జగన్‌ను.. మీడియా ముందుకు తీసుకువచ్చిన నిమ్మగడ్డ

671

కరోనా పుణ్యాన మీడియా ముందుకొచ్చిన జగన్
తొలిసారి తెలుగు మీడియా ముందుకు
ప్రశ్నలు లేవు.. అంతా ప్రసంగమే
(మార్తి సుబ్రహ్మణ్యం)
అన్నక్యాంటిన్ల మూత.. ఇసుక రద్దు..రేషన్‌కార్డుల తొలగింపు.. ఇంకా అనేక పథకాల రద్దు చేసినప్పుడు జనంలో హాహాకారాలు మిన్నుముట్టాయి.  శాసనమండలి రద్దు పెద్ద దుమారమే రేపింది. కోర్టులు వరస వెంట అక్షింతలు వేస్తూనే ఉన్నాయి. అయినా  కూడా ఆయన తొణకలేదు. బెణకలేదు. అదే నవ్వు. అదే ధీమా. చంద్రబాబు మాదిరిగా ఆగమేఘాలపై మీడియా పేరంటం పెట్టలేదు. కానీ.. ఒక అధికారి తీసుకున్న నిర్ణయంతో యమార్జంటుగా మీడియా పేరంటం పెట్టేశారు. ఇన్ని సమస్యలు, ఇంతమంది రాజకీయ యోధులు చేయలేని పనిని, ఆరకంగా ఒక అధికారి చేయగలిగారు. ఆరకంగా ‘కరోనా కల్లోలం’ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మహావ్రతాన్ని భగ్నం చేసి, తొలిసారి తెలుగు మీడియా ముందుకొచ్చేలా చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న సంచలన నిర్ణయం.. 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయిన తనకు, ఎవరూ ఎదురు చెప్పకూడద నుకుని భావించే జగన్‌కు షాక్ ఇచ్చింది. దానితో సమీక్ష సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి, హడావిడిగా గవర్నర్ వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి వాయువేగంతో నివాసానికి వచ్చి, అంతే వేగంతో మీడియా సమావేశం నిర్వహించిన జగనన్న.. తెలుగు మీడియాను కూడా అదే స్థాయిలో షాక్‌కు గురిచేశారు. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయిన ఈ పది నెలల్లో, ఒక్కసారి కూడా ఏపీలో తెలుగు మీడియాతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అసలు తెలుగు మీడియా ముఖం చూడకూడదనుకుని వ్రతం పట్టిన జగనన్నను, ఎన్నికల కమిషన్-కరోనా రెండూ కలిపి మీడియా ముందుకొచ్చేలా చేశాయి.

విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన జాతీయ మీడియాతో తప్ప, స్థానిక మీడియాతో మాట్లాడింది లేదు.  ఏపీ మీడియా అంటే జగనన్న దృష్టిలో ఎల్లో మీడియా. తన సొంత మీడియా ఒక్కటే   పులకడిగిన ముత్యం. నీతి,నిజాయితీని తన కలం పట్టుకుని, టార్చిలైట్లు వేసి మరీ  ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించే మీడియా సంస్థగా ఇప్పటికీ భావిస్తుంటారు. సొంత మీడియా సంస్థ చేతిలో ఉన్నందున, మిగిలిన మీడియాతో పనిలేదన్నది ఆయన ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకమే ఆయన పార్టీని గెలిపించింది కూడా. అది వేరే విషయం! పాదయాత్రలోనో, అసెంబ్లీలో ఉన్న ఆయన చాంబరులోనో ఒకవేళ మీడియాతో ముచ్చటించినా, ఎవరైనా ప్రశ్న వేస్తే.. ‘అన్నా. నీ పేరు, నీ పేపరు ఏందన్నా’ అని మర్యాదగా ఎదురు ప్రశ్నిస్తుంటారు. జగనన్న సీఎం అయిన తర్వాత, టీడీపీ అనుబంధ మీడియాగా ముద్ర ఉన్న ‘ఆరెండు పత్రికలు’, మిగిలిన చానెళ్లకు ప్రకటనలు నిలిపివేశారు.‘ఆ రెండు’లో ఈనాడుకు కొంచెం మినహాయింపు ఇచ్చారు.  బాబు హయాంలో ఇచ్చిన, ప్రకటనల తాలూకు బిల్లులు కూడా నిలిపివేశారు. రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు తలెత్తినప్పుడు, ముఖ్యమైన అంశాలు వివాదం అయినప్పుడు కూడా, జగన్ మీడియాతో మాట్లాడలేదు. తన సొంత మీడియాకే అన్నింటికీ పరిమితం చేశారు. అదే చంద్రబాబయితే, ఓ వంద సార్లు మీడియాతో మాట్లాడేవారు. భూమి-ఆకాశాన్ని ఏకం చేసేంత హడావిడి చేసేవారు.

ఏపీ మీడియాపై ‘అంత గొప్ప గౌరవం’ ఉన్న జగనన్న, హటాత్తుగా పిలవడంతో  జర్నలిస్టులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ జన్మధన్యమయిందన్నట్లు భావించారు. మెదడులో ఉండిపోయిన అనేక ప్రశ్నలను సీఎం గారిని అడిగి, సమాధానం రాబట్టాలని అత్యాశ పడ్డారు. కానీ.. జగనన్న ప్రెస్‌మీట్ పెట్టడం, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు, వారి కులానుబంధాన్ని వేలెత్తి చూపించడం.. చెప్పాల్సినవి చెప్పి, అంతే వేగంగా వెళ్లిపోవడం, దానిని చూస్తూ జర్నలిస్టులు నోరెళ్లబెట్టడం చకచకా జరిగిపోయాయి.
మరి  ఇంతోటి ప్రసంగానంతరం ప్రశ్నలు లేని దానికి,  ప్రెస్‌మీట్ పెట్టడం ఎందుకు? ఎంచక్కా రోజుమాదిరిగానే ప్రెస్‌నోట్ ఇస్తే, తమకు పెట్రోలు ఖర్చులు మిగిలేవి కదా అని, పాపం జర్నలిస్టులు డీలాపడిపోయారు. అందులోనూ జగనన్న ప్రెస్‌మీట్‌కు, ‘ఎంపిక చేసుకున్న మీడియా’నే ఆహ్వానించారు. పోనీ, వారికయినా ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చారా అదీ లేదు. కరోనాకు భయపడాల్సిన పనిలేదన్న భరోసా, గవర్నరు వద్దకు వెళ్లిన సారాంశం ఒక్కటే విప్పారు. అంటే, ఒక పారాసిట్‌మల్.. ఒక నిమ్మగడ్డ రమేష్.. ఒక చంద్రబాబు. అంతే! ఏదేమైనా, ఏపీ మీడియాను కరుణించి, వారిముందుకొచ్చిన జగనన్న రుణాన్ని,  జర్నలిస్టులు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు.