ప్రజలకు టీడీపీ ‘స్థానిక’ పరీక్ష!

381

నిధులివ్వకుండా తొలిసారి ఎన్నికలకు 
జనం మైండ్‌సెట్ పరిశీలనకు ఇదో అవకాశం
ఆ తర్వాతనే పూర్తి స్థాయి కార్యాచరణ 
స్థానిక సమరంపై తెలుగుదేశం వ్యూహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా ప్రజలు రాజకీయ పార్టీలకు పరీక్ష పెడుతుంటారు. కానీ, ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ పార్టీనే ప్రజలకు పరీక్ష పెడుతున్న వైచిత్రి ఇది! ఎన్నికలంటే ప్రత్యేక వ్యూహం అనుసరించే తెలుగుదేశం పార్టీ, ఈసారి అందుకు భిన్నమైన వ్యూహం అనుసరిస్తోంది. ఎలాంటి ఎన్నికలయినా, గెలుపే ధ్యేయంగా పనిచేసే నైజం ఉన్న టీడీపీ, ఈసారి అభ్యర్ధులకు నిధుల పంపిణీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. తొమ్మిదినెలల జగన్ పాలనపై, ప్రజల కోసం పార్టీ చేస్తున్న పోరాటానికి, ప్రజలు ఏవిధంగా మద్దతునిస్తున్నారని తెలుసుకునేందుకు, స్థానిక ఎన్నికలను ఒక వేదికగా మార్చుకుంటోంది. ఫలితాలను బట్టి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తోంది. ఒకరకంగా.. తెలుగుదేశం పార్టీ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు, వారికి పరీక్ష పెట్టినట్లు కనిపిస్తోంది.
అభ్యర్ధులకు నిధుల్లేవు!
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు నిధులు ఇవ్వకూడదని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీ ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోవడం, అటు నేతలు కూడా గత ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి అప్పులపాలవడం, పార్టీకి సానుభూతిపరులైన కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల, కొంతకాలం నుంచీ టీడీపీ కార్యక్రమాల్లో జోష్ తగ్గిపోయింది. దానికితోడు పార్టీ నేతలపై, స్థానికంగా పోలీసు కేసులు నమోదు కావడంతో, నేతల ఆత్మస్థైర్యం కొంత దెబ్బతిన్నట్టయింది. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అనుభవించిన చాలామంది నేతలు, ఎన్నికల తర్వాత చురుకుగా పనిచేయడం మానేయడం, స్థానిక శ్రేణులను నిరాశపరిచింది.
చేసిన పోరాటాలపైనే విశ్వాసం 
అయితే, తొలుత ప్రజావేదిక కూల్చివేత, ఆ తర్వాత కొంతకాలం ఇసుక సమస్య, మరికొంత కాలం అన్నక్యాంటీన్ల రద్దుపై చేసిన ఆందోళన, తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడింది. తర్వాత రాజధాని అమరావతి మార్పు అంశం,  పార్టీకి ఆక్సిజన్ ఇచ్చింది. దానిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, స్వయంగా పోరాటాల్లో పాల్గొన్నారు. విశాఖలో బాబును వెనక్కి పంపిన క్రమంలో జరిగిన వివాదం, కోర్టుల్లో సర్కారుకు వ్యతిరేకంగా వస్తున్న తీర్పులతో, రాజకీయంగా టీడీపీకి కొంత మైలేజీ వచ్చింది. వీటిని ఆ పార్టీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో విజయం సాధించింది. అయితే, జగన్ సర్కారు హటాత్తుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం, పార్టీకి కొంత ఇబ్బంది కలిగించింది. అతి తక్కువ సమయం ఉండటమే దానికి కారణం.
ఆర్ధిక సమస్యల్లో టీడీపీ నాయకత్వం
పైగా పార్టీ యావత్తు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యూహం కారణంగా, పోటీ చేసిన అభ్యర్ధులకు నిధులు సమకూర్చలేకపోయింది. పార్టీని ఆదుకునే వారిపై ఐటి, ఈటీ దాడులు చేసింది.  ఫలితంగా వారు స్థానికంగా డబ్బులు సర్దుబాటు చేసుకుని, అప్పులపాలయ్యారు. వారికి ఇప్పటివరకూ నిధులు సర్దుబాటు చేయలేకపోతోంది. చివరకు ఎన్నికల ముందు.. మీడియాకు ఇచ్చిన ప్రకటనలకు ఇవ్వాల్సిన  డబ్బు కూడా, ఇప్పటికీ ఇవ్వలేకపోయింది. పార్టీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఐటి దాడులకు గురయ్యారు. స్థానికంగా పార్టీకి చెందిన నేతలు మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో ఎన్నికల ముందు చేసిన పనులకు,  బిల్లులు ఇవ్వకుండా జగన్ సర్కారు బ్రేకులు వేసింది. దానితో పార్టీ తొలిసారిగా ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార కాంగ్రెస్ కంటే, టీడీపీ ఎక్కువ నిధులు అభ్యర్ధులకు సర్దుబాటు చేసింది. టీడీపీ స్థాపించిన తర్వాత,  ఈ స్థాయిలో ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
జనంలో మార్పు చూద్దాం..
దీనితోపాటు… గత తొమ్మిది నెలల నుంచి జగన్ సర్కారు తీసుకుంటున్న, అనేక నిర్ణయాలపై వివిధ వర్గాల ప్రజలు వ్యతిరేకతంగా ఉన్నట్లు పార్టీ భావిస్తోంది. ఆయా వర్గాలకు ఇప్పటివరకూ పార్టీ చేసిన పోరాటాలకు, ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో అదే వర్గాలు పార్టీకి మద్దతునిస్తాయా? లేదా? అని పరిశీలించుకునేందుకు, ఈ ఎన్నికలను టీడీపీ ఒక వేదికగా వినియోగించుకుంటోంది.  తాము ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేసినా, వారి నుంచి మద్దతు-స్పందన లేకపోతే ప్రయోజనం లేదని పార్టీలోని ఒక వర్గం వాదిస్తోంది. వారి కోసం ఇన్ని పోరాటాలు చేసి, డబ్బు ఖర్చుపెట్టి, కేసులకు గురయినా.. ప్రజల నుంచి ఆశించిన ఫలితాలు రాకపోతే, వారంతట వారిలో వ్యతిరేకత వచ్చే వరకూ, వేచిచూడటమే మంచిదని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టినా, స్థానికంగా వైసీపీ నేతల బెదిరింపులతో.. ఆఖరి నిమిషంలో తమ పార్టీ నుంచి అభ్యర్ధులు, ఆ పార్టీలో చేరితే, తాము  చేసిన శ్రమ వృధా అవుతుందన్న భావనలో ఉన్నారు.
జనం కష్టాలు పడితే వచ్చేది వ్యతిరేక తీర్పే!
దీనికంటే, అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా.. ప్రభుత్వంపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు నిజంగా కష్టాలు పడుతుంటే, వారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ తొమ్మిది నెలలలో రుణమాఫీ రద్దు నిలిపివేత, ఇసుక, అన్నక్యాంటీన్లు, రేషన్‌కార్డులు, పించన్ల తొలగింపు, భూముల స్వాధీనం, టీటీడీ నియామకాలపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, తాము చేసిన పోరాటాలు ప్రజలకు మెప్పించాయని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అవి నిజమైతే, ప్రజలు కచ్చితంగా తమ పార్టీని ఆదరిస్తారని, పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే, గతంలో మాదిరిగా డబ్బు ఖర్చు చేయకుండా, కేవలం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రచారంతో, ప్రజలకు దగ్గర కావడమే మంచిదన్న భావన పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది.
కార్యకర్తలకే సీట్లు ఇచ్చేలా..  
అందులో భాగంగా, పార్టీకి తొలి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, అభ్యర్ధులుగా దించడం మంచిదని భావిస్తోంది. దానివల్ల కనీసం పార్టీ కార్యకర్తల్లో అయినా ఆత్మవిశ్వాసం, పార్టీ పట్ల అంకితభావం పెరుగుతుందని నాయకత్వం భావిస్తోంది. ఎప్పటిమాదిరిగా, డబ్బులు ఉన్న వారికే సీట్లు ఇచ్చే సంస్కృతికి ఈ ఎన్నికల్లో తెరదింపి, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒక సానుకూల సంకేతం పంపించాలని నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా, విద్యావంతులు ఎక్కువగా పాల్గొనే,  మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
నెగటివ్‌లో పాజిటివ్ ప్రచారంతో జనం లోకి..
ఇక ఈ ఎన్నికల్లో నెగటివ్‌తో కూడిన, పాజిటివ్ ప్రచారానికి టీడీపీ తెరలేపింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే, ఏం జరుగుతుంది? ఎంత నష్టం జరుగుతుందన్న  మానసిక ప్రచారంతో, ప్రజల్లో మార్పు తీసుకురావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వాటిని సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఆ ప్రచారం ఎలాగంటే.. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే, మూడు రాజధానుల నిర్ణయం నిజమేనని అంగీకరించినట్టవుతుంది.  అమరావతి రాజధానిగా వద్దని తీర్పు ఇచ్చినట్టవుతుంది. మనకు రావలసిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు వెళ్లడం  ఇష్టమేనని అంగీకరించినట్టవుతుంది. పోలవరం నిర్మాణం ఆపడాన్ని అంగీకరిస్తున్నామని చెప్పినట్టవుతుంది. ఇసుకను ఆపడం, దాని ధరలు పెంచడం ఇష్టమేనని అంగీకరించినట్టవుతుంది. పెంచిన బస్సు, కరెంటు, పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టమేనని ఒప్పునట్టవుతుంది. బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును ఆమోదించినట్టవుతుంది. పించన్లు, రేషన్ కార్డులు తొలగించడాన్ని సమర్థించినట్టవుతుంది. మంత్రులు అనిల్‌కుమార్, కొడాలి నాని, కన్నబాబు, విజయసాయిరెడ్డి తిడుతున్న తిట్లన్నీ తమకు బాగా నచ్చాయని చెప్పినట్టవుతుంది. ఇలాంటి నెగటివ్‌లో పాజిటివ్ ప్రచారంతో, జనంలో మార్పు తీసుకురావాలన్నది తెలుగుదేశం వ్యూహంగా కనిపిస్తోంది.