పంచాయితీలు ఏకగ్రీవమైతే పండగే పండగ.. ఎంత డబ్బులొస్తాయో తెలుసా ?

416

 

ఎన్నికల నిర్వహణ ద్వారా కాకుండా ఏకగ్రీవమయ్యే పంచాయితీలను ప్రోత్సహించిందేకు ప్రభుత్వం భారీగా నిధుల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంటే ప్రతిపాదనలను పంచాయితి రాజ్ శాఖ ప్రభుత్వానికి పంపింది లేండి. ప్రభుత్వం గనుక ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే రెండు ఉపయోగాలుంటాయి. మొదటిదేమో అనవసర పోటి తగ్గుతుంది. ఇక రెండో ప్రయోజనమేమో సదరు పంచాయితీలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుతుంది.

పంచాయితీలను ఏకగ్రీవం చేయటమన్న ప్రయోగాన్ని ప్రభుత్వాలు చాలా కాలంగా చేస్తూనే ఉన్నాయి. తాజగా తెలంగాణాలో కూడా పంచాయితీలను ఏకగ్రీవం చేసినందుకు మంత్రి కేటియార్ తో పాటు కేసియార్ కూడా భారీ నగదు ప్రోత్సాహకాలను అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రయోజనాలను మూడు రకాలుగా అందించారు. మొదటిదేమో పంచాయితి రాజ్ శాఖ ద్వారా అందే ప్రయోజనాలు. రెండోదేమో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందే నిధులు. మూడోదేమో ప్రభుత్వం ద్వారా అందే నిధులు. ఏకగ్రీవమైన పంచాయితీలు సగటును రూ. 10 లక్షలు అందుకున్నాయి.

అదే పద్దతిలో ఇపుడు ఏపిలో కూడా ప్రోత్సాహకాలకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. పంచాయితీ రాజ్ శాఖ నుండి ప్రతిపాదనలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ కాదనరు. కాబట్టి ఏపిలో కూడా ఏకగ్రీవ పంచాయితీలకు ప్రోత్సాహకాలు అందటం ఖాయమనే అనుకోవాలి. పంచాయితీ రాజ్ శాఖ ప్రతిపాదనల ప్రకారం 2 వేల లోపుండే జనాభా ఉన్న గ్రామ పంచాయితీలకు రూ. 5 లక్షలు అందుతుంది. ఇక్కడ షరతు ఏమిటంటే వార్డు సభ్యులతో పాటు పంచాయితీ మొత్తం ఏకగ్రీవమవ్వాలి.

అలాగే 2 వేల నుండి 5 వేలలోపు జనాభా ఉండే పంచాయితీలు ఏకగ్రీవమైతే రూ. 10 లక్షలు, 5 వేల నుండి 10 వేలలోపు జనాభా ఉన్న పంచాయితీలు ఏకగ్రీవానికి రూ. 15 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదనలు అందాయి. ఇక చివరగా 10 వేల జనాభా ఉండే గ్రామపంచాయితీ ఏకగ్రీవమైతే రూ. 20 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని పంచాయితీ రాజ్ శాఖ ప్రతిపాదించింది. ప్రోత్సాహకాలను ప్రకటించటంలో ముఖ్య ఉద్దేశ్యం గ్రామాల్లో గొడవలను నివారించటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

1 COMMENT