సంజయుడి సారథ్యంలో కమలం విక సిస్తుందా?

878

బీజేపీ ‘బండి’ని లాగుతారా?
సీనియర్లు సహకరిస్తారా?
తొలిసారి గ్రామీణానికి పట్టం
(మార్తి సుబ్రహ్మణ్యం)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తల అంచనాలు నిజం చేస్తూ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎం.పీ బండి సంజయ్ ఎంపికయ్యారు. యువకుడు, తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు వర్గానికి చెందిన సంజయ్ ఎంపిక, తెలంగాణ కమలదళాల్లో కొత్త ఆశలు రేపింది. దూకుడుగా వెళ్లే సంజయ్ నియామకంతో, రాష్ట్ర బీజేపీలో నవశకం ఆరంభమవుతుందన్న ఆకాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీ చరిత్రలో తొలిసారి, హైదరాబాదేతర జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడం సాహసోపేతమే. ఇప్పటివరకూ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ అంతా హైదరాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే. దానితో బీజేపీ బలమంతా హైదరాబాద్‌కే పరిమితమయింది. ఆయా అధ్యక్షులు కూడా జిల్లాలలో కాకుండా, హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు సాగించేందుకే పరిమితమయ్యారు. కిషన్‌రెడ్డి హయాం నుంచే జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు, అధ్యక్షుల పర్యటనలు పెరిగాయి. అంతకుముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి, రాష్ట్రంలో విస్తృతంగా తిరిగి, పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు. తెలంగాణ బీజేపీ జిల్లా నేతలు కూడా, తమ జిల్లాలలో పార్టీని పటిష్టపరిచే బదులు హైదరాబాద్‌లోనే తిష్టవేసేవారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, పార్టీ ఉనికి మాయమయిపోయింది.  మొత్తంగా తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ పార్టీగా మిగిలిపోయింది.

అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయిదు నుంచి ఒక్క సీటుకు పార్టీ బలం పడిపోయింది. చివరకు హైదరాబాద్ పార్టీగా ఉన్న బీజేపీ, అదే హైదరాబాద్‌లో చతికిలపడిపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. అయితే, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మోదీ మంత్రం పనిచేసిన ఫలితంగా, అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుని, అధికార టీఆర్‌ఎస్‌కు చెమటలు పట్టించింది. ఈ విజయంతో పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం పెరిగింది. కానీ, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టికృషి, వ్యూహరచన, సరైన ప్రచారం లేక  మళ్లీ చతికిలపడటం వారిని కుంగతీసినట్టయింది. అసెంబ్లీ ఉప ఎన్నికలో నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు రావడంపై విస్మయం వ్యక్తమయింది. అక్కడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని  తెలిసినప్పటికీ, ఆ నియోజకవర్గంలో సరైన నేత కు బాధ్యత అప్పగించి, ముందస్తు కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లనే, దారుణ పరాజయం పాలయిందన్నది సీనియర్ల విమర్శ.

ఈ నేపథ్యంలో నాయకత్వాన్ని మార్చి, లక్ష్మణ్ స్థానంలో, అదే సామాజికవర్గానికి చెందిన సంజయ్‌కు పగ్గాలిచ్చింది. దీనితో యువకులకు పార్టీ అవకాశం ఇస్తోందన్న సంకేతాలిచ్చింది. నిజానికి సంఘ్‌కు ఆత్మీయుడైన సంజయ్ నియామకంపై, చాలారోజుల నుంచి ఊహాగానాలు వినిపించాయి. ప్రజాసమస్యల పరిష్కారంపై పోరాటం, సర్కారుపై విమర్శలలో దూకుడుగా వెళ్లే సంజయ్‌కు, పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా, దశాబ్దాల తరబడి జిల్లా పార్టీ శ్రేణులలో గూడుకట్టుకున్న నిరాశను, నాయకత్వం తొలగించింది. సమర్ధులు, యువతకు అవకాశాలు ఉంటాయన్న సంకేతం ఇచ్చింది.

అయితే, ఇప్పటివరకూ కరీంనగర్ కార్పొరేషన్, జిల్లా స్థాయి రాజకీయాలకే పరిమితమైన సంజయ్, అనేక బాధ్యతలు మోయాల్సి ఉంది.  బీజేవైఎంలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయి రాజకీయాలు, పార్టీ అంతర్గత రాజకీయాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అవగాహన, నాయకుల మధ్య సమన్వయం, జిల్లాలలో పార్టీ నిర్మాణంపై ఆయన ఎంత త్వరగా అవగాహన పెంచుకుంటే, అంత త్వరగా రాణించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయే అంశాలు, వర్గాలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం పోరాటం, రాష్ట్ర కమిటీ కూర్పు, పార్టీలో యువతకు అవకాశాలు లేకుండా చేస్తున్న ప్రజల్లో బలం కోల్పోయిన సీనియర్లకు స్థానచలనం, పని తక్కువ-ప్రచారం ఎక్కువ సంస్కృతికి తెరదించడం, మీడియాలో కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలతో పార్టీని పరుగులుపెట్టించడం,  రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలను విడవకుండా వేళ్లాడుతున్న సీనియర్ల స్ధానంలో యువతను ప్రోత్సహించడం, సీనియర్లతో సమన్వయం వంటి అంశాలు సంజయుడికి సవాలే. వీటికి మించి.. రాష్ట్ర బీజేపీలో నిర్ణయాలన్నీ నలుగురైదుగురికే పరిమితమవుతున్నాయన్న విమర్శలకు తెరదించడంలోనే సంజయ్ సత్తా ఏమిటన్నది స్పష్టం కానుంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, ఆర్ధిక వనరులు, పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలన్నీ ఆ నలుగురైదుగురికే పరిమితం చేశారన్న విమర్శలు తెలిసినవే.

రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటివరకూ అనుసరించిన విధానాలు, తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో విబేధించి దూరమైన సీనియర్లకు, మళ్లీ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. రాష్ట్ర నాయకత్వాలు తీసుకున్న నిర్ణయాలను విబేధించిన చాలామంది సీనియర్లను, ఆయా అధ్యక్షులు పక్కకుపెట్టారు. ఫలితంగా వారు పార్టీలోనే ఉన్నా, అప్పటి చురుకుదనంతో పనిచేయడం మానేశారు. ఉదాహరణకు సీనియర్ నేత, వివిధ అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడటంతోపాటు, దూకుడుగా వెళ్లే జీ.ఆర్.కరుణార్ వంటి నేతలకు.. ఇప్పుడు పార్టీలో స్థానం, గుర్తింపు లేదు. ఆయన సేవలను వాడుకోవడంలేదు.ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. జిల్లాల వారీగా,  ఇలాంటి వారిని గుర్తించడంలోనే సంజయుడి పనితీరు, నాయకత్వ ప్రతిభ  ఆధారపడి ఉంది.

ఇక పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వరన్నది ఒక విమర్శ.  చాలాకాలం నుంచీ పాతుకుపోయిన సీనియర్లు,  వారంతట వారే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న విమర్శలకు, బీజేపీ సదర్ తెరదించాల్సి ఉంది. లక్ష్మణ్ నాయకత్వంలో ఇటీవల కొన్ని జిల్లా బాధ్యతలు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అప్పగించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో కూడా అలాంటి నియామకాలు జరిగినప్పుడే, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిలో నమ్మకం కల్పించవచ్చని, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఎం.పి గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సభ స్థాయిలో, ఇప్పటిదాకా తెలంగాణ బీజేపీలో ఒక్క సభ జరిగిన దాఖలాలు గానీ, నిర్వహించిన దాఖలాలు గానీ లేవు.వేలాదిమందితో, తెలుగుదేశం పార్టీ మహానాడు స్ధాయిలో గరికపాటి నిర్వహించిన సభను చూసి, పార్టీ జాతీయ దళపతి నద్దా కూడా ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చే వారిని ప్రోత్సహిస్తే, ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానికి గరికపాటి నిర్వహించిన సభ ఒక ఉదాహరణగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా, కొందరు అగ్రనేతలు సర్కారు పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శపైనా, దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగరంలో వాజపేయి విగ్రహానికి స్థలం సేకరించడంలో, రాష్ట్ర నాయకులు విఫలమయ్యారన్న విమర్శ ఉంది.
ముఖ్యంగా.. సంజయ్‌కు, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెను సవాలు. హైదరాబాద్‌లో పనిచేసే నాయకులంటే, పని కంటే ప్రచారంపై దృష్టి సారించే వారి సంఖ్యనే ఎక్కువన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. శాలువలు,ఫ్లెక్సీలు, పత్రికాప్రకటనల వంటి హడావిడే తప్ప, ప్రాంతీయ పార్టీల మాదిరిగా.. క్షేత్రస్ధాయిలో ప్రజాసమస్యలపై పోరాడే తత్వం పోయిందన్న విమర్శలను కూడా,  పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. నగరానికే చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎక్కువ సమయం పార్టీకి కేటాయిస్తున్నందున, ఆయనతో కలసి గ్రేటర్ ఎన్నికలపై దృష్టిసారించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో కలసి,  కార్పొరేషన్‌లో అధికారం పంచుకున్న బీజేపీ బలం, తర్వాత దారుణంగా పడిపోయింది. పాతనగరంలో కూడా పార్టీని విస్తరింపచేస్తేనే, ఫలితాలు వస్తాయంటున్నారు.

సంజయ్ సారథ్యంలో అధికారంలోకి వస్తాం: సంకినేని

రాష్ట్ర బీజేపీ సారథిగా నియమితులయిన,  బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి  వస్తుందని, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.
‘ యువకుడైన సంజయ్ నియామకంతో యువతరంలో ఉత్సాహం వచ్చింది. ఇక పార్టీలో నవతరానికి ప్రోత్సాహం ఉంటుంది. ఈ విషయంలో పార్టీ నాయకత్వం సరైన నిర్ణయమే తీసుకుంది. అనుభవాలే అన్నీ నేర్పుతాయి. ఒక జిల్లా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడయ్యారంటే.. కింది స్థాయి సమస్యలు, అంశాలపై అవగాహన ఉన్నట్లే లెక్క. రాజకీయాల్లో జిల్లాల్లో నెగ్గడం ఆషామాషీ వ్యవహారం కాదు. సంజయ్‌కు రాష్ట్ర పార్టీ అంతా అండగా ఉంటుంది. ఆయన సారథ్యంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న ఆదరణ, అభిమానం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా, సంజయ్ నాయకత్వంలోని రాష్ట్ర పార్టీ పనిచేస్తుంద’ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకి నేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

1 COMMENT

  1. […] నిత్యం క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్ధులతో యుద్ధం చేసే, టీడీపీ-కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తేనే పార్టీ కింది స్థాయికి వెళుతుంది. ఆ రెండు పార్టీలు అధికారం ఉన్నా, లేకున్నా ప్రజలు-మీడియా మధ్యలోనే ఉంటారు. ధర్నాలు చేయడం, ప్రజలను సమీకరించడం, వారికోసం అధికారుల వద్దకు వెళ్లి, పనులు చేయించే సంస్కృతిలో పనిచేయడంవల్ల, ప్రజలకూ వారిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే సొంత డబ్బు ఖర్చు పెట్టి, నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారే, ఇప్పుడు పార్టీకి అవసరం ఉంది. మూస ఆలోచనలు, మూస నాయకులు, అదే 50 మందితో బహిరంగసభలు, ఇళ్ల నుంచి రాజకీయాలు చేసే బీజేపీ నాయకుల కంటే.. ప్రత్యర్ధులతోదేనికయినా సిద్ధపడే, కాంగ్రెస్-టీడీపీ నుంచి వచ్చిన వారికి పగ్గాలివ్వడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి.. సంజయుడి సారథ్యంలో కమలం విక సిస్తుందా… […]