టీడీపీకి కడప నేతల షాక్
వలసలను నమ్ముకున్నందుకు గుణపాఠం
డబ్బున్న వారినే అందలమెక్కించిన ఫలితం
ఖంగుతింటున్న ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీ.ఎం చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల అనుభవం, నలభై ఏడేళ్ల జగన్ ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. చెన్నారెడ్డి, కోట్ల, నేదురుమల్లి, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలను ఎదుర్కొని నిలబడ్డ బాబు ధైర్యం, జగన్ వంటి కుర్రనేత ముందు నిలవలేకపోతోంది. చివరకు సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది. నాయకులపై ఆయన లెక్కలు దారుణంగా తప్పుతున్నాయి. ఆయన వేసుకున్న తాత్కాలిక అవసరాలు, రాజకీయ అవసరాలనే పునాదులు కుప్పకూలిపోతున్నాయి. నమ్మిన వారే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడిపోతున్నారు. అందలమెక్కించినవారే అలవోకగా కాడి కిందపడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, కాంట్రాక్టులు పొందిన వ్యాపారులు, విపక్షంలోకి రాగానే వైసీపీ గూటికి చేరుతున్నారు. మంత్రులుగా వెలగబెట్టిన ప్రముఖులు, వ్యాపారాలు చేసుకుని పార్టీ ముఖం చాటేస్తున్నారు. మరి ఏమయింది బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం? ఏమయిపోయింది ఆయన రాజకీయ చాణక్యం? ఎక్కడికి పోయింది ఆయన ఇమేజ్? నేతల విషయంలో  ఆయన లెక్కలు ఎందుకు తప్పినట్లు?.. ఇదీ ఇప్పుడు తెలుగుతమ్ముళ్లలో జరుగుతున్న చర్చ.

కడప జిల్లాలో మొన్న సీ.ఎం.రమేష్, నిన్న సతీష్‌రెడ్డి, రేపు రామసుబ్బారెడ్డి. ఎల్లుండి ఇంకెవరో? వరస పెట్టి వలస వెళుతున్నారు. వీరిలో రామసుబ్బారెడ్డి మినహాయిస్తే, మిగిలిన వారు కాంట్రాక్టర్లు, సగం రాజకీయ నాయకులు. సీ.ఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, కడప జిల్లాపై పెత్తనంతోపాటు, రెండు సార్లు ఎం.పీ సీటిచ్చారు. ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల వైసీపీ ఎం.పీగా టికెట్ సాధించిన అంబానీ ఆత్మ, నత్వానీ వ్యవహారంలో రమేష్ సమన్వయం కూడా ఉందంటున్నారు. సతీష్‌రెడ్డికి వరసగా అసెంబ్లీ టికెట్‌తోపాటు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చి, కౌన్సిల్ పదవి కూడా ఇచ్చారు. ఆయన కూడా తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

ఇక అన్నింటికంటే ఆశ్చర్యమైన విషయం.. పార్టీకి అనాదిగా సేవలందించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కోసం కుటుంబసభ్యులను, వందలసంఖ్యలో అనుచరులను పోగొట్టుకున్న రామసుబ్బారెడ్డి కూడా, టీడీపీని వీడటమే ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది. వైఎస్ హయాంలో కూడా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ రామసుబ్బారెడ్డిలో ఆత్మస్థైర్యం సడలి, జగన్ వైపు అడుగులు వేయడానికి తమ నాయకత్వం తీరే కారణమన్నది తమ్ముళ్ల విమర్శ. ఇక ఇప్పుడు కడపలో మిగిలింది కొద్దిమంది నేతలే. ప్రకాశంలో ప్రతిసారీ, బాలకృష్ణ సిఫార్సుతో టికెట్ తెచ్చుకునే బాబూరావు కూడా వైసీపీలో చేరారు.

టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ, కడప జిల్లాలో పాగా వేయలేకపోయింది. అక్కడ వైఎస్ కుటుంబ ప్రాబల్యానికి, అడ్డుకట్ట వేయలేకపోయింది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ టీడీపీ బలహీనపడింది. దానికి కారణం చంద్రబాబు అనుసరించిన విధానాలేనని, కడప తమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారు. కావలసిన అధికారులను నియమించాలని నేతలు కోరినా బాబు వినలేదని,  జిల్లా ఇన్చార్జి మంత్రులకు అధికారాలు ఇవ్వలేదని చెబుతున్నారు. అధికారుల మాట తప్ప, పార్టీ నేతల మాట వినలేదు. ఫలితంగా, వైఎస్ కుటుంబ పలుకుబడి చెక్కుచెదరలేదు.

అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ, తమకు కావలసిన అధికారులను నియమించుకుంది. ఇప్పుడు వైసీపీ వచ్చినా అదే పరిస్థితి. జమ్మలమడుగులో పార్టీని కాపాడుతూ వచ్చిన రామసుబ్బారెడ్డి ప్రత్యర్ధి, ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని, మంత్రి పదవి ఇచ్చారు. అది,  ఆయన వర్గం చేతిలో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు, బాబు తప్పుడు సంకేతాలిచ్చిందన్న  విమర్శకు కారణమయింది. చివరకు ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత, బీజేపీలో చేరారు. పోనీ, అలాగని రామసుబ్బారెడ్డినీ బాబు కాపాడుకోలేకపోయారు. ఫలితంగా, ఆయన వైసీపీ కండువా కప్పేసుకునేందుకు సిద్ధపడుతున్నారు.

సీఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, రెండుసార్లు రాజ్యసభ సీటిచ్చారు. భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆయన చాలాకాలం క్రితమే బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత డీ.ఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడి, బాబుతో చర్చలు కూడా జరిపారు. కానీ, యనమల రామకృష్ణుడు ఒత్తిడితో,  ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు సీటు ఇచ్చారు. అప్పటికే టీటీడీ చైర్మన్ పదవి, కాంట్రాక్టులు తీసుకున్న సుధాకర్‌కు మరో అవకాశం ఇవ్వడం, విమర్శలకు దారితీసింది. అయినా యనమల కోసం సుధాకర్‌కు సీటిచ్చారు. ఇప్పుడు అదే సుధాకర్ యాదవ్ కనిపించడం మానేశారు. కడప జిల్లాలో ఎప్పుడూ టీడీపీ బలం పెరగకపోయినా, వర్గాల కారణంతో.. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తల సంఖ్య మాత్రం బాగానే ఉంది. అందుకే పార్టీ జెండా ఇంకా ఎగురుతోంది. ఇప్పుడు టీడీపీ నాయకత్వం దానిని  కూడా కోల్పోవడం పార్టీ నేతలను ఆవేదనకు గురిచేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, అనేక జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీ కండువా వేసుకుంటున్న వైనం, పార్టీవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, ఇతర పార్టీల వారిని తాత్కాలిక అవసరాలకు చేర్చుకున్న ఫలితమే.. ఈ పరిణామాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లిస్తే, ఐదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీ మాత్రం, వరసగా అగ్రకులాలకే సీట్లిచ్చిందని, వారంతా అధికారం పోయిన తర్వాత పార్టీని వీడారని  గుర్తు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు కాకుండా, సీఎం రమేష్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిన ప్పటికీ, ఆయన బీజేపీలోకి వెళ్లారు. సీట్లు ఇచ్చిన నలుగురు ఎం.పీలూ బీజేపీలో చేరారని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ తమ అధినేత తప్పిదాలేనని, వారి విషయంలో ఆయన లెక్కలు తప్పాయని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. మాగుంట, ఆదాల వంటి వ్యాపారులను చేర్చుకోవడం వల్ల పార్టీ ఏం సాధించిందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి, సీనియర్లను అవమానించారని.. ఇప్పుడు నారాయణ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచీ పార్టీకి సేవలందించిన బీద మస్తాన్‌రావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి నేతలను పక్కకుపెట్టి.. ఆదాల, నారాయణ వంటి వ్యాపారులను అందలమెక్కించిన ఫలితంగా, బీద, బల్లి వంటి నేతలు వైసీపీలో చేరాల్సి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ ధనవంతులకు కాకుండా, పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో వ్యాపార దృక్పథం, కార్పొరేట్ సంస్కృతి  పెరిగిపోయినందుకే, ఆత్మీయత, ఎన్టీఆర్ నాటి కుటుంబ వాతావరణం పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ అలాంటి పరిస్థితి రావాలంటే, వ్యాపారులను దూరం పెట్టి, పార్టీని మోసినవారికే జెండా అప్పగించాలని సూచిస్తున్నారు. డబ్బు అవసరమే గానీ, అదే ప్రాతిపదిక కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికయినా జరిగిన లోపాలను నిజాయితీగా అంగీకరించి, ఆత్మపరిశీలన చేసుకోకపోతే… జగన్ వంటి దూకుడు నేత ముందు తమ పార్టీ నిలబడటం అసాధ్యమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Close Bitnami banner