించకపోవడంతోనే, తాను కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాసి, ఆ మేరకు ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని,  ఎన్నికల సంఘం చేసిన వాదనకు సుప్రీంకోర్టు కూడా, సంతృప్తి వ్యక్తం చేసింది.

ఆ బదిలీలు అమలు చేస్తారా?

ఇక ఇప్పుడు సీఎస్ ముందు మరో అగ్నిపరీక్ష సిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐల బదిలీ, సస్పెన్షన్లపై ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు, రెండురోజులు దాటి పోయాయి. అయినా వాటిని అమలుచేయాల్సిన సీఎస్, ఇంతవరకూ స్పందించలేదు. రేపు దీనిపై మళ్లీ ఎస్‌ఈసీ, లేదా ఏదైనా రాజకీయ పార్టీలు కోర్టు గడప ఎక్కితే, అప్పుడు కచ్చితంగా సీఎస్ చిక్కుల్లో పడవలసి వస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ అధికారులు రూల్ పొజిషన్‌ను చూసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా, వాటన్నింటికీ అడ్డంగా తలూపి, సంతకాలు చేస్తే పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? సీఎం అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ రాయాల్సింది కాదన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఎస్‌ఈసీ.. రీషెడ్యూల్- బదిలీలపై మెలిక పెడితే?..

కాగా తాజా సుప్రీంకోర్టు తీర్పుతో, ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎస్పీ, కలెక్టర్ల బదిలీలపై తానిచ్చిన ఆదేశాలకు-తిరిగి ఎన్నికల నిర్వహణకు మెలిక పెడితే, పరిస్థితి ఏమిటన్న కొత్త చర్చ మొదలయింది. తానిచ్చిన ఆదేశాలను అమలుచేసిన తర్వాతనే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎస్‌ఈసీ చెబితే, ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. జగన్ కూడా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిష్ఠగా తీసుకున్నందున, ఆయన ఆదేశించిన విధంగా బదిలీలు, సస్పెండ్లు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.  అయితే.. ఎవరైనా ఎస్‌ఈసీ ఆదేశాల అమలుపై కోర్టుకు వెళితే, కచ్చితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవలసి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎస్ సంతకం లేకుండా, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కేసులు, పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

6 COMMENTS

  1. […] గతంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, హైకోర్టులు తీర్పులిచ్చాయి. అత్యంత సున్నితం, ప్రత్యర్ధి పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు, ఇతర కీలక అంశాలపై హైకోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తే, అలాంటి వాటిని మాత్రమే సవాల్ చేస్తూ, ఆయా రాష్ట్రాలు సుప్రీం కోర్టుకు అపీలు కోసం వెళ్లేవి. హై కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది కదా అని ప్రతి అంశంలోనూ సుప్రీం కోర్టుకు వెళ్లేవి కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ తీరు అందుకు పూర్తి భిన్నంగా మారటం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి.. ‘అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దె…’ […]

  2. […] ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలగించిన నిమ్మగ డ్డరమేష్‌కుమార్‌ను,  తిరిగి ఆ పదవిలో నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. జగన్ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నిమ్మగడ్డను  తప్పించేలా సవరించిన ఆర్డినెన్స్ చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టులు న్యాయాన్ని పరిరక్షిస్తున్నాయని వ్యాఖ్యానించాయి. అటు..  హైకోర్టు, సుప్రీంకోర్టులలో వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో.. ఇకనయినా జగన్ సర్కారులో ఇకనయినా మార్పు వ స్తుందా అన్న చర్చ జరుగుతోంది.ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దె… […]

  3. […] రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది.దానిని సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా,సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది.. తాజాగా పోతిరెడ్డిపాడుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బ్రేకులు వేసింది. దాని సామర్థ్యం పెంచుతూ జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించింది. మద్యం అమ్మకాలపై వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా.. మద్యం షాపులపై లేని నియంత్రణ, కిరాణాషాపులకు ఎందుకని ప్రశ్నించింది.  ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దె… […]

  4. […] ఇదే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నిస్తే మాత్రం.. తమ అనుకూల బృందాలు, అభిమానులతో తీర్పులిచ్చిన న్యాయాధికారులు, న్యాయస్థానాలకు ఆవ్రతపక్షపాతం ఆపాదించి, బురదచల్లించడం సబబేనా? అప్పటి ఫలితాలు ఆనందంగా ఆస్వాదించిన వారు, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఎందుకు స్వాగతించలేకపోతున్నార న్న ప్రశ్నకు పాలకుల వద్ద జవాబు దొర కదు. పగ-ప్రతీకారంతో పాలన సాగిత్తే, ఫలితాలు ఇలాగే ఉంటాయని గుర్తించే వయసు, అనుభవం పాలకులకు లేకపోవడమే  దీనికంతటికీ కారణం. వేస్తున్న అడుగుల్లో తప్పొప్పులను సరిదిద్ది, సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన దిశానిర్దేశకులు, దూకుడు నిర్ణయాలకు కళ్లెం వేయాల్సిన అధికారులు.. పాలకుల పక్కన, చుట్టూ లేకపోవడం మరో కారణమని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దె… […]