సెహభాష్.. కేసీఆర్!

354

బార్లు, స్కూళ్లు, యూనివర్శిటీల మూత
ఈవెంట్లు, సభలు, సమావేశాలకు నో పర్మిషన్
కరోనాపై సత్వర చర్యలు
ప్రజారోగ్యంపై సర్కారు శ్రద్ధ
           (మార్తి సుబ్రహ్మణ్యం)
‘కరోనాపై ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. అది ఒక పారాసిట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది’.. అసెంబ్లీలో ఈ మాట చెప్పిన తెలంగాణ సీ.ఎం కేసీఆర్, ఇప్పుడు వాస్తవంలోకి వచ్చి, కరోనాపై యుద్ధం ప్రకటించడం అభినందనీయం. గతంలో కూడా ఆయన అనేక అంశాలపై ఇదేవిధంగా మాట్లాడి, తర్వాత వాస్తవంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి, తెలంగాణను తాక కుండా, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడం  ద్వారా, ప్రజల ప్రాణాలను రక్షించే పనిలో పడినట్లు, ఆయన ప్రకటించిన చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
భారతదేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అనుమానిత రోగుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా రైళ్లు, విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోతోంది.  కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో ఆ వ్యాధి బారిన పడిన బాధితుల కేసులు చూసిన తర్వాత.. తెలంగాణ కేసీఆర్ రంగంలోకి దిగారు. వైద్యశాఖను అప్రమత్తం చేశారు. కరోనా వైరస్ ఇతరులకు సోక కుండా ఉండేందుకు, తీసుకున్న ముందస్తు చర్యలు ప్రజలను మెప్పించాయి. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించిన కేసీఆర్, వాటిని మూసివేయాలని ఆదేశించారు. ప్రధానంగా వందలు, వేల సంఖ్యలో ఒకచోట చేరే అవకాశాలున్న సినిమా హాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, స్కూళ్లను కొద్దికాలం మూసివేయాలన్న కేసీఆర్ నిర్ణయంతో.. ప్రజలను ప్రమాదం బారినుంచి రక్షించినట్టయింది.
కరోనాను ఎదుర్కొనేందుకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తూ, కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్లు సిద్ధం చేశారు. కరోనాను ఎదుర్కొని, దాని వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా.. మార్చి 31వ తేదీ వరకూ అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ పాఠశాలలు, యూనివర్శిటీలు మూసివేయాలని నిర్ణయించారు. ఫంక్షన్ హాళ్లు మూసివేత, బహిరంగ సభలు, ఈవెంట్లు, వర్క్‌షాపులు, ఉత్సవాలు, కల్చరల్ ఈవెంట్లకు అనుమతులు రద్దు చేశారు. దానితోపాటు ఇండోర్-అవుట్ డోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, పార్కులు, మ్యూజియాలు, థియేటర్లు, బార్లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్న,  సాహసోపేత నిర్ణయం తీసుకుని ప్రజలను మెప్పించారు. దుబాయ్‌లో కూడా అక్కడి ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి నిర్ణయాలే ప్రకటించడం విశేషం.
అటు వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ కూడా, కరోనా వైరస్ ప్రచార నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఆయన నగరంలోని గాంధీ ఆసుప్రతికి తరచుగా వచ్చి, అక్కడి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ అనుమానిత రోగుల వద్దకు వచ్చి, ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన సౌకర్యలపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ జనాభా, విస్తరణ, వలస కారణాలతో ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. ప్రధానంగా నగరంలో ఈవెంట్ల సంఖ్య, వేలాది మంది ఒకేచోట చేరే ప్రాంతాల సంఖ్య పెరగుతోంది. ఇది కరోనా వ్యాప్తికి కారణం కాకుండా చేసేందుకు, కేసీఆర్ సర్కారు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటం అభినందనీయం. తాజాగా కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలన్నీ, ప్రభుత్వానికి ఆర్ధికంగా నష్టం తీసుకువచ్చేవే. వాటి వల్ల వందల కోట్ల ఆదాయం కోల్పోతుంది. తన నిర్ణయాల వల్ల ప్రభుత్వం  కోల్పోయినప్పటికీ, అంతిమంగా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయడం ద్వారా.. తనకు ప్రజల సంక్షేమమే ప్రధానమని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసినట్టయింది.