స్థానిక రాజ్యం జగన్ దే!

587

రాష్రంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జీడీపీటీసీలు, జిల్లా ప్రజా పరిషత్ లకు ‘ఎన్నికలు’ త్వరలో జరగబోతున్నాయి. ఊళ్లకు అప్పుడే ఆ కళ కూడా వచ్చేసింది. గ్రామాలలోని పంచాయతీ వార్డ్ లను కూడా కలుపుకుంటే….కొన్ని లక్షలమందికి పదవీ యోగం పట్టబోతున్నది.
ఈ ఎన్నికల ఫలితాలతో అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

మొదటి ప్రశ్న:

గత ఎనిమిది నెలల నుంచి జగన్ ప్రభుత్వం పై ‘పోరాటాలు’చేస్తున్నట్టుగా కనబడుతున్న తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? దాని పరిస్థితి ఎన్నికల అనంతరం మెరుగు పడుతుందా? పడితే…ఏ మేరకు? ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు దేశం లో కొత్త ఉత్సాహం నింపుతాయా?
లేక మరింత నీరసించి పోతుందా? క క క…కనీసం ఒక్క జిల్లా ప్రజాపరిషత్ నైనా గె… గె… గె…గెలుచుకోగలదా?
* సినిమా నటుడు ఆధ్వర్యం లోని జన సేన పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నందున…ఈ కూటమి పరిస్థితి ఏమిటి?ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎం పి టీ సీ లు, జెడ్ పీ టీ సీ లు గెలుచుకోగలదు? తెలుగు దేశం తో వీరి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? సినిమా లలో నటించాలని అనుకోవడం వల్ల బిజీ అయిపోతున్న పవన్ కళ్యాణ్… స్థానిక ప్రచారానికి ఎన్ని కాల్షీట్లు కేటాయించగలరు? నాదెండ్ల మనోహర్ ఒక్కరే ప్రచారానికి వెడితే….జనసేన జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది?ఇక, జగన్ ప్రభుత్వం పై ఓటర్స్ రియాక్షన్ ఎలా ఉండబోతున్నది?

2020 ఫలితాలను జనం రిపీట్ చెయ్యబోతున్నారా?

అప్పుడు ఈవిఎం లలో మీట నొక్కిన ఓటరు…ఇప్పుడు పేపర్ పై ముద్ర వేయబోతున్నందున…అప్పటికీ…ఇప్పటికీ ఫలితాలలో తేడా ఉండబోతున్నదా?
ఇలా… వివిధ కోణాలలో -ఆసక్తిపరులకు రాజకీయంగా స్పష్టత ఇవ్వబోతున్న ఎన్నికల్లో….పడక్కుర్చీ విశ్లేషకులు రక రకాల విశ్లేషణలతో హోరెత్తిస్తున్నారు.
ఒకాయనైతే-13 జిల్లాలలోనూ వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోబోతున్నదని జోస్యం చెప్పారు.90 శాతం సీట్లలో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు.
ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు జబ్బలు చరవడం…. పడక్కుర్చీ జ్యోతిష్యులు అంకెలు చెప్పడం చూశాం కూడా.2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ కి 100 ఎం పి స్థానాలు కూడా రావన్నారు. కేసీఆర్ ఒక పక్కనుంచీ…చంద్రబాబు మరో పక్కనుంచీ ఢిల్లీ లో చక్రం తిప్పడానికి రెడి అయిపోయారు. అలాగే తెలంగాణ ఎన్నికలకు ముందు…కేసీఆర్ కు 20,25 ఎం ఎల్ ఏ సీట్లు వస్తే చాలా గొప్ప అంటూ సొల్లు జ్యోతిష్యులు టీవీ ఛానెళ్ల మీద పడ్డారు. చంద్రబాబు మరింత పెట్రేగి పోయారు. చివరకు ఏమైందో చూశాం. అందువల్ల, క్షేత్రస్థాయి పరిస్థితులకు సుదూరం లో కూర్చుని వేసుకునే కాకి లెక్కలు …పని చేయవు.
జగన్ అధికారం లోకి వచ్చిన ఈ ఎనిమిది ,తొమ్మిది నెలల్లో తీసుకుంటున్న చర్యలు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులకు అంతటి అసహనం, చిరాకు, ఏవగింపు,జగన్ ను దెబ్బ తీయాలనే కసి మొదలైనవన్నీ కలగలిసి ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
కానీ, గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్ ను రక రకాలుగా దుమ్మెత్తి పోస్తున్న జనం లో వైసీపీ ఓటర్లు లేరు.
జగన్ నిర్ణయాలతో ఇబ్బందులకు…అసహనాలకు లోనవుతున్న వారిని చూస్తూ…”జగన్ మాగొప్పగా వాళ్ళ తాట తీస్తున్నాడ్రా…”అంటూ లోపల్లోపల సంతోషించే కేటగిరీ లో వైసీపీ ఓటర్లు ఉన్నారు. అంటే…2019 లో ఆయనకు ఓట్ వేసినవారిలో ఒక్కరు కూడా తగ్గలేరు అన్నది ఒక అభిప్రాయం. అలాగే, జగన్ కు వ్యతిరేకం గా ఉన్నవారిని తెలుగు దేశం ,బీజేపీ-జనసేన కూటమి పంచుకోవాల్సి ఉంటుంది.
ఇక,”ఫలితాలలో 90 శాతం అనుకూలంగా రాకపోతే…!అంటూ జగన్ తన మంత్రులకు, ఎం ఎల్ ఏ లకు జారీ చేసిన హెచ్చరికతో కూడా…. ఫలితాలు వైసీపీ కు అనుకూలంగా ఉండబోతున్నాయి. డబ్బు-మద్యం పంచినట్టు రుజువైతే….పదవులు ఊడబీకి, జైల్లో పారేస్తామంటూ జారీ అయిన ఆర్డినెన్సు తో కూడా ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా ఉండబోతున్నాయి.
ఏతా వాతా…జగన్ ఆకర్షణ శక్తి, ఆయనంటే -ఆ పార్టీ నాయకులకు ఉండే భయం, నిలకడగా ఉన్న ఓట్ బాంక్, ఎన్నికల నిబంధనలు, నిర్వీర్య దశలో ఉన్న ప్రతి పక్షాలు, ప్రభుత్వ యంత్రాగం… వంటి సవాలక్ష కారణాలు ఈ ఎన్నికల ఫలితాల్లో తమ తమ పాత్రలు పోషిస్తాయి.
అందుకే…వైసీపీ కి….జగన్ అభిలాషిస్తున్నట్టుగా 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావడం ఖాయం అని చెప్పవచ్చు.

భోగాది వెంకట రాయుడు