వివేకా హత్య కేసును సీబీఐ తేలుస్తుందా?

590

ఇప్పటికే సాక్ష్యాలు సమాధి
ఇది జగన్‌కు ఎదురుదెబ్బేనా ?
(మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఎన్నికల ముందు ఏపీలో సంచలనం సృష్టించిన, మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్య కేసును, ఎట్టకేలకు సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టించింది. గత 11 నెలలుగా దానిపై సిట్ చేస్తున్న విచారణలో పస లేదని హైకోర్టు నమ్మినందుకే, కేసును సీబీఐకి ఇచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న, నాటి విపక్ష నేత -నేటి సీఎం జగన్.. ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నప్పటికీ.. కోర్టు మాత్రం, నాటి జగన్ వాదనను నెరవేర్చినట్లే భావించాల్సి ఉంది. జగన్ సీఎం అయిన తర్వాత,  పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని చెప్పిన తర్వాతనే, విపక్షాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం, అందులో రంధ్రాన్వేషణ చేయడం ప్రస్తావనార్హం.

వివేకా హత్య కేసును పులివెందుల పోలీసుస్టేషన్ నుంచే ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశం వల్ల, స్థానిక పోలీసులు చిక్కుల్లో పడక తప్పదు. కాకపోతే.. ఈ హత్య కేసులో అసలు సాక్ష్యాలే కనిపించడం లేదు. సంఘటనాస్థలంలో ఉన్న సాక్ష్యాలను అప్పుడే సమాధి చేశారు. ఒక కీలక వ్యక్తి మృతి చెందాడు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు బదిలీ అయ్యారు. కాబట్టి, సీబీఐ ఈ కేసులో ఏమి సాధిస్తుంది? ఏమి తేలుస్తుందన్న సందేహం రావడం సహజం. తొలుత వైసీపీ అధికార మీడియాలో సహజ మరణం, తర్వాత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ హత్య కేసులో.. పోలీసులు నిర్భయంగా ముందుకు వచ్చి, సీబీఐ ముందు పెదవి విప్పుతారనుకోలేం. ఎందుకంటే పులివెందుల ప్రత్యేకత అది.

వివేకా భార్య, కూతురు, ఇద్దరు రాజకీయ పార్టీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై, హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజంగా అధికార పార్టీకి సంకటమే. తన కుమారుడే సీఎంగా ఉన్నప్పటికీ, ఆయన సర్కారు సాగిస్తున్న విచారణపై నమ్మకం లేని పిన్ని, చెల్లి.. కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన వైనం, విపక్షాలకు బోలెడు బలమిచ్చినట్టయింది. దానితో కుటుంబసభ్యులనే నమ్మించలేని జగన్, రాష్ట్ర ప్రజలను ఎలా నమ్మిస్తారని వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించడానికీ కారణమయింది. విపక్ష నేతగా ఉన్న జగన్, తన చిన్నాన్న హత్యపై ఎన్నికల ముందు హడావిడి చేసి, చివరకు సీఎం అయిన తర్వాత తాను కోరినట్లుగానే,  కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదన్న విపక్షాల ప్రశ్నకు, అధికార పార్టీ నుంచి జవాబు లేకపోయింది. దీనితో ఎన్నికల ముందు, తన చిన్నాన్న హత్యను జగన్ రాజకీయ లబ్థికి వాడుకున్నారన్న విమర్శలకు తెరలేచినట్టయింది.

ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో, అధికారులు ఏ కోణంలో విచారణ ప్రారంభిస్తారన్న ఉత్కంఠ మొదలయింది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉన్నట్లు, హైకోర్టు అనుమానించడమే దానికి కారణం. తొలుత గుండెపోటు, సహజ మరణంగా ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత ఫొరెన్సిక్ రిపోర్టులో ఆయన ఒంటిపై ఏడుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు, తలలో రెండు వైపులా పొడిచిన దెబ్బలు, ఛాతీ, చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.  పైగా చనిపోయిన వ్యక్తి శరీరానికి కుట్లు ఎందుకు వేశారని, వివేకా కూతురు ప్రశ్నించారు. ఆయన దారుణ హత్యకు గురైతే, తొలుత గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారని కూడా, ఆమె అనుమానం వ్యక్తం చేయడం బట్టి.. ఈ కేసులో కుటుంబభ్యులు, పీ.ఏ కృష్ణారెడ్డి, అనుచరుల ప్రమేయాన్ని సీబీఐ తేల్చాల్సి ఉంది. అదేవిధంగా, ఇప్పటివరకూ పోలీసులు విచారించని వ్యక్తులు, కుటుంబసభ్యులను కూడా విచారించవలసి ఉంది.ప్రధానంగా, మృతి వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన వారిని విచారిస్తే తప్ప, కేసు అడుగుముందుకు పడదంటున్నారు. మరి,  ఇందులో ఉన్న రాజకీయ, ఆర్ధిక, కుటుంబ కోణాలను సీబీఐ ఏవిధంగా విచారిస్తుందో చూడాలి.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ముందు..  హైకోర్టు తీర్పు జగన్‌కు వ్యక్తిగతంగా-రాజకీయంగా ఎదురుదెబ్బగానే భావించాలని,  రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని విపక్షాలు జగన్‌పై విమర్శనాస్త్రాలుగా మార్చి, ఆయనపై సంధించేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు. నిజానికి జగన్..  సీఎం అయిన వెంటనే సిట్‌తో కేసును తేల్చేసి ఉంటే, కుటుంబసభ్యుల్లో అనుమానాలతోపాటు, హైకోర్టు సీబీఐకి అప్పగించి ఉండేది కాదని స్పష్టం చేస్తున్నారు. అలాకాకుండా, జిల్లా ఎస్పీతోపాటు, సిట్ సభ్యులను కూడా బదిలీ చేయడం.. మధ్యలో వివేకా భార్య, కుమార్తె మీడియా ముందుకొచ్చి, తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసి, అనేక అనుమానాలు తెరపైకి తీసుకువచ్చారని వివరిస్తున్నారు. అయితే.. వివేకానందరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు హత్యకు గురైతే… ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు, దానిపై సీబీఐకి విచారణకు హైకోర్టు ఆదేశించడం విశేషం. నాడు ఆ హత్య విపక్షంలో ఉన్న వైసీపీకి, రాజకీయంగా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ తీర్పు, నేటి ప్రతిపక్షాలకు రాజకీయంగా ఉపయోగపడుతుందా? లేదా? అన్నది చూడాలి.