భలే ప్రజాస్వామ్యం బాసూ..!

179

ఏపీలో ఎన్నికలకు ముందే దౌర్జన్యకాండ
గతంలో ఎన్నికలప్పుడే దాదాగిరి
ఇప్పుడు నామినేషన్లప్పుడే హింసాకాండ
బీజేపీ అభ్యర్ధులపైనా హత్యాయత్నాలు
మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం
జగన్‌తో ఉన్న నిందితుల ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్
డీజీపీ ఆఫీసు వద్ద బాబు ధర్నా
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. రాజధర్మం నాలుగుపాదాల నడయాడుతోంది. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ, దేశానికే ఆదర్శంగా నిలిచింది. నిఘా యంత్రాంగం నేత్రాలు నిరంతరం, విప్పారుతున్నాయి. ఫలితంగా శాంతిభద్రతలు దివ్యంగా వెలిగిపోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు, అలనాటి శేషన్ రోజులను మరుపునకు తెస్తున్నాయి. ఏళ్లనాటి సంప్రదాయం, రికార్డులను బద్దలు కొడుతూ,  నామినేషన్ల సందర్భం నుంచే మొదలైన అహింసాయుత దృశ్యాలు, గాలి కంటే వేగంగా తీసుకుంటున్న పోలీసుల చర్యలు, అధికారుల నిస్పక్షపాత నిర్ణయాలు, ప్రజాస్వామ్యాన్ని పొదివి పట్టుకుని మరీ పరిరక్షించేలా మారుతున్నాయి. అందుకు ప్రజాస్వామ్య పిపాసులు వారికి ఎన్ని వేల దండాలు పెట్టినా తక్కువే!
అక్కడ కాంట్రాక్టర్లు  టెండరు ఫారం తీసుకోవాలంటే భయపడతారు. అసలు ఆఫీసుకు వెళ్లేవరకూ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. కష్టపడి కాంట్రాక్టు దక్కించుకున్నా, అక్కడి గ్యాంగులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎన్నికల్లో నామినేషన్లు వేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. నామినేషన్ దాఖలు చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఇది ఒకప్పుడు బీహార్‌లో కనిపించిన దృశ్యాలు. ప్రత్యర్ధుల ఇళ్లలో బాంబులు, కత్తులు పెట్టినవారే, తర్వాత పోలీసులను పిలిపించి అరెస్టు చేయిస్తుంటారు. ఇలాంటి సీన్లు  మనం, తమిళ సినిమాల్లో చూస్తుంటాం. కానీ,  ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
గతంలో ఎన్నికల సమయంలో హింస జరిగేది. బూత్‌ల స్వాధీనం, రిగ్గింగ్ జరిగేవి. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లి బావుల్లో పడేసేవారు.  కార్యకర్తలు, నేతలను ప్రత్యర్ధులు హతమార్చేవారు. అవి పోలీసు కేసులు, అరెస్టుల వరకూ వెళ్లేవి. కానీ, ఇప్పుడు పార్టీల పద్ధతి మారింది. అసలు నామినేషన్ వేయకుండానే ప్రత్యర్ధులను అడ్డుకుంటున్నారు. నామినేషన్‌కు ముందు కావలసిన సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా, అడ్డుకుంటున్న నయా సంస్కృతికి తెరలేచింది. అంటే ఎన్నిక.. రిటర్నింగ్ అధికారి ఆఫీసులోనే ముగిసిపోతోందన్నమాట. గత ఐదేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ యువనేత కోడెల శివరాం.. వైసీపీకి చెందిన ఓ నేతను కిడ్నాప్ చేయడంతోపాటు, అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగిన వైనంపై, నాడు విపక్షంలో ఉన్న వైసీపీ విరుచుకుపడింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి చేస్తే, దానిని నిరసించింది.  ఆ వీడియోలను ఇప్పుడు విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యమే నడుస్తోందని గుండెలవిసేలా అరిచింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీ అదే విధానాన్ని, కొత్త పద్ధతులు జోడించి దానిని  రాష్ట్రమంతటా విస్తరింపచేస్తోంది.

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సరికొత్త సంస్కృతికి తెరలేపాయి. గతంలో రాయలసీమ, పల్నాడుకే పరిమితమైన దౌర్జన్యకాండ, ఇప్పుడు యావత్ రాష్ట్రానికి విస్తరించింది. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా, నామినేషన్లు వే సేందుకు అడ్డుకున్న దాఖలాలు లేవు. కాకపోతే, కొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో  ప్రత్యర్ధులను బెదిరించి, ఎన్నిక ఏకగ్రీవం చేసుకునేవారు. ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ గ్రామాల్లో, అసలు నామినేషన్లు వేయకుండానే, దౌర్జన్యకాండకు దిగుతున్న వైనం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. అధికారాన్ని ఈ స్థాయిలో వాడుతున్న వైనం, ఇప్పుడే దర్శనమిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధులకు నో డ్యూస్ సర్టిఫెకెట్, క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకోవడంతో దౌర్జన్యకాండ ఆరంభమయింది. తర్వాత నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునే కొత్త సంస్కృతి అమలవుతోంది. ప్రతిపక్షాల బలహీనత, అధికారపార్టీ నేతల అధికార బలం ముందు  ప్రజాస్వామ్యం ఓడిపోతోంది. స్వయంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత జిల్లా అయిన, నెల్లూరు వెంకటాచలంలో బీజేపీ  అభ్యర్ధిని మణెమ్మ చేతిని, అధికారపార్టీ కార్యకర్తలు అమానుషంగా నరికివేసిన వైనం.. మాచర్లలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఓ హైకోర్టు న్యాయవాదిపై పట్టపగలే వందలమంది చూస్తుండగా అధికార పార్టీ కార్యకర్తలు హత్యాప్రయత్నానికి పాల్పడిన ఒళ్లు జలదరించే దృశ్యాలు చూసిన తర్వాత..  ఏపీలో ప్రజాస్వామ్యం బతుకు ఏవిధంగా ఉండబోతోందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, అడ్వకేట్ కలసి వెళుతున్న కారును అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుని, వెంటాడి రాళ్లు, కర్రలతో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చివరకు డీఎస్పీ కారును కూడా విడిచిపెట్టలేదు. వారి కారును ఆపి, కర్రతో దాడి చేసిన సందర్భంలో లాయర్ తీవ్రంగా గాయపడగా, కారును తెలంగాణ వైపు పరుగుపెట్టించి, ప్రాణాలు కాపాడుకోవలసిన పరిస్థితి. తమ పార్టీ అభ్యర్ధులను  నామినేషన్లు వేయించేందుకు విపక్షాలు ఏపీలో ఇంత ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోంది.

మాచర్ల నిందితుడితో వైసీపీ ప్రముఖులు..


అయితే, కర్రలతో దాడి చేసిన సదరు తురకా కిశోర్  వైసీపీ కార్యకర్త.. గతంలో జగన్ పాదయాత్ర, హోంమంత్రి, మాచర్ల ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌తో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని టీడీపీ మీడియాకు విడుదల చేసింది.  చివరకు ఆయన సహా మరో ఇద్దరిని అరెస్టు చేసి, వారిపై హత్యాయత్నం కే సులు పెట్టాల్సి వచ్చింది. తమ జోలికి వస్తే  ఏం చేయాలో అది చేస్తామని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బహిరంగంగానే హెచ్చరించారు. ఈ దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, డీజీపీ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. తమ పార్టీ నేతల వాహనాలు విధ్వంసమైన తీరు, దాడికి సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు.

కర్నూలు, కడప, నెల్లూరులోనూ..

కర్నూలు జిల్లాలో తమ పార్టీ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న వైనంపై ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమె జోక్యం చేసుకున్న తర్వాతనే అక్కడ పరిస్థితి సర్దుమణిగింది. తాజాగా నెల్లూరులో పెళ్లకూరు జడ్పీటీసీ అభ్యర్ధి టీడీపీ ఆఫీసు నుంచి వెళుతుండగా, ఎత్తుకెళ్లిన వైనంపై మాజీ మంత్రి పరసా రత్నం అడ్డుకున్నారు.  ఆయనపైనా దాడి చేసి, కారును ధ్వంసం చేశారు. కడపలో తమ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న వైనానికి నిరసనగా, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఎంపీడీఓ ఆఫీసు వద్ద ధర్నాకు దిగాల్సి వచ్చింది.

బీజేపీ-జనసేన అభ్యర్ధులకు తప్పని దాడులు..

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన బీజేపీ అభ్యర్ధులపై రాళ్లు, బీరుబాటిళ్లతో దాడి చేయడం, సదుంలో బీజేపీ అభ్యర్ధులపై దాడి  చేసిన వారిని అరెస్టు చేయడం బట్టి.. ఈ దౌర్జన్యాలు బీజేపీ-జనసేనకూ మినహాయింపు కాదని స్పష్టమయింది. కేంద్రంలో వైసీపీ సఖ్యతగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం బీజేపీతో వైసీపీ కయ్యం కొనసాగుతూనే ఉండటం విశేషం.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అటు పోలీసులు, ఇటు జిల్లా కలెక్టర్లు.. వీరందరినీ నడిపిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గానీ స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సహజంగా ఎన్నికలంటే ప్రభుత్వం సహా,  ప్రతిదీ ఎన్నికల సంఘం అధీనంలో ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం తొలిసారి ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తుండటం ఆశ్చర్యం.

నాడు బీహార్.. నేడు ఏపీ: కన్నా ఆగ్రహం

గతంలో బీహార్‌లో ఉన్న భయానక  పరిస్థితిని మించిన దౌర్జన్యాలు,  ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీహార్‌లో కూడా ఇన్ని దౌర్జన్యాలు జరిగాయని అనుకోవడం లేదన్నారు. విజయం సాధించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రుల అంతు చూస్తామని సీఎం బెదిరించడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం, పోలీసులపై తమకు నమ్మకం లేదని, పక్క రాష్ట్రం నుంచి పోలీసులను తెచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాను స్వయంగా డీజీపీని కలిసి పోలీసులపై ఫిర్యాదు చేసినా, వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ-జనసేన అభ్యర్ధులపై వైసీపీ గూండాయిజం చేస్తున్నా, పోలీసులు, జిల్లా యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు ఉండటం దారుణమన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడిన వైసీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక దళిత మహిళపై హత్యాయత్నం చేసిన తీరు సిగ్గుచేటన్నారు. అభివృద్ధి పనులతో గెలుస్తామన్న ప్రభుత్వానికి, గెలుపుపై నమ్మకం లేదని ఈ సంఘటనలు రుజువుచేస్తున్నాయని విమర్శించారు.  జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వం ఈ ఎన్నికల్లో బయటపడిందని మండిపడ్డారు. ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా, అడ్డుకుని హత్యాయత్నం చేయడాన్ని తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానన్నారు. బీజేపీ-జనసేన కార్యకర్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పోటీ చేయాలని పిలుపునిచ్చారు. వారికి రాష్ట్ర పార్టీ దన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇంత దారుణం ఎప్పుడూ లేదు: సుజనా చౌదరి

రాష్ట్రంలో ఇంత దారుణం, దౌర్జన్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదని బీజేపీ ఎం.పీ సుజనాచౌదరి విమర్శించారు. తమ పార్టీకి చె ందిన దళిత మహిళా అభ్యర్ధి చేయి నరకడం, వైసీపీ ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరులో జనసేన-బీజేపీ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం బట్టి, వైసీపీ ఎన్నికలంటే ఎంత భయపడుతుందో అర్ధమవుతోందని విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని, ఎవరూ ధైర్యం కోల్పోకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు.