ఎవరికీ నమ్మకం కలిగించని ఖాకీలు
కానీ అందరికీ భద్రత కావాలి
నాడు జగన్.. నేడు బాబు
(మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా పోలీసులే వివిధ కేసుల సందర్భాల్లో అనుమానితుల జాబితాను తయారుచేస్తుంటారు. కానీ, గత ఆరేళ్ల నుంచి ఏపీలో రాజకీయ పార్టీలే.. ప్రజల ముందు పోలీసు వ్యవస్థను అనుమానితుల జాబితాలో చేర్చడం ఓ విషాదం.
ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూస్తే కఠిన పాషాణ హృదయం ఉన్న వారికీ జాలివేయక మానదు. పోలీసులు లేకపోతే అడుగు కూడా  ముందుకు వేయలేని రాజకీయ పార్టీలు, తమ అవసరార్ధ రాజకీయాలకు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత, రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ దయనీయ స్థితి ఎక్కడా కనిపించలేదు. సీఎంలుగా వైఎస్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా పోలీసు వ్యవస్థకు మరక అంటలేదు. కానీ, కులాల కేంద్రంగా ఉన్న విజయవాడ కేంద్రంగా, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే.. పోలీసులపై మెరుపుల స్థానంలో, మరకలు పెరిగాయి. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే, పోలీసు వ్యవస్థపై కులం, పక్షపాత మరక విమర్శలు పెరిగాయి. ఫలానా పోస్టులో ఫలానా కులం వారిని నియమించారన్న నాటి వైసీపీ ఆరోపణలు, పోలీసులను నైతికంగా దెబ్బతీశాయి.


నిజానికి ఈ సంప్రదాయానికి తెరలేపింది నాటి విపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆయన సారథిగా ఉన్న వైసీపీ  మాత్రమే. డీఎస్పీ పోస్టింగులు, ఎస్పీలలో ఎంతమంది కమ్మవర్గానికి చెందిన వారికి ఇచ్చారో ఒక జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా విపక్షాలు ఇలాంటి సంప్రదాయాన్ని,  ఎప్పుడూ అనుసరించిన దాఖలాలు లేవు. తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దళిత, బీసీ సంఘాల నేతలు మాత్రమే అప్పట్లో విమర్శలు కురిపించేవి. జిల్లాల్లో ఉన్న కులసమీకరణ ఆధారంగా పోస్టింగులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు కమ్మ ఆధిపత్యం, రెడ్ల హవా ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో.. ఆ రెండు వర్గాలకు చెందిన వారు కాకుండా, ఇతర కులాలకు చెందిన అధికారులను ఎస్పీ, కలెక్టర్లుగా నియమించేవారు. డీఎస్పీ, సీఐల నియామకాలు కూడా అలాగే ఉండేవి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతి పాటించేవి.
కానీ , రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. కులాలకే ప్రాధాన్యం మొదలయింది. సమర్ధత, నిజాయితీ ప్రాతిపదిక కాకుండా.. కులం-విధేయతకే పట్టం కట్టే సంప్రదాయం ప్రారంభమయింది. దానితో అసలు ఎలాంటి పలుకుబడి, ప్రభావం లేని కింది స్థాయి కులాలకు చెందిన పోలీసులకు, అప్రాధాన్య పోస్టులు దక్కేవి. టీడీపీ హయాంలో రెడ్డి, ఎస్సీ, కులాలకు చెందిన వారికి, చాలాకాలం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం విమర్శలకు దారితీసింది. వారంతా వైసీపీకి మానసిక మద్దతుదారులయినందున, వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తే ఆ పార్టీకి సహకరిస్తారన్న అనుమానమే, దానికి కారణమన్న విశ్లేషణ అప్పట్లో వినిపించింది.
తర్వాత వచ్చిన జగన్ సర్కారు, కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచి, ప్రతీకారం తీర్చుకుంది. మరికొందరికి లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చింది. ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకపోగా, కొందరిని సస్పెండ్ చేసింది. కాపు వర్గానికి చెందిన పోలీసుల విషయంలోనూ ఇదే విధానం అవలంబిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గానికి చెందిన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించింది. బాబు జమానాలో లూప్‌లైన్‌లో ఉన్న వారికి, ఎక్కడా లంచాలు తీసుకోకుండానే జగన్ సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు తమకు అలాంటి పోస్టింగులు వస్తాయని, సదరు అధికారులు కూడా ఊహించనంతగా, జగన్ సర్కారు వారిని అందలమెక్కించింది.


గత ఆరేళ్లలో జరిగిన వాస్తవాలు ఇవి కాగా.. కొత్తగా ‘పోలీసులంటే నమ్మకం లేని వ్యవస్థ’గా ముద్ర వేసే, విచారకర కొత్త విధానానికి నేటి సీఎం జగన్ తెరలేపారు. ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు, విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తితో తనపై జరిగిన హత్యాయత్నంపై జగన్ తీవ్రంగా స్పందించారు. తాను సీఎం అవుతానని, అప్పుడు మీ అందరి సంగతి చూస్తానని పోలీసులను హెచ్చరించారు. విచారణకు వెళ్లిన పోలీసులకు సహకరించలేదు. పైగా తనకు ఏపీ పోలీసులంటే నమ్మకం లేదని, నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై, రాష్ట్ర పోలీసులు చేసే విచారణను నమ్మలేమని ప్రకటించారు. దానిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా.. రాష్ట్ర పోలీసులపై తనకు ఏమాత్రం నమ్మకం లేనందున, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కొంతమంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేయాలని వారి జాబితాను ఈసీకి అందించారు. డీజీపీని కూడా బదిలీ చేయాలని కోరారు.

అటు ఆయన సోదరి షర్మిల కూడా.. ఏపీ పోలీసులపై నమ్మకం లేక, తనపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ, హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రకంగా.. ఏపీ పోలీసులను మొట్టమొదటగా ‘అనుమానితులు’గా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది. కానీ అదే సమయంలో, తమ నేతకు భద్రత తగ్గించారని, ఆయనకు పోలీసు భద్రత పెంచాలని, మరోవైపు వైసీపీ నేతలు డిమాండ్ చేయడం మరో ఆశ్చర్యం. అసలు ఏపీ పోలీసులపై నమ్మకమే  లేదని ప్రకటించిన వారికి, అదే పోలీసుల రక్షణ కావలసి రావడమే వింత.
విపక్ష నేత నుంచి సీఎంగా ఎన్నికైన తర్వాత అదే  జగన్..  అనేక సందర్భాల్లో పోలీసుల పనితీరును ప్రశంసించడం విశేషం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, పోలీసుల పనితీరును ఆయన ఆకాశానికెత్తారు. పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలను బదిలీ చేయడంపై జగన్ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 


తాజాగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విపక్షాలకు చెందిన అభ్యర్ధులపై పోలీసుల ప్రోత్సాహంతోనే, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, కేంద్రబలగాలను పంపి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో పోలీసులు అన్‌ఫిట్. వారు భయపడుతున్నారు. అందుకే కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలని’ బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బాబును పోలీసులు ఆయన నివాసం వద్దనే నిలిపివేసిన వైనంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత తగ్గించిన వైనంపైనా ఆయన జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. అయితే, తమ అధినేతకు పోలీసు భద్రత పెంచాలని అదే టీడీపీ నేతలు గవర్నర్, కేంద్ర హోంమంత్రిని కోరడం మరో విచిత్రం. అతిగా ప్రవర్తించే పోలీసుల పేర్లను నోట్ చేసుకోవాలని, అనేక బహిరంగ సభల్లో పిలుపునిచ్చారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

 


గతంలో విపక్షంలో ఉన్న  వైసీపీ ఫిర్యాదు మేరకు, ఐపిఎస్‌లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా.. ఇప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ,బీజేపీ ఫిర్యాదు మేరకు,  రాష్ట్ర ఎన్నికల సంఘం  ఐపిఎస్, డీస్పీ, సీఐలపై కొరడా ఝళిపించింది. అంటే విపక్షంలో ఏ పార్టీ ఉన్నా, వారికి పోలీసులే టార్గెట్ అవుతున్నట్లు ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం లేదని విమర్శించిన వారే, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులకు కితాబు ఇవ్వడం మరో వైచిత్రి.

 

 


ఈవిధంగా ఇద్దరు నేతలు.. తమకు అధికారం లేనప్పుడల్లా, పోలీసు వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడం పోలీసులకు మనస్తాపానికి గురిచేస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తు, కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్డుపైనే జీవితం గడుపుతున్న తమను.. రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిలో, ముద్దాయిలుగా మార్చడాన్ని పోలీసులు భరించలే కపోతున్నారు. రాజకీయ పార్టీలు, తమ స్వార్ధం కోసం పోలీసు వ్యవస్థపై బురద చల్లడం వల్ల.. పోలీసులు నైతిక సైర్థ్యం కోల్పోతే నష్టపోయేది, పౌర సమాజమేనని స్పష్టం చేస్తున్నారు. తాము లేకుండా,  అడుగు కూడా ముందుకు వేయలేని రాజకీయ నాయకులు, వారి స్వార్థం కోసం తమనే అవమానించడం అనైతికమంటున్నారు. గతంలో చంద్రబాబు, జగన్  విపక్ష నేతలుగా ఉన్నప్పుడు నిర్వహించిన పాదయాత్రలకు.. ఎండనక, వాననక వారికి భద్రత కల్పించింది తామేనన్న విషయాన్ని మర్చిపోకూడదని స్పష్టం చేస్తున్నారు.

 

 


ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, పోలీసు వ్యవస్థ లేకపోతే మనుగడ అసాధ్యమన్న విషయాన్ని, గ్రహించకపోవడం దురదృష్టకరమన్ను ఆవేదన వ్యక్తమవుతోంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఫ్యాక్షనిస్టుల దాడుల్లో నేతలతో పాటు, అనేకమంది పోలీసులు కూడా నిహతులవుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, కొందరు పోలీసు అధికారులు కూడా వెన్నుముక లేకుండా, పోస్టింగుల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పాలకులకు ఊడిగం చేస్తున్నందుకే.. రాజకీయ పార్టీలకు తాము చులకన అవుతున్నామని వివరిస్తున్నారు. మొత్తానికి ఏపీలో  రాజకీయ పార్టీల పుణ్యాన, పోలీసులు  ‘అనుమానితుల జాబితా’లో చేరడం దురదృష్టకరం.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner