జగనన్న చెబితే ఏంటట?

471

సీఎం ఆదేశాలను లెక్కచేయని ఉత్తరాంధ్ర నేతలు
బరిలోకి కూతుళ్లు, కొడుకులు
శ్రీకాకుళంలో జగనన్నను పట్టించుకోని వైసీపీ నేతలు
తప్పుకుంటామన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్
విశాఖలో మంత్రి అవంతి  కుమార్తె నామినేషన్
వైసీపీలో పెరుగుతున్న ధిక్కారం
(మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధినేత, ఏపీ సీ.ఎం జగన్మోహన్‌రెడ్డికి అక్కడ చట్టాలు, అధికార వ్యవస్థనే సాగిలబడుతోంది. ఎమ్మెల్యే, ఎం.పీ, మంత్రులే ఆయనను చూసి హడలిపోతుంటారు. కానీ, ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు మాత్రం.. జగనన్నను అసలు లెక్కచేయడం లేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా, తాము అనుకున్నదే చేశారు. జగనన్న కాదన్నదే వారు అవునంటున్న ధిక్కార వైనమిది.
అతి తక్కువ సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించిన జగన్‌ను,  ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అవమానించేంత పని చే శారు. ఇందులో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు పోటీ చేయవద్దని, జగన్ ఆదేశించి మూడు రోజులయింది. అది పత్రికల్లో కూడా వచ్చింది. ఆయన నిర్ణయంపై, కింది స్థాయి నేతల్లో ఆనందం వ్యక్తమయింది. తమ అవకాశాలకు అగ్రనేతల కుటుంబాలు గండి కొట్టకుండా, జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. కింది స్థాయి నుంచే వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడే, ఇలాంటి విధానానికి శ్రీకారం చుట్టినందుకు, ప్రజలు కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. జగన్ నిర్ణయం వల్ల, స్థానికంగా కష్టపడి పనిచేసిన తమలాంటి వారికి, మేలు జరిగిందని కార్యకర్తలు సంబరపడ్డారు.

జగన్ నిర్ణయాన్ని ఒక్క శ్రీకాకుళం జిల్లా నేతలు తప్ప, దాదాపు మిగిలిన జిల్లా నేతలంతా క్రమశిక్షణతో పాటించారు. శ్రీకాకుళం, విశాఖ వైసీపీ నేతలు మాత్రం జగనన్న నిర్ణయాన్ని, బేఖాతరు చేయడం సంచలనం సృష్టించింది. విశాఖ రాజధానిగా మారుతుందన్న అత్యుత్సాహంతో ఉన్న ఉత్తరాంధ్ర వైసీపీ అగ్రనేతలు, చివరకు అధినేత ఆదేశాలను కూడా ఖాతరు చేయకపోవడం,  పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. స్వయంగా మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్‌లే ఎన్నికల బరిలోకి తమ కుటుంబసభ్యులను దింపడం ద్వారా, జగనన్న నిర్ణయాన్ని సవాల్ చేసినట్టయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో, శ్రీకాకుళం జిల్లా పోలాకి జడ్పీటీసీ స్థానానికి, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడం ద్వారా, జగనన్న నిర్ణయాన్ని నేరుగా  సవాల్ చేసినట్టయింది. అయితే, దీనిపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ వాదన పార్టీ నేతలను విస్మయపరిచింది. తన కుమారుడు పోటీ నుంచి విరమించుకుంటారని, తర్వాత ప్రకటించడంపై వైసీపీ స్థానిక నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు పోటీ చేయవద్దని.. జగన్ ఆదేశించిన విషయం తెలిసికూడా, కుమారుడితో నామినేషన్ వేయించడమే తప్పని విమర్శిస్తున్నారు. జగన్ ఆదేశాలు శిరసావహిస్తానని చెప్పిన కృష్ణదాస్.. మరి ఆ విషయం తెలిసికూడా, కొడుకుతో ఎలా నామినేషన్ వేయించారని ప్రశ్నిస్తున్నారు. జడ్పీ చైర్మన్ పీఠం కోసమే, ఆయన తనయుడిని రంగంలోకి దింపారంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం బంధువు కూడా, ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఇక విశాఖకు చెందిన మరో మంత్రి,  అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో, 6వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు రెడ్డి శ్రవణ్ జడ్పీటీసీ అభ్యర్ధిగా, విప్ ముత్యాలనాయుడు కుమారుడు రవికుమార్,  దేవరాపల్లి జడ్పీటీసీ అభ్యర్ధిగా నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే బంధువు, దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి జడ్పీటీసీ అభ్యర్ధిగా నామినేషన్లు వేయడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
వీరంతా ఒకవేళ పార్టీ నాయకత్వ హెచ్చరికలతో తర్వాత, వాటిని ఉపసంహరించుకున్నప్పటికీ.. నైతికంగా పార్టీ అధినేత జగనన్న ఆదేశాలయితే, బేఖాతరు చేసినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కష్టపడి పనిచేసిన తమ లాంటి వారిని తొక్కివేసి, తమ కుటుంబాల అధీనంలోనే అధికారం ఉండాలన్న ఆలోచనతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. చివరకు,  తమ పార్టీ అధినేత ఆదేశాలను కూడా, ఖాతరు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.