ఆ ఇద్దరిదీ స్వయంకృతమే!

78

స్థానిక ఎన్నికలు పెట్టని తప్పిదం బాబుదే
ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీపై పదడుతుందన్న భయమే కారణం
ఎన్నికలు పెట్టి నేతలకు టార్గెట్లు పెట్టిన జగన్‌దీ తప్పే
అది లేకపోతే ఈ సమస్యలు వచ్చేవి కావంటున్న వైసీపీ నేతలు
ఫలితాల ప్రకారం పాలన మార్చుకోవాలన్న ధ్యాస లేని వైనం
ప్రతిష్ఠకు పోవడం వల్లే ఇద్దరికీ ఈ సమస్యలు
 (మార్తి సుబ్రహ్మణ్యం)
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఏ పార్టీ ఎలాంటిదో.. ఏ నాయకుడు ఎలాంటి వారో ఆవిష్కరించాయి. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎవరి స్థాయిలో వారు చేసిన పొరపాట్లకు.. సొంత పార్టీల క్యాడర్, అధికారులు ఇబ్బందుల పాలు కావలసి వస్తోంది. స్థానిక సంస్థలు నిర్వహించకుండా చంద్రబాబు తప్పు చేస్తే.. ఎన్నికలు నిర్వహించి కూడా, గెలుపుపై  సొంత పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి, జగన్మోహన్‌రెడ్డి తప్పు చేశారు. ఇద్దరూ బాగానే ఉన్నారు. ఎటొచ్చీ నడుమ నలిగిపోతున్నది మాత్రం వారి పార్టీల క్యాడర్, ప్రభుత్వాధికారులే.
ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించారు. జగన్ ప్రభంజనం చూసి భయపడిన బాబు, స్థానిక సంస్థలు నిర్వహించకుండా కాలయాపన చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోతే, ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పడుతుందన్న భయమే, దానికి కారణం. నిజంగా, బాబు తన హయాంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నది, తెలుగుదేశం పార్టీ సీనియర్ల అభిప్రాయం. ఒకవేళ ఆ ఎన్నికల్లో ప్రజాతీర్పు పార్టీకి వ్యతిరేకంగా వచ్చినట్టయితే, అసెంబ్లీ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసుకునేందుకు, అదొక వేదికగా ఉండేదని చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో బాబు అనవసర ప్రతిష్ఠకు పోయినందున, ఇప్పుడు పార్టీ శ్రేణులు మొత్తం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉంటే, స్థానికంగా తమ లోపాలేమిటో బయటపడి ఉండేవని విశ్లేషిస్తున్నారు.
అటు ముఖ్యమంత్రి జగన్ కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మక తప్పిదం చేశారని వైసీపీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించిన ఘనత మూటకట్టుకున్న తమ అధినేత, ఫలితాల విషయంలో లక్ష్యాలు నిర్దేశించడమే, ఇన్ని సమస్యలకూ కారణమని స్పష్టం చేస్తున్నారు. నిజానికి ప్రజల్లో స్థానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ పట,్ల సానుకూల వైఖరి ఉందని చెబుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉండటం, ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలు అందవన్న భయం, ఉన్నవి తీసేస్తారన్న ఆందోళ, విపక్షాలకు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్న అభిప్రాయంతో.. వారంతా వైసీపీకే ఓటు వేయాలని మానసికంగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
అయితే, ఎన్నికల్లో ఫలితాలు సాధించని వారిపై వేటు వేస్తానని జగన్ హెచ్చరించడంతో, తప్పనిసరిగా గెలవాలన్న పట్టుదల.. తమ నేతలను, అడ్డదారులు తొక్కించేలా చేసిందని విశ్లేషిస్తున్నారు. తమ ఇలాకాల్లో గెలవలేకపోతే, ఎక్కడ తమపై వేటు పడుతుందోనన్న ఆందోళనతో, తమ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ప్రత్యర్ధులను బెదిరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఫలితాల్లో జగన్ తమకు లక్ష్యాలు నిర్దేశించకపోతే, పదినెలల  పాలనపై ప్రజల మనోగతం తెలుసుకునే అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు ఒక విధంగా తప్పు చేస్తే, తమ నేత జగన్ మరొకరకమైన తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాయని, ఫలితాలు వ్యతిరేకంగా వస్తే.. తర్వాత ఏవిధంగా నడుచుకోవాలో తెలిసిపోతుందని విశ్లేషిస్తున్నారు. కానీ, ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉండే తమ పార్టీ.. ఎన్నికల  ఫలితాలపై అనవసర ప్రతిష్ఠకు పోయి, చిక్కుల్లో ఇరుక్కుందని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో, మెజారిటీ సంఖ్యలో ఏకగ్రీవం కావడం పెద్ద విశేషమేమీ కాదని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఏకగ్రీవం అయ్యాయని గుర్తు చేస్తున్నారు. జగన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో, దీనిపై ‘ఈనాడు’ పత్రిక రాసిన కథనాన్ని చదివి వినిపించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. బాబు అనుకూల మీడియా, అప్పట్లో ఆయన వల్ల లబ్ధి పొందింది కాబటే,్ట ఆ రకంగా రాశాయంటున్నారు. బాబు హయాంలో సమాచార శాఖ నిధుల్లో సింహభాగం ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలే ఆక్రమించాయని  గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాము కూడా అదే పనిచేస్తున్నందున.. ఇక ఆ పార్టీకీ, తమకు తేడా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
వీరి పంతాలు, పట్టింపులకు మధ్యలో ఆయా పార్టీల నేతలు, అధికారులు నలిగిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఏరికోరి తెచ్చుకున్న అధికారులు, వారి కోరికలను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా, విపక్షాలను అణిచివే స్తున్నారు. లేకపోతే తమకు స్థానభ్రంశం అవుతుందన్న భయమే దానికి కారణమంటున్నారు. అటు స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేల ప్రాపకం కోసం,  ప్రత్యర్ధులపై దాడులకు తెగబడి, కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

1 COMMENT

  1. […] తమ అధినేత ఆలోచనా ధోరణి మారాలని వారు కోరుకుంటారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తమ ఆలోచనల ప్రకారమే,  నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తుంటారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, దానిని వెంటనే పాటించాలని ఆకాంక్షిస్తుంటారు. ప్రజల మనోభావాలు, మారుతున్న కాల పరిస్థితులు, మారుతున్న తరం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరుకుంటారు. జనం ఏమనుకుంటారోనన్న జాగ్రత్త ఉండాలని అనుకుంటారు. కానీ.. అధినేతలు  మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తమ ఆలోచనల ప్రకారమే అందరూ పనిచేయాలని భావిస్తారు. తమ కళ్లతో ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. తాము చేసేదే సరైనదనుంటారు. ఫలితం.. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి-పైస్థాయిలో ఆదేశాలిచ్చే అధినేతల మధ్య మానసిక-సైద్ధాంతిక, రాజకీయ ఘర్షణ. ఆంధ్రప్రదేశ్‌లో అచ్చంగా జరుగుతున్నది ఇదే. అది వైసీపీ అధినేత-సీఎం జగనన్న అయినా, టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడయినా ఒకటే. రెండు పార్టీల జెండాలు మోసే సగటు కార్యకర్త అభీష్టానికి విరుద్ధంగా, జగన్-బాబు ప్రభుత్వ-పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు ఆయా పార్టీల శ్రేణులను అసంతృప్తికి కారణమవుతున్నాయి.ఇది కూడా చదవండి: ఆ ఇద్దరిదీ స్వయంకృతమే! […]