జగనన్న చెప్పారు.. ఈసీని రద్దు చేసేయండి!

120

ఈసీకి అధికారాలు లేవన్న జగన్
మరి గతంలో వైసీపీ చేసిన ఫిర్యాదుల మాటేమిటి?
స్థానిక ఎన్నికల వాయిదాపై జగన్ ఆగ్రహం
నిమ్మగడ్డపై గవర్నర్‌కు ఫిర్యాదు
ఆయనది బాబు కులమని నేరుగా ఆరోపణ
అసలు కోడ్ ఉండగా సీఎం ప్రెస్‌మీట్ పెట్టవచ్చా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
తన దాకా వస్తే గానీ తెలియన్న సామెతను, తన వరకూ వస్తే గానీ ఏపీ సీఎం జగనన్న తెలుసుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఉత్తర్వులు, జగన్‌కు మింగుడుపడలేదు. పైగా తాను ఏరి కోరి నియమించుకున్న ఐఏఎస్-ఐపిఎస్, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేయడాన్ని ఆయన సహించలేకపోతున్నట్లు, జగన్ ఏపీలో తొలిసారి నిర్వహించిన ప్రెస్‌మీట్ స్పష్టం చేసింది. ఒక అధికారిపై, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆరోపణలు కురిపించడం, ఆ హోదాకు ఉన్న విచక్షణాధికారాలను ప్రశ్నించడంతోపాటు, ఎన్నికల సంఘం ప్రధానాధికారిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం,  చరిత్రలో ఇదే ప్రధమం.

దేశంలో రాజరికం, జమీందారీ వ్యవస్థ పోయి, ప్రజాస్వామ్య పాలన వచ్చిన విషయాన్ని జగన్‌కు ఇంకా గుర్తుకురాకపోవడం ఆశ్చర్యం. అధికారంలో ఉన్నందున, ఎన్నికలు సహా మిగిలిన అన్ని అంశాలూ ఆయా పార్టీకే ఉండాలని, ఆ విషయంలో ఎన్నికల సంఘం ఎవరని జగన్ వేసిన ప్రశ్న అమాయకమా? మెజారిటీ తెచ్చిన మితిమీరిన ఆత్మవిశ్వాసమా? అనిపిస్తుంది. 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినందున, ఇక తానేం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లు సాగిన ఆయన వాదన, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసేదే. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటయిన ఎన్నికల కమిషన్ నిర్ణయాలను సైతం ప్రశ్నించడంతోపాటు, ఆ హోదాలో ఉన్న వ్యక్తికి కులాలను ఆపాదించడం ఆక్షేపణీయం.

గత ఎన్నికలకు ముందు, భారత ఎన్నికల కమిషన్‌లో ఎక్కువ శాతం మంది గుజరాతీయులనే నియమించారన్న విమర్శ మీడియాలో వచ్చింది. పీఎంఓ, ఇతర కీలక స్థానాలను కూడా, గుజరాతీయులతో నింపేశారన్న కథనాలు వచ్చాయి. కానీ, ఏ రాజకీయ పార్టీ కూడా దానిని ప్రశ్నించి, విమర్శించలేదు. ఏపీలో మాత్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ కమ్మ వ్యక్తి అయినందున, అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఆ పదవి ఇచ్చారన్న జగన్ విమర్శ, ముఖ్యమంత్రి స్థాయిని తగ్గిస్తుంది. ఎవడో రాసిచ్చింది ఆయన చదువుతున్నాడన్న, ఏకవచన సంబోధ ప్రయోగం సీఎంకు రాజ్యాంగ వ్యవస్థపై, ఏమాత్రం గౌరవం లేదన్న విషయాన్ని బయటపెట్టింది.

ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు? అధికారులను బదిలీ చేయడానికి ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు? ఆ అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఇక అన్నీ ఆయనే చేస్తే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు? అంటూ ఎస్‌ఈసీపై శరపరంపరగా సంధించిన ప్రశ్నాస్త్రాలు చూస్తే.. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగపరమైన వ్యవస్థలూ, తాను చెప్పినట్లే చేయాలన్న జగన్ తపన అర్ధమవుతూనే ఉంది. ఆ ప్రకారం.. ఇటీవల తన ప్రభుత్వ నిర్ణయాలను ఆక్షేపిస్తూ, వ్యతిరేక తీర్పులు ఇస్తున్న హైకోర్టు కూడా, తాను చెప్పినట్లే నడచుకోవాలని జగన్ కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే అలాంటి అవకాశం-అధికారం లేక న్యాయవ్యవస్థను విడిచిపెట్టినట్లు కనిపిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ అనే అధికారి, గతంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు కార్యదర్శిగా పనిచేశారు. అలాంటి అధికారి తీసుకున్న నిర్ణయాలపై, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం మరో విడ్డూరం. ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌పై ఫిర్యాదు చేయడం కూడా బహుశా ఇదే తొలిసారి.

ఇక ఎన్నికల సంఘం విచక్షణాధికారంపై జగన్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలే వింతగా అనిపిస్తున్నాయి. విచక్షణాధికారం అనే పదాన్ని ఇప్పుడే వింటున్నానని, జగన్ ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలో ఉన్న ఆగ్రహం, అది కట్టబెట్టిన రాజ్యాంగంపై ఆయన కసి ప్రెస్‌మీట్‌లో స్పష్టంగానే కనిపించాయి. సీఎంగా తనకున్న విచక్షణాధికారంతోనే కదా.. ఇటీవల సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను తొలగించి కొత్త వారిని నియమించుకుంది? సీఎంగా ఉన్న వ్యక్తికే అంత విచక్షణాధికారం ఉంటే, రాజ్యాంగబద్ధ సంస్థకు ప్రతినిధిగా ఉన్న అధికారికి ఇంకెంత ఉండాలి?  గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఇదే వైసీపీ విపక్షంలో ఉండి, నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా, అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, డజన్ల మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వారంతా టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించింది. ఫలితంగా ఎన్నికల సంఘం తన విచక్షణాధికారాలతోనే.. సీఎస్ పునేఠా, ఏడీజీ వెంకటేశ్వరరావు, రాహుల్‌దేవ్‌వర్మ, వెంకటరత్నం, కోయ ప్రవీణ్‌ను బదిలీ చేసింది. అదే అధికారాలతో ఎల్సీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమించింది.  ఆ విషయం ఇప్పుడు సీఎం అయిన జగన్ మర్చిపోయి, అదే ఎన్నికల సంఘం విచక్షణాధికారాలను ప్రశ్నించడమే విడ్డూరం.

‘ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎక్కువ అధికారాలుంటాయా? అలాగైతే రాష్ట్రాన్ని కూడా ఆయనే పాలించవచ్చు కదా’? అన్న జగన్ ప్రశ్న.. తన రాష్ట్రంలో ఏ రాజ్యాంగపరమైన వ్యవస్థ అయినా సరే, తాను చెప్పిందే వినాలన్న శాసించే ధోరణి స్పష్టంగా కనిపించింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం సహా, అన్ని వ్యవస్థలూ, అధికారాలూ ఎన్నికల సంఘం చేతిలోనే ఉంటాయి. బదిలీలు, కొత్త పథకాలు, పాత పథకాల కొనసాగింపు వంటి అంశాలన్నీ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అమలుకావలసిందే. ఆ సమయంలో ప్రభుత్వాలది ఉత్సవ విగ్రహాల పాత్రనే. ఇది జగన్ పుట్టకముందు నుంచీ, భారతదేశంలో కొనసాగుతున్న సంప్రదాయం. గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై ప్రతిపక్షంగా వైసీపీ ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు అదే పాత్ర పోషిస్తున్న టీడీపీ కూడా అదే పనిచేసింది. ఎన్నికల సంఘం అప్పుడూ స్పందించింది. ఇప్పుడూ స్పందించింది. ఇందులో తేడాను జగన్ గమనించకపోవడమే ఆశ్చర్యం. జగన్ చెప్పినట్లు.. బాబు సీఎంగా పనిచేసిన కమ్మ వర్గ అధికారులు, ఇప్పుడు జగన్ దగ్గర కూడా పనిచేస్తున్నారు. మరి వారిని జగన్ తొలగించగలరా? ఈసీ తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి.. తన రాష్ట్రంలో అసలు ఎన్నికల సంఘం అవసరం లేదని, దానిని కూడా రద్దు చేయగలరా? అన్నది ప్రశ్న. తాజాగా ప్రెస్‌మీట్‌లో ఎస్‌ఈసీపై నిప్పులు కురిపించిన జగన్ తీరు పరిశీలిస్తే.. తనకే అలాంటి విచక్షణాధికారాలు ఉంటే, నిమిషంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేసేవారనిపించింది.

అసలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించవచ్చా? అన్నది మరో సందేహం.  గతంలో ఇలాంటి సందర్భాల్లో ఆయా ముఖ్యమంత్రులు, ఈసీని ముందస్తు అనుమతి కోరేవారు. ఈసీ అనుమతించిన తర్వాతనే, మీడియా ముందుకొచ్చేవారు. ఒకవేళ ఈసీ అనుమతించకపోతే, పార్టీ నేతలతో ప్రెస్‌మీట్లు పెట్టించేవారు. అలాంటిది ఏపీ సీఎం జగన్, ఎవరి అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్ నిర్వహించారన్నది ప్రశ్న. ఎన్నికలు వాయిదా పడినప్పటికీ, ఎన్నికల కోడ్ అమలవుతుందని ఎస్‌ఈసీ రమేష్ విస్పష్టంగా ప్రకటించారు. అయినా, దానిని ధిక్కరించడం జగన్‌కే చెల్లింది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారంలో, చంద్రబాబు-నిమ్మగడ్డ రమేష్ కుమ్మక్కయారన్నట్లుగా మాట్లాడిన జగన్.. బీజేపీ కూడా ఎన్నికల వాయిదాకు డిమాండ్ చేసిందన్న విషయాన్ని మర్చిపోవడమే విడ్డూరం. తన ప్రభుత్వ నిర్ణయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించకుండా, తరచూ తన శత్రువైన టీడీపీనే దునుమాడే,  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ఏపీలో నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదని, స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని, బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై, బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా విరుచుకుపడుతోంది. అంటే జగన్ దృష్టిలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే, కేవలం 23 సీట్లకు పరిమితమయిన టీడీపీనే, అధికారులపై  ప్రభావితం చేయగల పార్టీ అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక కరోనాను సాకుగా చూపి, ఎన్నికలను వాయిదా వేయడాన్ని జగన్ మండిపడటం మరో ఆశ్చర్యం. కరోనాను తనను రాజకీయంగా ఆదుకుంటున్న కేంద్రమే, జాతీయ విపత్తుగా ప్రకటించింది. కరోనాను దృష్టిలో ఉంచుకునే, హైదరాబాద్‌లో నిర్వహించ  తలపెట్టిన అమిత్‌షా బహిరంగసభను కూడా వాయిదా వేశారు. స్వయంగా బీజేపీ కూడా కరోనాపై చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్వాగతించారు. వారిద్దరు అసలు ఎన్నికల ప్రక్రియనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంటే జగన్ వ్యాఖ్యల ప్రకారం.. బీజేపీ వైఖరిని కూడా జగన్ తప్పుపడుతున్నారని అర్ధం చేసుకోవాలి