ఈసీ నిర్ణయం వెనుక కేంద్రం?

307

కేంద్రానికి చెప్పిన తర్వాతనే ఎన్నికలు వాయిదా?
అందుకే ఐఏఎస్, ఐపిఎస్‌లపై చర్యలు
చక్రం తిప్పిన సుజనా చౌదరి
ఫలించిన కన్నా ఫిర్యాదు
బీజేపీ నేతలపై దాడులతో అడ్డం తిరిగిన కథ
సుప్రీంలో తేల్చుకోనున్న జగన్ సర్కారు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేంద్రంతో జగన్ సర్కారు సంబంధాలు దివ్యంగానే ఉన్నాయి. ఇద్దరి బంధం తెరచాటున విజయవంతంగానే కొనసాగుతోంది. ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకుంటున్నారు. అయినా.. సార్వత్రిక ఎన్నికల స్థాయిలో..  ఐఏఎస్, ఐపిఎస్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వెనుక, కచ్చితంగా కేంద్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
తన నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకొచ్చి, ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు, నిమ్మగడ్డను పెద్దగా ఆశ్చర్యపరిచి ఉండకపోవచ్చు. కానీ,  ఆయన తన కులానికి, తన నిర్ణయానికి జగన్ లింకు పెడతారని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. అయితే, ఈ విషయంలో ఓ రిటైరయిన అధికారి, ఎలాంటి దన్ను లేకుండా నేరుగా జగన్ వంటి వ్యక్తితో ఢీకొడతారనుకోవడం పొరపాటే. ఆ ప్రకారంగా.. ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్, కే ంద్రంతో సంప్రదించిన తర్వాతనే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినట్లు, తర్వాత ఆయన విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది.
జాతీయ స్థాయి సంస్థలను సంప్రదించిన తర్వాతనే,  ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నటు,్ల నిమ్మగడ్డ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీన్నిబట్టి.. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక కేంద్రం ఉన్నట్లు అర్ధమవుతోంది. దానికి బీజేపీ ఎంపీలయిన జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టిజి వెంకటేష్.. కే ంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలసి ఇచ్చిన లేఖలు కూడా పనిచేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల అక్రమాలు, తమ పార్టీ అభ్యర్ధులపై వైసీపీ దాడులపై గవర్నర్, కేంద్రానికి చేసిన ఫిర్యాదులు కూడా, ఎన్నికల వాయిదాకు దోహదపడ్డాయి. పైగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచీ వైసీపీకి అనుకూలంగా పోలీసు, రెవిన్యూ యంత్రాంగం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని, కన్నా లక్ష్మీనారాయణ ఎప్పటికప్పుడు గవర్నర్, కేంద్రం దృష్టికి తీసుకువెళుతూనే  ఉన్నారు. అయినా ఆ  విషయాన్ని, జగన్ సర్కారు పట్టించుకోకపోవడం కూడా, ఈ నిర్ణయానికి మరో కారణంగా కనిపిస్తోంది.
అమిత్‌షాను కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. వైసీపీ సర్కారు పాలనపై విరుచుకుపడ్డారు. జగన్ సర్కారుకు పోలీసులు, ఎన్నికల సంఘం తొత్తుల్లా మారాయని ధ్వజమెత్తారు. కేరళ, బెంగాల్ సర్కారు మాదిరిగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని, పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ అరాచకాలపై న్యాయ, పంచాయితీరాజ్ శాఖ మంత్రులకు ఫిర్యాదు చేయాలని అమిత్‌షా తమకు సూచించారని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతే, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. దీన్నిబట్టి.. కేంద్రం జోక్యంతోనే ఎన్నికలు వాయిదా, ఐఏఎస్-ఐపిఎస్‌లపై బదిలీ వేటు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ప్రధానంగా.. కే ంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ఏవిధంగా అధికార దుర్వినియోగం చేస్తుందన్న అంశాలను ఆయన,  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆధారాలతో సహా అందించారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్ధులను కూడా వైసీపీ నేతలు విడిచిపెట్టకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్న క్రమంలో, ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోకపోతే.. పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం కోల్పోవడంతోపాటు, మౌనంగా ఉంటే వెళ్లే చెడు సంకేతాల గురించి, సుజనా కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ తర్వాతనే ముగ్గురు ఎం.పీలు అమిత్‌షాకు ఫిర్యాదు చేయడం, జీవీఎల్ కూడా వైసీపీ సర్కారుపై తొలిసారి విరుచుకుపడటం జరిగిపోయాయి.
అటు సుజనా, కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదులకు తగ్గట్లుగానే.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బీజేపీ అభ్యర్ధులు, నాయకులపై వైసీపీ నేతలు భౌతిక దాడులకు పాల్పడటాన్ని, కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు నిమ్మగడ్డ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత మండలంలో, ఒక దళిత మహిళ చేయి నరికివేయడం, చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా, అడ్డుకుని వైసీపీ నేతలు సృష్టించిన బీభత్సాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఈ క్రమంలో రాష్ట్రంలో విపక్షాలన్నీ కట్టకట్టుకుని, ఎన్నికల ప్రకియలో చోటు చేసుకున్న అక్రమాలను, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికలను రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశాయి. దానికంటే ముందు.. కరోనా వైరస్ కల్లోలం దృష్ట్యా, ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ-బీజేపీ డిమాండ్ చేశాయి. ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా, కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, జనం పోగయ్యే సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. స్వయంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో, అమిత్‌షా బహిరంగసభను కూడా కరోనా కారణంగా రద్దు చేసింది.  సరిగ్గా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేష్ కూడా, అదే కరోనా వైరస్ కారణంగా, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. దీనితో.. ఎన్నికల సంఘం,  జగన్ సర్కారు దూకుడుకు ముకుతాడు వేసినట్లు, తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

సుప్రీంకోర్టులో సర్కారు వాదన నిలుస్తుందా?

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో.. దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో యుద్ధానికే జగన్ సర్కారు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, అది కోర్టులో ఎంతవరకూ నిలుస్తుందన్న చర్చకు తెరలేచింది. ఎందుకంటే.. రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ కింద ఏర్పడిన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాటి అధికారాలు ఉంటాయో, ఆర్టికల్ 243-కె, 243 జడ్ ఏ కింద ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్లకూ, స్వతంత్ర ప్రతపత్తి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గతంలో కిషన్‌సింగ్ తోమర్ వర్సెస్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ కేసు (5756/2005)లో సుప్రీంకోర్టు, 2006 అక్టోబర్ 19న ఓ  తీర్పు వెలువరించింది. ఆ ప్రకారం.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ల ప్రాధాన్యతలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆదేశించింది. ఆ కమిషన్లు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దాని ప్రకారం జగన్ సర్కారు వాదన సుప్రీంకోర్టులో ఎంతవరకూ నిలుస్తుందో చూడాలి.
‘జగన్ ప్రభుత్వం ఎన్నికల సంఘంపై చేస్తున్న ఒత్తిళ్లు, ప్రధానాధికారికి కులాన్ని ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలు చూస్తే, రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి హైకోర్టు న్యాయమూర్తి హోదా  ఉంటుందని తెలిసీ, సీఎం స్థాయి వ్యక్తి రాజ్యాంగబద్ధ హోదా ఉన్న అధికారికి కులాన్ని అంగట్టడం శోచనీయమ‘ని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.