బీజేపీ.. వైసీపీ.. ఒక నత్వానీ!

అవును.. వాళ్లు ముగ్గురూ ఇష్టపడ్డారు
పాపం.. ఏపీ బీజేపీ
(మార్తి సుబ్రహ్మణ్యం)
అక్క ఆర్భాటమే కానీ బావ బతికింది లేదన్న సామెతను ఏపీ బీజేపీ నేతలకు, రాజ్యసభ ఎన్నికల్లో గానీ అర్ధం కాలేదు. ఒకవైపు జగన్ సర్కారుపై అస్త్రశస్త్రాలతో ఆంధ్రా కమలదళాలు యుద్ధం చేస్తుంటే….మరోవైపు ఢిల్లీ పెద్దలు అదే జగన్ ద్వారా, తనకు కావలసిన నత్వానీ అనే లాబీయిస్టుకు రాజ్యసభ సీటు ఇప్పించారు. అంబానీలపై కలలో కూడా విరుచుకుపడే జగన్ పార్టీతో ఎంపీ సీటు ఇప్పిస్తే, ఇక పాపం ఏపీ బీజేపీ నేతలు ఎవరిపై యుద్ధం చేస్తారన్నది ప్రశ్న. ఢిల్లీ బీజేపీ-ఏపీ వైసీపీ-నత్వానీ ఇష్టపడ్డాక, ఇక ఏపీ కమలదళాలు పులుసులో ముక్కలేనని.. మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అప్పటికీ అర్ధం కాని వారు అమాయకుల కిందే లెక్క! బీజేపీ-వైసీపీ రహస్య ప్రేమ ఎలా సాగుతుందో ఓసారి పరిశీలిద్దాం.

త్యాగధనులను కాదని నత్వానీకి అందలం

రాజ్యసభ ఎన్నికల్లో సీటు కోసం, ఒంగోలులో  తన స్థానాన్ని త్యాగం చేసిన వై.వి.సుబ్బారెడ్డి, పార్టీలో చేరితే ఎం.పీ సీటు ఇస్తారని ఆశపడి వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు, విపక్షంలో ఉండగా పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాపు కోటాలో సీటు వస్తుందని ఆశించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. వీరందరికంటే, అన్న జైలులో ఉంటే పాదయాత్ర చేసి పార్టీని బతికించిన, చెల్లెమ్మ షర్మిలను కాదని.. ఏపీ ఎల్లలు తెలియని, పరిమళ్ నత్వానీ అనే గుజరాతీయుడికి జగనన్న ఎం.పీ సీటివ్వడం అందరికంటే, కమలదళాలనే ఖంగుతినిపించింది. నిజానికి జగన్ జైలులో ఉండగా, వైవి సుబ్బారెడ్డి ఆయనను, ఆయన కుటుంబాన్ని  కంటికి రెప్పలా కాపాడారు. ఆయనకూ ఈసారి నిరాశే ఎదురయింది.  అన్న అరెస్టయి జైలులో ఉంటే, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చెల్లెలు షర్మిల చేసిన పాదయాత్ర, పార్టీని బతికించింది.
అయినా, ఆమె త్యాగానికి ఇప్పటివరకూ ప్రతిఫలం లేదు.  తన  భర్త మృతికి రిలయన్స్ కారణమని ఆరోపించిన వైఎస్ విజయలక్ష్మి ఆరోపణలు, తన తండ్రి మృతిపై సీబీఐ విచారించాలన్న జగన్ డిమాండు, తమ ప్రియతమ నేత వైఎస్ మృతికి అంబానీలే కారణమన్న ఆగ్రహంతో, వారి సంస్థలను తగులబెట్టిన వైఎస్ వీరాభిమానుల వీరంగాన్ని జనం ఇంకా మర్చిపోలేదు. ఈలోగా.. అదే ముఖేష్ అంబానీ,  ఏపీ సీఎం జగన్ నివాసానికి రావడం, తన తో ఇష్టుడైన పరిమళ్ నత్వానీని తీసుకువచ్చి, రాజ్యసభ సీటు కోరడం జరిగిపోయింది. జగనన్న మాట ఇచ్చినట్లుగానే, అంబానీ విధేయ నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం కూడా,  అంతే వేగంగా జరిగిపోయింది.

వైఎస్ మృతి వెనుక ఆరోపణలు మర్చిపోయారా?

నిజానికి  ఈ పరిణామాలు, వైసీపేయుల కంటే, భాజపేయులనే విస్మయపరిచింది. ఒకవైపు తాము జగన్‌తో యుద్ధం చేస్తుంటే, తమ ఢిల్లీ బాసులు అదే జగన్‌తో ములాఖాత్ అయి, ముఖేష్ అంబానీ ఇష్టుడికి సీటు ఇప్పించడాన్ని పాపం.. సాధారణ కాషాయ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అనుభవమైతే గానీ, తత్వం బోధపడదన్నట్లు… ఏపీ కమలదళాలకు, రాజ్యసభ ఎన్నికల్లో గానీ తమ పార్టీ అసలు పాలసీ ఏంటన్నది తెలియలేదు. ముఖేష్ అంబానీ-జగన్ మధ్య కేజీ బేసిన్ గ్యాస్ యుద్ధం జరిగిందని తెలుసు. వైఎస్ హెలికాప్టర్ మృతి వెనుక, కాంగ్రెస్-అంబానీ కుటుంబ హస్తం ఉందని స్వయంగా జగన్ మీడియా ఆనాడు కోడై కూసింది. స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా అదే ఆరోపించారు. అటు జగనన్న కూడా అంబానీ కుటుంబంపై అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి.. ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి, జగనన్న గడప తొక్కినా, ఆయన కచ్చితంగా నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వరన్నది భాజపేయుల ధృడ విశ్వాసం. ఒక్క భాజపేయులేమిటి? వైసీపీయుల నమ్మకం కూడా.

మడమ తిప్పిన జగన్..

అలాంటి మాట తప్పని, మడమ తిప్పని జగనన్న.. తన తండ్రి మృతికి కారణమయ్యారని ఆరోపించిన, అదే అంబానీ కుటుంబ విధేయుడైన నత్వానీకి సీటివ్వడం, వైసీపేయులను దిగ్భ్రమ పరిచింది.  భాజపేయులయితే, ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అవసరార్ధ రాజకీయానికి, తమ పార్టీ రాజకీయానికి పెద్దగా తేడా లేదన్న విషయం,  నత్వానీ ఎంపికతో గానీ వారికి అర్ధం కాలేదు పాపం! ముఖేష్ అంబానీ అనే సంపన్న పారిశ్రామికవేత్తతో,  బీజేపీ అనుబంధం అపూర్వమని, మెడ మీద తల ఉన్న వారందరికీ తెలుసు. నత్వానీ ఎవరో జగన్‌కు తెలియదు. ఆయనకు వైసీపీతో వేలు విడిచిద బంధం కూడా లేదు. ముఖేష్ వచ్చి, జగన్‌ను కలిసేంత వరకూ, ఆ నత్వానీ ఎవరో వైసీపీ నేతలకూ తెలియదు.

అటుంచి నరుక్కు వచ్చిన బీజేపీ

అంబానీకి సర్కారులో పనులు చేసి పెట్టే సదరు నత్వానీ అనే పెద్దమనిషి..  ఇప్పటివరకూ చిన్నా, చితకా రాష్ట్రాల నుంచి ఎం.పీగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. ఆయనను పార్టీ  పరంగా, రాజ్యసభకు పంపించే అవకాశాలు లేవు. కాబట్టి, బీజేపీ ఢిల్లీ పెద్దలు అటుంచి నరుక్కువచ్చి, జగన్‌తో సంబంధ ం కలిపారు. నత్వానీకి రాజ్యసభ సీటిస్తే, రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా వస్తాయో వైసీపీ పెద్దలు కూడా వివరించలేదు. ప్రధానితో జగన్ భేటీ తర్వాత, అమిత్‌షాతో ముచ్చటలో నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం అనేది ప్రధాన అజెండా అన్నది, తాజా వైసీపీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత గానీ అర్ధం కాలేదు. అంటే.. బీజేపీ పెద్దలే కాగల కార్యం, ఏపీలో జగన్ ద్వారా తీర్చినట్లు తేలిపోయింది. నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభకు రంగం సిద్ధం చేసి, జగన్‌తో మాట్లాడుకోండని చెప్పిన తర్వాతనే, ముఖేష్ అంబానీ ఆయనను వెంటబెట్టుకుని జగన్‌ను కలిసినట్లు, చిన్నపిల్లాడికీ అర్ధమవుతుంది.

కమలానికి ఫ్యాను గాలి అవసరం

దీన్నిబట్టి.. బీజేపీ జగన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నది సుస్పష్టం. జగన్ పార్టీకి,  లోక్‌సభ-రాజ్యసభలో బలం ఉంది. కాబట్టి ఆయనను వదులుకునేంత తెలివి తక్కువ పని బీజేపీ చేయదు. అంత అవసరం కూడా ఆ పార్టీకి లేదు.  వైసీపీతో తెరచాటు స్నేహం చేస్తే, ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం కూడా లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఎలాగూ బలం  లేదు. కాబట్టి, కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలి.  ఎన్నికల ముందు తమను తిట్టిపోసిన, చంద్రబాబునాయుడును ఆ పార్టీ దగ్గరకు రానీయదు. అందుకే ఇంకా టీడీపీ  ప్రముఖులపై, ఐటి దాడులు కొనసాగుతున్నాయి.  ఇక మత మార్పిళ్లు, అన్యమత ప్రచారం, స్వాముల  యాగీ అంతా ప్రచారానికే తప్ప, దానితో బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. పాపం.. ఈ లోగుట్టు, తెరవెనుక బాగోతం తెలియక బీజేపీ సంప్రదాయవాదులు చొక్కాలు చించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

జీవీఎల్ వైఖరే సరైనదా?

బీజేపీకి ఇష్టుడైన, ముఖేష్ అంబానీ విధేయ నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటివ్వడంతో, ఇప్పటివరకూ ఏపీలో బీజేపీ ఎం.పీ జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వాదనే నిజమని తేలిపోయింది. అమరావతి నుంచి అనేక అంశాల్లో, తాను అధిష్టాన ంతో మాట్లాడిన తర్వాతనే చెబుతున్నానన్న జీవీఎల్ మాటల్లో, అక్షరం తప్పు లేదన్నది నత్వానీ ఎంపికతో స్పష్టమయింది.  వైసీపీ-బీజేపీ మధ్య రహస్య ప్రేమ ఉందన్న విషయం గ్రహించిన తర్వాతనే, జీవీఎల్ అంత ధైర్యంగా రాష్ట్ర వ్యవహారాలపై మాట్లాడుతున్నారన్నది, నత్వానీ ఎంపిక రుజువు చేసింది. రాజ్యసభ బలం దృష్ట్యా.. తాము అన్ని పార్టీల మద్దతు తీసుకుంటామన్న జీవీఎల్ చేసిన వ్యాఖ్యలో ఇంత పరమార్ధం ఉందని, తాజా ఎన్నికలు చాటిచెప్పాయి. జీవీఎల్ ఇప్పటివరకూ, వైసీపీని పల్లెత్తు మాట అనకపోగా, ఓడిన టీడీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు కురిపించడానికి కారణం ఏమిటో.. నత్వానీ ఎంపిక స్పష్టం చేసింది.

బీజేపీ-వైసీపీ బంధాన్ని నిజం చేసిన నత్వానీ..

తాజా రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ-ైవె సీపీ బంధాన్ని నిజం చేశాయి. రాజ్యసభలో బీజేపీకి బలం లేని నేపథ్యంలో.. రాష్ట్రంలో శత్రువైన టీడీపీని దృష్టిలో ఉంచుకుని, బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో వైసీపీ.. కమలదళాలకు ఆప్తురాలయింది. అటు,  వైసీపీ అధినేత జగన్‌కూ,  తనకున్న కేసుల అవసరాల దృష్ట్యా.. కేంద్రంలో బీజేపీ సహకారం తప్పనిసరి. జగన్ అయితే కేసుల కోసమైనా, తాను చెప్పింది వింటారు. చంద్రబాబు అందుకు విరుద్ధంతోపాటు, ఆయనతో ఇప్పుడు పెద్దగా లాభం కూడా లేదు. కాబట్టి, జగన్ ఇప్పుడు కమలనాధులకు అవసరార్ధం ఆప్తుడు. మామూలుగా అయితే, జగన్ మనస్తత్వం ప్రకారం, ఆయన అంబానీకి మాట్లాడే అవకాశమే ఇవ్వకూడదు. అవకాశం ఉంటే, ఆయన కంపెనీలకు ఏపీలో నిలవ నీడ లేకుండా చేయాలి.  కానీ, అలాంటి అంబానీ సిఫార్సు చేసిన వ్యక్తికి, ఏకంగా రాజ్యసభ సీటే ఇచ్చారంటే.. ఆయన అవసరం ఏమిటన్నది అర్ధమవుతూనే ఉంది. దీన్నిబట్టి, ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని, జగన్ కూడా సగటు రాజకీయ నాయకుడే తప్ప.. ఆయనలో ఎలాంటి ప్రత్యేకతలూ లేవని స్పష్టమయింది.

ఏపీ బీజేపీ.. కిం కర్తవ్యం?

పాపం.. ఎటొచ్చీ, ఏపీ బీజేపీ నేతల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. వైసీపీ తమకు మిత్రపక్షమో, శత్రుపక్షమో తేల్చుకోలేకపోతోంది. ప్రజాసమస్యల పరిష్కారంపై తాము రోజూ యుద్ధం చేసే జగన్‌తో, ఢిల్లీ పెద్దలు తెరచాటు వియ్యం కొనసాగించడం చూసి నోరెళ్లబెడుతున్నారు. బీజేపీ నాయకురాలైన సంచయితకు జగనన్న, సింహాచలం ఆలయ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే, ఢిల్లీ స్థాయిలో వారిద్దరి మధ్య ఉన్న పవిత్రబంధమేమిటో అర్ధమయి ఉండాలి. అది అర్ధం కాక.. ఇంకా వైసీపీ సర్కారుపై యుద్ధం చేయడాన్ని, అమాయకత్వంగానే భావించక తప్పదు. ఏపీలో ఇప్పుడు బీజేపీ నాయకత్వం,   వైసీపీ నీడలపైనే యుద్ధం చేస్తుందన్నది..  మనం మనుషులం అన్నంత నిజం!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami