నలుగుతున్న నాలుగో సింహం!

571

ఏపీలో పోలీసుల దారెటు?
 కోర్టు కన్నెర్ర చేసిన వైనం
ఐపిఎస్, డీఎస్పీ, సీఐలపై ఎన్నికల సంఘం బదిలీ కొరడా
మరి పోలీసు అధికారుల సంఘం ఎక్కడ?
పోస్టింగుల కోసం పరువు తీస్తారా?
ఖాకీవనంలో ఆవేదనపర్వం
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశంలో తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విచారణ, నేరగాళ్ల పట్టివేత, నక్సల్స్ ఏరివేత, గంజాయి రవాణా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ-తెలంగాణ తర్వాతనే ఎవరైనా అన్న పేరు సాధించారు. కానీ, గత ఆరేళ్ల నుంచి ఏపీ పోలీసుల పనితీరు తలదించుకునేలా ఉంది. పోస్టింగుల కోసం ఆశపడి, పోలీసు శాఖ పరువు తీస్తున్న వైనం ఆవేదనకు గురిచేస్తోంది. జనాలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసులు, సర్కారులో ఎవరు అధికారంలో ఉంటే, వారి భజనగాళ్లుగా మారుతున్న దృశ్యాలు నాలుగో సింహాన్ని నగుబాటు పాలుచేస్తున్నాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగోసింహం, కొన్నిచోట్ల  పెంపుడుజంతువు అవతారం ఎత్తడం,  పోలీసు వ్యవస్థను ప్రేమించే వారిని కలచివేస్తోంది. అధికారం శాశ్వతం కాదన్న వాస్తవం, ఏడాది క్రితమే రుజువయినా, ఇంకా పోలీసులు అదే భ్రమల్లో జీవించడమే బాధాకరం.

నానా యాతన పడుతున్న నాలుగో సింహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా పోలీసులే నామినేషన్లను చించివేయడం, అభ్యర్ధులకు రక్షణ కల్పించకపోగా, వారిపై జరుగుతున్న దాడులను కళ్లప్పగించి చూస్తుండటం క్షంతవ్యం కాదు. ప్రజాప్రతినిధిపై హత్యాయత్నం జరిగితే, మరొక పోలీసు అధికారి రక్షించి సరిహద్దులు దాటించిన వైనం చూస్తే.. ఏపీలో పోలీసు దుస్తులు ఎవరికి కాపలాకాస్తున్నాయన్న సందేహం ఎవరికైనా వస్తుంది. చివరకు పోలీసు బాసును హైకోర్టు బోనెక్కించి, నిబంధనలు చదివించడం చూస్తే, నాలుగో సింహం పాలకుల ఒత్తిళ్లకు ఎంత నలిగిపోతోందో అర్ధమవుతోంది. క నిపించని నాలుగో సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడాలి. కానీ ఆంధ్రాలో నాలుగో సింహమే నానా యాతన పడుతుండటం విచారకరం.

కోర్టు వ్యాఖ్యలు కనువిప్పు కావాలి

అధికారం శాశ్వతం కాదన్న హైకోర్టు వ్యాఖ్య, పోలీసు వ్యవస్థకు కనువిప్పు కావాలి. అంటే పోలీసు వ్యవస్థ ఏ దారిలో నడుస్తుందో, ఎవరి ఆదేశాలు పాటిస్తుందో  హైకోర్టు వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. విశాఖలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, సీఆర్పీపీసీ సెక్షన్ 155  కింద నోటీసు ఇచ్చి, అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించారు. దాడులకు తెగబడ్డ వారిని నియంత్రించడం బదులు, దాడులకు గురైన వారికి నోటీసులిచ్చి, అరెస్టు చేసి వెనక్కి పంపించడం బహుశా దేశ చరిత్రలో అదే ప్రధమం. ఒక సెక్షన్ గురించి హైకోర్టు, పోలీసు బాసును వివరణ కోరి, దానిని కోర్టు హాలులోనే చదివించడం కూడా ఇప్పుడే చూస్తున్నాం.  దానిపై హైకోర్టు సంధించిన ప్రశ్నలకు పోలీసు బాసు వద్ద జవాబు లేకపోగా, అది తప్పేనని అంగీకరించడం బట్టి.. పోలీసు వ్యవస్థ సొంతగా నిర్ణయాలు తీసుకోవటం లేదని, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. పోనీ, ఆ చర్య తర్వాతయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే, పోలీసుల చేతులు పాలకుల చేతుల్లో బంధింపబడ్డాయని స్పష్టమవుతోంది.

కోర్టు కన్నెర్రతో  పోయిన ఖాకీల పరువు

   ‘మీరు ఈ రాష్ట్రానికే డీజీపీ. రాష్ట్రంలో చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం మీ బాధ్యత. హైకోర్టు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. రాష్ట్రంలో చట్టనిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదు. అందుకు ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. మా దగ్గర చాలా కేసులు ఉదాహరణగా ఉన్నాయి. అసలు ఇది రాష్ట్రమా? మరొకటా? అసైన్డ్ భూముల్లోకి పోలీసులు వెళ్లి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. అక్కడ వారికేం పని? పోలీసుల చర్యలు హద్దు మీరుతున్నాయి. ఇలాగైతే మేం కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తాం. మిగతాది అదే చూసుకుంటుంది. ప్రభుత్వాలు వస్తాయి.పోతాయి. అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలి. న్యాయపాలన సాగించడం ఇలాగేనా? అసలు రాజధాని గ్రామంలో అంతమంది పోలీసులెందుకు’ అని హైకోర్టు శరపరంగా  డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించడం..  ఎంతో కష్టపడి సాధించుకున్న పోలీసుల ప్రతిష్ఠకు నిస్సందేహంగా తలవంపులే.

పోలీసు అధికారుల సంఘం ఇప్పుడేమంటుంది?

ఈ వ్యవహారంలో, పోలీసు అధికారుల సంఘం నేతలు కూడా విమర్శల పాలవుతున్నారు. విపక్షాలు తమ బాసులపై విమర్శలు చేసినప్పుడే తెరపైకి వచ్చే ఈ నేతల తీరు, ఇటీవలి కాలంలో ఆక్షేపణీయంగా మారింది. డీజీపీపై విమర్శలు చేసినందుకు.. చంద్రబాబు నాయుడు, వర్లరామయ్యపై సంఘం నేతలు విరుచుకుపడ్డారు. వర్ల రామయ్యపై సవాళ్లు కూడా విసిరారు.  అయితే, తాజాగా హైకోర్టు కూడా స్వయంగా డీజీపీని పిలిపించి, శాంతిభద్రతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్రంలో శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తాడిపత్రి, రాయదుర్గం సీఐలను బదిలీ చేయాలని ఆదేశించారు. మాచర్ల సీఐని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గుంటూరు, చిత్తూరు ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.  మరి పోలీసు అధికారుల సంఘం నేతలు, అలవాటు ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిపై కూడా  అదే విధంగా విరుచుకుపడతారా? అన్నది ప్రశ్న.  పోలీసులు పరిశుద్ధులని, అనవసరంగా రాజకీయ నాయకులు తమపై బురద చల్లితే సహించమని వీరంగం వేసిన పోలీసు అధికారుల సంఘం నేతలు మరి ఇప్పుడేమంటారు? టీడీపీ హయాంలో కూడా ఇదే అధికారుల సంఘం, పోలీసు బాసులపై వైసీపీ నేతలు విమర్శించినప్పుడు, ఇదే తరహాలో మీడియా ముందుకొచ్చి వైసీపీ నేతలను దునుమాడిన విషయాన్ని విస్మరించకూడదు.

డీజీపీలుగా ఎవరున్నా.. అంతేనా?

నిజానికి డీజీపీలుగా ఎవరున్నా, పాలకులు చెప్పినట్లు నడచుకోవలసిందే. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీలుగా పనిచేసిన ఒకరిద్దరు తప్ప, మిగిలిన వారంతా దానికి అతీతులు కాదు. నిఘా దళపతి పోస్టు కూడా అంతే. అది మరీ ముళ్లకిరీటం. ఆ పోస్టు వల్ల లాభం కంటే తర్వాత నష్టాలే ఎక్కువ ఉంటాయన్నది ఏ.బి. వెంకటేశ్వరరావుకు పోస్టింగు ఇవ్వకుండా, వేధిస్తున్న విషయం చూస్తే అర్ధమయి తీరాలి. నిఘా బాసులుగా పనిచేసిన వారంతా, అధికారపార్టీ ఆత్మలుగా తర్వాత ముద్రపడిన వారే. ఈ విషయంలో ఆంధ్రా పాలకులు, ఒక్క వెంకటేశ్వరరావునే ప్రత్యేకంగా చూడటమే ఆశ్చర్యం.  జగన్ తండ్రి హయాంలో పనిచేసిన నిఘా బాసులు చేసిన పనికూడా అదే! సూటిగా చెప్పాలంటే, పాలకుల మనసు గెలిచిన వారే ఆయా పోస్టుల్లో కూర్చుంటారు. ముక్కుసూటి అధికారులను ఆ పోస్టులో నియమించేందుకు,  ఏ పాలకులూ సాహించరు.
అయితే, సర్కారు ఇష్టాలకు కాకుండా స్వతంత్రంగా వ్యవహరించిన అధికారులూ లేకపోలేదు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఎం.వి.కృష్ణారావు నియామకమే అప్పట్లో పెద్ద ఆశ్చర్యం. అసలు అలాంటి ముక్కుసూటి అధికారిని, చంద్రబాబు ఎలా కమిషనర్‌గా నియమించారో ఎవరికీ అర్ధం కాలేదు. తాను మీకు తగనని, మీరు చెప్పినట్లు వినలేనని ఆయన కూడా బాబుకు స్పష్టం చేశారు. అయితే, మీకు నచ్చినట్లు చేయమని బాబు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని హైదరాబాద్‌కు వస్తే, అరెస్టు చేస్తామని ప్రకటించిన అధికారి కూడా కృష్ణారావే. మరో సీనియర్ అధికారి మహంతి కూడా ఎవరి మాట వినేవారు కాదు. ప్రభుత్వానికి కంటగింపుగా ఉండే ఒవైసీని, దారిలో పెట్టిన ఘనత మహంతిదే. ఇక పాలకుల అడుగులకు మడుగులొత్తే అధికారులు కూడా లేకపోలేదు. ఆ విధంగా పోలీసు శాఖలో చెడుతో పాటు మంచి-నిజాయితీ కూడా కనిపిస్తుంటుంది.

పోయేది పోలీసుల పరువే బాసూ..!

తాజాగా హైకోర్టు అక్షింతలు వేసింది నేరుగా పోలీసులకే అయినప్పటికీ, దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో ఇప్పుడు అలాంటి జవాబుదారీ వ్యవస్థ బదులు, ఎవరేమనుకుంటే నాకేమిటన్న లెక్కలేనితనం దర్శనమిస్తోంది. ఇప్పటికే వరస వెంట వరస కోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తున్నా, పాలకులు దానిని ఖాతరు చేయడం మానేశారు. తనను పిలవడం లేదు కదా? తాను ఏరి కోరి నియమించుకున్న వారే కోర్టులో అక్షింతలు వేయించుకుంటారన్న విచిత్ర ధోరణి కనిపిస్తోంది. కాబట్టి, పోస్టింగుల పట్ల కృతజ్ఞత, ఇతర మొహమాటాలు విడిచి.. విధి నిర్వహణలో కాఠిన్యం  ప్రదర్శించకపోతే, మళ్లీ పోయేది పోలీసుల పరువే!

ఉమ్మడి రాష్ట్రంలో కఠినంగా వ్యవహరించిన బాబు

ఉమ్మడి రాష్ట్ర పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. శాంతిభద్రతల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మాట ఖాతరు చేయలేదు. ప్రధానంగా హైదరాబాద్‌లో కఠినంగా వ్యవహరించే పోలీసు అధికారులనే నియమించారు. గుంటూరు ఎస్పీగా పనిచేసిన సీతారామాంజనేయులును మార్చాలని కోడెల శివప్రసాద్ సహా, మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలంతా వచ్చి బాబును కోరినా..  ఆయన అంగీకరించలేదు. మీరే ఆయనతో సర్దుకుపోవాలని సూచించారు. సీతారామాంజనేయులు కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు, అప్పటి టీడీపీ నేత భూమా నాగిరెడ్డి,  ఆయనతో పడుతున్న ఇబ్బందులను మీడియాకు చెప్పి వాపోయారు. వచ్చిన అధికారులతో పనిచేయించుకోవాలి తప్ప, వచ్చిన వారిని వద్దనడం మంచిదికాదని బాబు, తమ పార్టీ నేతలకు క్లాసులు పీకేవారు.
దానిపై టీడీపీ ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా,  బాబు వైఖరిని గుర్తు చేసుకుంటున్న నేతలు, ఆయనను  తప్పుపడుతూనే ఉన్నారు. ఐఏఎస్, ఐపిఎస్‌లను నెత్తిన ఎక్కించుకుని, తమను నిర్లక్ష్యం చేశారని రుసరుసలాడుతున్నారు. జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్న విమర్శలూ వినిపిస్తుంటాయి. బాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా,  హైదరాబాద్‌లో మంత్రులుగా పనిచేసిన వారెవరూ బాబు హయాంలో,  ఒక్క సీఐ పోస్టింగు కూడా తమ వారికి వేయించుకోలేకపోయారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు బాబు అంత ప్రాధాన్యం ఇచ్చినందుకే, ఆయన హయాంలో మతఘర్షణలు, ఇతర అల్లర్లు జరగలేదు.

రాష్ట్రం విడిపోయిన తర్వాతనే బాబులో మార్పులు

కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాతనే ఆయనలో పెను మార్పులు వచ్చాయి. అంతకుముందు,  కాంగ్రెస్ హయాంలో పోస్టింగుల కోసం, ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వారు. బాబు ముఖ్యమంత్రి  అయిన తర్వాత, అదే సంస్కృతిని కొనసాగించారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు సూచించిన వారికి పోస్టింగులిచ్చారు. డీఎస్పీ, సీఐ పోస్టింగుల్లో ఎమ్మెల్యేల మాట వేదవాక్కయింది. గుంటూరు జిల్లాలో పోలీసు పోస్టింగులన్నీ, ఒక ఎమ్మెల్యే ఇష్టానికి వదిలేశారు. రాష్ట్రంలో కూడా పోలీసు బదిలీల వ్యవహారంలో, సదరు ఎమ్మెల్యే కీలకపాత్ర పోషించారు. దానితో పోలీసుల పనితీరులో మార్పు వచ్చి, వారు అధికార పార్టీ అనధికార ప్రతినిధుల్లా మారిపోయారు.
సత్తెనపల్లి, నర్సరావుపేట వంటి నియోజకవర్గాల్లో.. పోలీసు పోస్టింగులను యువనేత ఒకరు, లక్షల్లో అమ్ముకున్నారన్న విమర్శలు వినిపించాయి. వైసీపీకి చెందిన స్థానిక నేతను కిడ్నాప్ చేసి, అంబటి రాంబాబుపై దాడి చేసినా పోలీసులు, ఆ యువనేతకు భయపడి చర్యలు తీసుకోలేకపోయారు. ఆ రెండు నియోజకవర్గాల్లో సదరు యువనేత అరాచకాలపై ఫిర్యదులొచ్చినా, చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోయారు.  అయినప్పటికీ, పోలీసు వ్యవస్థ ఈ స్థాయిలో దిగజారి, విమర్శల పాలు కాలేదు. విపక్షంలో ఉన్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి, కనుమూరి బాపిరాజు, రవీంద్రరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రఘువీరారెడ్డి,  వంటి నాయకుల మాటకు పోలీసు ఉన్నతాధికారులు విలువ ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి విలువలు భూతద్దం వేసినా కనిపించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇప్పుడు ఖాకీల మెడపై కత్తి పెట్టి పాలన

కానీ, గత పదినెలల నుంచీ జరుగుతున్న పరిణామాలు, అందులో పోలీసుల ప్రేక్షకపాత్ర చూస్తుంటే.. హైకోర్టు వ్యాఖ్యలు నిజమేననిపించక మానదు. స్థానిక సంస్థల ఎన్నికల ఏకగ్రీవంలో, పోలీసులే ప్రధాన పాత్ర పోషించారన్నది,  మనం మనుషులం అన్నంత నిజం. అధికార పార్టీ నేతలు పోలీసుల మెడపై కత్తి పెట్టి, ఎన్నికలను ఏకపక్షం చేయించుకున్న ఘటనలకు వీడియోలే సాక్షి. పోలీసులు అక్కడే ఉన్నా, అధికార పార్టీ కార్యకర్తలు లెక్కచేయకుండా, దాడులకు తెగబడిన వైనం చూస్తే.. నాలుగో సింహం ఎంత నగుబాటు పాలయిందో తెలుస్తుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బృందం.. పోలీసులపై స్వయంగా డీజపీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా, ఆ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటే.. పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న వారే శాశ్వతంగా అధికారంలో ఉంటారన్న వెర్రి భ్రమలు, ఆదాయం వచ్చే పోస్టింగుల కోసం.. అధికార పార్టీ వారికి ఊడిగం చేసే లొంగుబాటునైజమే, నాలుగోసింహం నగుబాటుకు అసలు కారణం. మరి ఏపీలో నాలుగో సింహం నవ్వేరోజులు ఎప్పుడు వస్తాయో?!