ఇది..  పాల‘కుల’ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?

526

ఇది..  పాల‘కుల’ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?
పాలకుడే కుల ప్రస్తావన తీసుకురావచ్చా?
అధికారులకు కులాన్ని పాలకుడే ఆపాదిస్తారా?
సీఎంగా చేసిన ప్రమాణం మరిచారా?
కుడుతున్న జగన్ కదిపిన కులం తేనెతెట్టు
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘ ఈ నిమ్మగడ్డ రమేష్ అనే పెద్ద మనిషిని మేం నియమించలేదు. ఆయనను చంద్రబాబు నాయుడు నియమించారు. ఆయనది చంద్రబాబు సామాజికవర్గం’
– స్థానిక సంస్థల వాయిదాపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్య ఇది.
‘ రాష్ట్రంలో వచ్చింది కరోనా వైరసా? లేక కమ్మ వైరసా?’
– ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శ
‘ ఏపీలో సీఎం జగన్ కమ్మ సామాజికవర్గంపై పడ్డారు. కమ్మ సోదరులు జాగ్రత్తగా ఉండాలి. మేల్కొని పోరాటానికి సిద్ధం కావాలి. వారి పోరాటానికి నా మద్దతు ఉంటుంది. వ్యాపారపరంగా జగన్ కమ్మ కులం కావాలి. కానీ రాజకీయాలకు వద్దా? నిమ్మగడ్డ రమేష్‌కు సీఎం నుంచి ప్రాణభయం ఉంది’
– బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్య
కులం కంపు ఆంధ్రాను వదలదు.  ఆంధ్రప్రదేశ్ కూడా కులపిచ్చిని వీడదన్నది వీరిద్దరి వ్యాఖ్యలు చూస్తే స్పష్టమవుతోంది. అన్ని కులాలు, మతాలు ఓట్లు వేసి గెలిస్తే, అధికారంలో వచ్చిన రాజకీయ పార్టీ.. కులాలనే కేంద్రంగా చేసుకుని పరిపాలించడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. కులాలు, మతాలు, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి, స్వయంగా మీడియా సమావేశంలో ఓ అధికారికి కులాన్ని అంటగట్టి, ఆయన తీసుకున్న నిర్ణయానికి దానిని ముడిపెట్టడం, బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. ఆఖరిసారి కూడా కావాలన్నది ప్రజాస్వామ్యవాదుల కోరిక!
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌కు, అత్యంత ప్రీతిపాత్రుడైన ఐఏఎస్ అధికారి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటికి బంధువని చెబుతుంటారు. ఆయన ఎన్టీఆర్ ఉండగా, తొలుత లక్ష్మీపార్వతికి సన్నిహితుడన్న పేరు కూడా లేకపోలేదు. కాబట్టి, ఆయనకు-చంద్రబాబుకూ పెద్దగా సంబంధాలు లేవంటారు. కానీ, ఆయన కూతురుకు బాబు సర్కారులో ఒక విభాగంలో ఉద్యోగం ఇవ్వడాన్ని, పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే, న్యాయశాస్త్రంలో ఉన్నతస్థాయి విద్య చదివిన ఆమెను.. పలుదేశాలతో జరిగే ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పూర్తి చేసే  న్యాయవిభాగంలో, ఆమె ఒక అధికారిగా పనిచేశారు. ఇదీ.. ఒకే కులానికి చెందారని జగన్ చెబుతున్న,  చంద్రబాబు-నిమ్మగడ్డ రమేష్‌కు ఉన్న అనుబంధం.


స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు- నిమ్మగడ్డ-చంద్రబాబు కులానికి లంకె పెట్టడం మోకాలికీ, బోడిగుండుకూ ముడిపెట్టడం లాంటిదే. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, తన ప్రభుత్వంలోనే పనిచేసే ఒక అధికారి తీసుకున్న నిర్ణయాన్ని, తప్పు పట్టడం ఒక ఆశ్చర్యమయితే, ఆయనకు కులాన్ని ఆపాదించడం మరో తప్పు. దీనివల్ల సీఎంగా ఆయన చేసిన ప్రమాణానికి అర్ధం లేకుండా పోయింది. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన తర్వాత వచ్చిన వైఎస్ కూడా, ఈవిధంగా ఏనాడూ ప్రవర్తించలేదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బాబు నియమించిన వ్యక్తులను, పెద్దాయన ఎప్పుడూ విమర్శించలేదు. ఇప్పటిలా రాజీనామా చేసి వెళ్లిపోవాలని బెదిరించలేదు. చంద్రబాబు కూడా వైఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నియమించిన, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని విమర్శించలేదు. తొలగించలేదు.  టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి కాంగ్రెస్‌కు చెందిన చక్రపాణి, శాసనమండలి చైర్మన్‌గా ఉండేవారు. మండలిలో టీడీపీ బలం ఉన్నందున, ఆయనను తొలగించాలని చాలామంది పార్టీ నేతలు బాబుపై ఒత్తిడి చేసినా, ఆయన దానిని పట్టించుకోలేదు. ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత మాత్రమే, పార్టీ వారిని ఆ పదవిలో నియమించారు.
జగన్ సీఎం అయిన తర్వాత, కమ్మ సామాజికవర్గంపై అణచివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నది, మనం మనుషులం అన్నంత నిజం. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తనకు ప్రజాదరణ ఉన్నప్పటికీ, తాను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటి కీ, కమ్మ సామాజికవర్గం ఒక్కతాటిపైకి వచ్చి, టీడీపీకి ఆర్ధిక-మానవ వనరులు అందించడం వల్లే తాను ఐదులక్షల ఓట్లతో ఓడిపోయానన్న కసి, ఇప్పటికీ ఆయనలో పోలేదని చెబుతుంటారు. ప్రధానంగా కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని కమ్మ వ్యాపారులు, భూస్వాములు టీడీపీకి ఎన్నికల సమయంలో భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడం వల్లనే,  తన పార్టీ గెలవలేకపోయిందని, ఆయన అప్పట్లో తన పార్టీ వారికి చెప్పేవారట. అందుకు తగినట్లుగానే, అమరావతిలో భారీగా స్థలాలు కొన్న వారిలో ఎక్కువమంది కమ్మవారే కాబట్టి, అక్కడ నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. కోట్లాది రూపాయల ధర ఉన్న ఆ స్థలాలకు, విలువ లేకుండా చేయడం ద్వారా, వారిని ఆర్ధికంగా బలహీనపరచాలన్నదే ఆయన అసలు లక్ష్యంగా కనిపిస్తుంది.


అలాగే రాష్ట్రంలో ఉన్న వైన్‌షాపులు, బార్లలో మెజారిటీ శాతం కమ్మ వారి చేతిలో ఉన్నందున.. వైన్‌షాపులు రద్దు చేసి, వారి ఆర్ధిక మూలాలు దెబ్బతీశారు. ఇసుక ర్యాంపుల సంగతీ అంతే. కమ్మ-కాపు కులానికి చెందిన చిన్న-పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వవద్దని, జగన్ ఆదేశించారన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. బిల్లులు చెల్లిస్తే, మళ్లీ వారు స్థానికంగా టీడీపీకి, ఆర్ధికంగా దన్నుగా నిలుస్తారన్న ముందుచూపే దానికి కారణమంటున్నారు.


ఈవిధంగా రాష్ట్రంలో బలమైన ఆర్ధికశక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని, ఆర్ధికంగా బలహీనం చేసే పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న జగన్.. రాజకీయంగా మాత్రం ఆ కులానికి చెందిన కొందరిని తెరపైకి తీసుకురావడమే ఆశ్చర్యం. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో, బాబు పేషీలో కనిపించే కమ్మ వ్యాపారవర్గం బాగా లాభపడింది.  ఇంకా రాజకీయాల్లోకి రాని లగడపాటి రాజగోపాల్ వంటి వారు, ఎక్కువగా బాబు పేషీలోనే కనిపించేవారు. ఆ తర్వాత వైఎస్ పాదయాత్రలో లగడపాటి కీలకపాత్ర పోషించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత, అదే వర్గం వెంటనే వైఎస్‌కు చేరువయింది. ఆయన పేషీలో కూడా వారే దర్శనమిచ్చేవారు. ఇక సినిమా ప్రముఖుల సంగతి సరేసరి. మళ్లీ అదే వర్గం బాబు సీఎం అయిన తర్వాత, ఇటు చేరింది.  జలనాగరికతను బాగా గ్రహించే స్వభావం ఉన్న కమ్మ సామాజికవర్గం, ముఖ్యంగా వ్యాపారవర్గం.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందన్నది బహిరంగ రహస్యమే.
జగన్ వైసీపీ స్థాపించిన తర్వాత, ఆయన పక్కన ఎక్కువగా కనిపించడంతోపాటు, జగన్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన వారిలో కమ్మ వారే ఎక్కువ ఉండటం విశేషం. అదే వర్గానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్, కోనేరు ప్రసాద్,  జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వంటి పారిశ్రామికవేత్తలతోపాటు,  హీరో అక్కినేని నాగార్జున, నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీ అధినేతకు సన్నిహితులే. వీరిలో కోనేరు జగన్‌తో పాటు జైలులో ఉండగా, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం సెరిబియాలో జైలు శిక్ష అనువిస్తున్నారు. పీవీపీ, కోనేరు పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేశారు.

ప్రస్తుతం నరసరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు, విశాఖ ఎంపి ఎం.వి.వి.సత్యనారాయణ కూడా కమ్మ వర్గానికి చెందిన వారే. మంత్రివర్గంలో ఉన్న కొడాలి నానిని కమ్మ కోణంలో, చంద్రబాబుపై అస్త్రంగా సంధిస్తుండటం విశేషం. ఆయననే ముందుపెట్టి, టీడీపీ-చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల జగన్ వద్దకు చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభ నేని వ ంశీ, కరణం బలరాంతోపాటు దేవినేని అవినాష్ కూడా కమ్మ వర్గానికి చెందిన వారే. గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కమ్మ వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అసలు జగన్‌కు చాలా ఏళ్ల నుంచి సలహాదారుగా ఉన్న తలశిల రఘురాం కూడా, కమ్మ వర్గానికి చెందిన వారే కావడం విశేషం.


అంటే.. ఒకవైపు తమ కులానికే చెందిన పారిశ్రామికవేత్తల నుంచి ఆర్ధికంగా లాభపడిన జగన్, రాజకీయంగా మాత్రం ఆ కులాన్ని ఎందుకు అణచివేయాలని చూస్తున్నారన్న ప్రశ్న.. ఆ సామాజికవర్గంలో వినిపిస్తోంది. పోనీ రాజకీయంగా కూడా మూడు, నాలుగు జిల్లాల్లో తమ వర్గమే వైసీపీని కాపాడిందని గుర్తు చేస్తున్నారు. తమ వర్గంపై ద్వేషం ఉన్న జగన్.. మరి తమ వర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులను మాత్రం తన పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారు? వారెలా పనికివస్తారని  ప్రశ్నిస్తున్నారు. ప్రకాశంలో కరణం బలరాం, విజయవాడలో ఎమ్మెల్యే వంశీ, అవినాష్‌ను ఏవిధంగా చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయంగా కమ్మకులం అవసరం కాబట్టే, తమ వర్గాన్ని తీసుకుంటున్నారని కమ్మ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. నిజం ‘జగన్నా’ధుడికి ఎరుక?!

1 COMMENT