ఈ వాయిదా.. ఎవరికి ఫాయిదా?

0
150

కరోనా ఇప్పుడే గుర్తుకొచ్చిందా?
ఎన్నికల వాయిదాతో వైసీపీకే లాభం
నైతికంగా మాత్రం వైసీపీకి  నష్టమే
బాబు, విపక్షాలకు మిగిలింది నైతిక విజయమే
మధ్యలో అప్రతిష్ఠ పాలయింది అధికారులే
ఎన్నికలు రద్దు చేస్తేనే విపక్షాల గెలుపు
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడం వల్ల, ఎవరికి లాభమన్న ఆసక్తిరకమైన చర్చకు తెరలేచింది. అయితే, దానికి ఎన్నికల సంఘం  కరోనా వైరస్‌ను కారణంగా చూపించడమే ఆశ్చర్యం. నిజానికి, కరోనా కల్లోలం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే విజృంభిస్తోంది. కరోనా వ్యాపించకుండా, స్థానిక సంస్థలను రద్దు చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు, ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సూచించాయి. అయినా, దానిని ఖాతరు  చేయని ఎన్నికల సంఘం, ఇప్పుడు హటాత్తుగా కరోనా సాకుతో, ఆరు వారాల పాటు వాయిదా వేయడం విస్మయపరుస్తోంది.
అయితే, ఈ వాయిదా వల్ల ఏ పార్టీకి లాభమన్న చర్చ నేపథ్యంలో, కచ్చితంగా అది అధికార పార్టీకే లాభమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకపోతే, ఈ నిర్ణయం నైతికంగా వైసీపీకి నష్టమేనంటున్నారు.  అధికారపార్టీకి సహజంగా అధికార యంత్రాంగం అనుకూలంగా ఉంటుంది. అలాంటి అవకాశం విపక్షాలకు ఉండదు. అసలు విపక్షపార్టీల అభ్యర్ధులకు, నామినేషన్లు వేసే అవకాశమే కనిపించడం లేదు. నామినేషన్లు వేసిన చోట, గెలుపు కోసం మంత్రాంగం చేసేందుకు ఈ వాయిదా ప్రకటన పనికివస్తుంది. ఎన్నికల సంఘం పోలీసు అధికారులను బదిలీ చేసినప్పటికీ, వారిని మరొక ప్రాంతానికి పంపిస్తారు. అక్కడ కూడా వారు చేసే పని అదే కాబట్టి.. బదిలీ వల్ల పెద్దగా లాభమేమీ ఉండదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తే, వారిని అనర్హులుగా ప్రకటిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటివరకూ  మద్యాన్ని పంపిణీ చేసి, దొరికిపోయిన వారిలో వైసీపీ నేతలే ఎక్కువ. పైగా గుంటూరు జిల్లాలో విపక్ష నేతల ఇళ్లలో, పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టి సీసీ కెమెరాలకు దొరికిపోతున్నారు. కాబట్టి.. ఎన్నికలు వాయిదా వేసినా, అంతిమంగా అది అధికార పార్టీకే లాభిస్తుంది.
ఇక ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేయడం వల్ల, విపక్షాలకు వచ్చిన లాభమేమీ కనిపించడం లేదు. కాకపోతే, అధికార వైసీపీ అక్రమాలు, పోలీసుల పక్షపాతం, అధికారుల ప్రేక్షకపాత్రను బట్టబయలు చేయడంలో మాత్రం టీడీపీ, బీజేపీ,జనసేన విజయం సాధించాయి. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలు, సీఐలపై చర్య తీసుకోవడం ద్వారా.. కొద్దిరోజుల నుంచి ఎన్నికల అక్రమాలపై, మీడియా ద్వారా విరుచుకుపడుతున్న చంద్రబాబునాయుడుకు నైతిక విజయం లభించింది. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై బహిరంగంగా విరుచుకుపడుతూ, పోలీసుల పక్షపాతాన్ని ఎండగడుతున్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రమకు తగిన ఫలితం దక్కినట్టయింది. ముగ్గురు బీజేపీ ఎం.పీలు, ఎన్నికల అక్రమాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా.. ఐపిఎస్ అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేయగలిగారు. ఇది తప్ప.. ఎన్నికల వాయిదా వల్ల విపక్షాలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
నిజానికి రాష్ట్రంలో టీడీపీ,బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు.. మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసి ఉంటే, వారి పోరాటానికి ఫలితం దక్కి ఉండేది. అలా కాకుండా, ఇప్పటికే ఏకగ్రీవం అయిన ప్రాంతాలను మినహాయించి, ఇకపై జరిగే ఎన్నికలను మాత్రమే వాయిదా వేయడం వల్ల, ఎన్నికల సంఘం ఏం సాధించిన్నది ప్రశ్న. కాకపోతే, తమ ఆరోపణలు నిజమని ఎన్నికల సంఘం కూడా గుర్తించిందన్న సంకేతాన్ని, ప్రజలకు పంపించడంలో మాత్రం విపక్షాలు విజయం సాధించాయి. బీజేపీ అధ్యక్షుడు కన్నా సైతం, అసలు మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అప్రతిష్ఠ పాలయింది మాత్రం కచ్చితంగా పోలీసు, రెవిన్యూ అధికారులే. వారు ఎన్నికల ప్రక్రియను, ఒత్తిళ్లకు లొంగకుండా సక్రమంగా నిర్వహించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్‌తో భేటీ సందర్భంగా, గవ ర్నర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.