జడ్పీకి తెలుపు.. మండలానికి గులాబీ

573

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ఏర్పాట్లు
జడ్పీటీసీ అభ్యర్థికి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి
రూ.2 లక్షలు చొప్పున వ్యయ పరిమితి
విజయవాడ : స్థానిక ఎన్నికలకు నామపత్రాల సమర్పణ ఆరంభం కావడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర పనులపై దృష్టి పెట్టారు. ముందుగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభించారు. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు, ఎంపీటీసీ సభ్యులకు గులాబీ రంగు పేపర్లు ముద్రిస్తున్నారు. ఆయా పార్టీల గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు కూడా బ్యాలెట్‌ పత్రంలో ఉంటాయి. అభ్యర్థులను గుర్తిస్తూ ఆయా పార్టీలు ఇచ్చే ‘బి’ ఫారాలు ఆధారంగా ఆ పార్టీల గుర్తును ముద్రిస్తారు. అభ్యర్థుల నామినేషను సమయంలో గానీ, లేదా ఉపసంహరణ సమయం నాటికి ‘బి’ ఫారం సమర్పిస్తేనే వారిని ఆ పార్టీ అభ్యర్థిగా గుర్తించి ఎన్నికల చిహ్నం కేటాయిస్తారు. గడువులోగా ఆయన ‘బి’ ఫారం అందించలేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించి వేరే గుర్తు ఇస్తారు.
సహాయ కేంద్రాలు ఏర్పాటు
అభ్యర్థులు ప్రచారం, ఇతర అనుమతుల కోసం డివిజన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు (హెల్ప్‌ డెస్క్‌లు) ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు కావాల్సిన సమాచారం, అనుమతులు ఈ కేంద్రాల్లో పొందవచ్ఛు నామినేషన్ల స్వీకరణకు కూడా సిబ్బందిని ఎక్కువ మందినే నియమించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితో పాటు సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్‌లను నియమించారు. వీరి పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
నోటా గుర్తు కూడా..
బ్యాలెట్‌ పేపరుపై అభ్యర్థుల ఎన్నికల గుర్తుతో పాటు నోటా గుర్తు కూడా ముద్రిస్తారు. ఏ అభ్యర్థి ఓటరుకు నచ్చకపోతే నోటాపై ఓటేయ్యవచ్ఛు ఈవీఎంలపై నోటా గుర్తు ఏర్పాటు చేసినట్లే బ్యాలెట్‌ పత్రాలపై కూడా ఈ గుర్తును ముద్రిస్తున్నారు. అభ్యర్థులకు ఆయా రాజకీయపార్టీలు ఇచ్చిన ‘బి’ ఫారాల ప్రకారం వారికి ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వాటితో పాటు నోటా కూడా బ్యాలెట్‌ పత్రంపై కనిపించనుంది.
నేర చరిత్ర లేకుంటేనే..
అభ్యర్థులకు నేరచరిత్ర ఉండకూడదు. ఇందుకు నేరచరిత్ర లేదని తెలుపుతూ ఇద్దరి పూచీకత్తుతో స్వీయ ప్రకటన చేయాలి. ఈ రకమైన పూచీకత్తు లేకుంటే నామపత్రాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అంతేకాదు స్థిరాస్తులు, అప్పుల వివరాలను కూడా అభ్యర్థులు విధిగా తెలియజేయాలి. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్లను తెలియజేయాలి.