కమలం గొంతులో వెలక్కాయ
బీజేపీని జగన్ ఇరికించారా?
ఆ బంధం బయటపడినట్లేనా?
దానిని చెరిపివేసేందుకు బీజేపీ నేతల తంటాలు
అందుకే సంచయితపై సస్పెన్షన్ వేటు?
ఇప్పుడు ఆమెది ఏ మతం?
               (మార్తి సుబ్రహ్మణ్యం)
క్షవరం అయితే గానీ వివరం తెలియదన్న సామెత, ఏపీ కమలదళాలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్లుంది. వైసీపీ-తమ మధ్య బాదరాయణ సంబంధం ఉందన్న విమర్శలను నిజం చేస్తూ, ఏపీ సీఎం జగన్ సర్కారు సింహాచలం అప్పన్న సాక్షిగా ఇచ్చిన ఉత్తర్వు, కమలదళాలను కక్కలేక మింగలేక అన్నట్లుగా చేసింది. తమకు తెలియకుండానే, తమ పార్టీకి చెందిన నేతకు ఆలయ చైర్మన్ పదవి ఇచ్చి, పొగపెట్టిన జగన్ సర్కారుపై కమలదళం కారాలు మిరియాలు నూరుతోంది. వైసీపీ-బీజేపీ మధ్య కుస్తీ తప్ప, దోస్తీ లేదన్న సంకేతాలిచ్చేందుకు నానా తంటాలు పడుతోంది. అందులో భాగంగా.. జగనన్న సర్కారు ప్రేమతో, తమ పార్టీ నేతకు పదవి ఇచ్చిన తీరును బీజేపీ దుయ్యబడుతోంది. దానితో, అసలు ఇంత రచ్చకూ కారణమయిన, తమ నేతను పార్టీ నుంచి వెలి వేయాలని తీర్మానించింది. ఇదీ.. కమలదళాన్ని ఖంగుతినిపించిన, విజయనగర రాకుమార్తె సంచయిత కమలతీరంలో సృష్టించిన నైతిక కల్లోలం.

కమలవనంలో కల్లోలం
బీజేపీ-వైసీపీ బంధం కుటుంబకథా చిత్రాలకు మించి ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉండీ లేనట్లు, లేకుండా ఉన్నట్లుగా.. బాపూ బొమ్మలా సగం తెరపైన, సగం తెరవెనుక అన్నట్లుగా సజావుగా సాగుతున్న వారి స్నేహంలో,  సంచయిత అనే మాజీ రాకుమార్తె రేపిన తుపాను, కమలవనంలో కలకలం రేపుతోంది. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా పూసపాటి కుటుంబం అనాదిగా కొనసాగుతోంది. ఆ పరంపరలో భాగంగా టిడిపి నేత, కేంద్రమాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టిడిపి-కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరం పతాకస్థాయికి చేరుకుని, వైఎస్ హయాంలో చంద్రబాబునాయుడు మీద విచారణకు ఆదేశించిన కాలంలో కూడా, ఆ దేవస్థానం-ట్రస్టు జోలికి వైఎస్ వెళ్లలేదు. అశోక్‌గజపతిరాజు, ఆయన కుటుంబంపై అప్పటి కాలం నాటి రాజకీయ పార్టీలకు ఉన్న విశ్వసనీయత, నమ్మకం అది. కానీ, కాలంతోపాటు మారిన  రాజకీ యాలు,  వ్యక్తిగత శత్రుత్వం స్థాయికి తీసుకువెళ్లాయి. ఫలితంగా అశోక్‌గజపతి రాజు సీటుకు జగన్ సర్కారు ఎసరు పెట్టింది.

ఎవరీ సంచయిత? ఏమా కథ?:
మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు-ఉమా గజపతిరాజు భార్యాభర్తలు. అయితే, వారిద్దరూ విడాకులు తీసుకోవడం, ఉమా మరొకరిని వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడటం చాలాకాలం క్రితమే జరిగిపోయింది. క్రైస్తవుడై రమేష్‌శర్మ అనే క్రైస్తవడిని ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. వారి పేజ్-3 కుటుంబం చాలా సంపన్నమైనదే కాదు. ఆధునిక, అభ్యుదయ భావాలున్నది. ఆయన తరచూ విదేశాలకు వెళ్లి చర్చి, పాస్టర్లను కలుస్తుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన ఆమెనే,  మన సింహాచలం ఆలయ చైర్మన్  సంచయిత! ఇప్పుడు ఆమెనే  జగన్ సర్కారు సింహాచలం దేవస్థానం, ట్రస్టు చైర్మన్‌గా నియమించింది. నాడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్లి పార్టీలో చేర్పించారు. ఇదీ కథ!

బీజేపీ నేతకు ఎలా ఇచ్చారబ్బా?!:
ఇంతకూ సదరు సంచయిత, ఏనాడూ విజయనగరంలో ఉన్న దాఖలాలు లేవు. అదే విషయాన్ని అశోక్‌గజపతిరాజు కూతురు ఆదితి కూడా  ఏబీఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  పైగా సోషల్ మీడియాలో వెలుగుచూసిన ఆమె వస్త్రధారణకు సంబంధించి వస్తున్న  మోడల్ డ్రెస్సులు పరిశీలిస్తే… జగన్ సర్కారు ఏ ప్రాతిపదికన, ఆమెకు ఆ పదవి ఇచ్చారన్న అనుమానం, మెడ మీద తల ఉన్న ఎవరికైనా రాక తప్పదు. పోనీ, ఆమె వైసీపీ సభ్యురాలు కూడా కాదు. బీజేపీ నాయకురాలు. మరి మరొక పార్టీకి చెందిన నేతకు, సింహాచలం ఆలయ చైర్మన్‌గా ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆమెకు ఆ పదవి ఇస్తారన్న విషయం ఎం.పి విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణకు తప్ప నర మానవుడికి తెలియదు. పాపం ఈఓకు కూడా, చివరాఖరులో సమాచారం ఇచ్చారట. అసలు తమకు తెలియకుండా, తమ పార్టీకి చెందిన నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పదవి ఇచ్చిందో తెలియక, కమలదళాలు నోరెళ్లబెడుతున్నాయి.
తనకు ఆ పదవి ఇవ్వడ ం.. అందుకు ఆమె, జగనన్న- విజయసాయిరెడ్డికి కృతజ్ఞత చెప్పడం, జగనన్న తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సంచయిత చెల్లెమ్మ స్వాగతించడం.. దానికి ఆగ్రహించిన బీజేపీ ఆమెకు షోకాజ్ నోటీసుతో పాటు, ఆమెను పార్టీ నుంచి వెలివేయాలని,  ఢిల్లీకి సిఫార్సు చేయడం చకచకా జరిగిపోయింది.

కక్కలేక.. మింగలేక… కమలం!:
వైసీపీతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ నేత సంచయితకు, ఆలయ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్, కమలంలో పెద్ద కల్లోలమే రేపారు. ఈ నిర్ణయంతో బీజేపీ-వైసీపీ పవిత్రబంధం, సింహాచలం అప్పన్న సాక్షిగా  బట్టబయలయింది. ఇప్పటివరకూ రెండు పార్టీల మధ్య,  రహస్య ప్రేమ కొనసాగుతుందన్నది మాత్రమే తెలిసిన వారికి, తాజా నిర్ణయంతో అది నిజమేనని తేలిపోయింది.
దీనితో కమల దళాల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారింది. ఈ భావన కింది స్థాయికి చేరితే.. అసలే ఢిల్లీ నుంచి దిశానిర్దేశం లేక, గందరగోళంగా ఉన్న కార్యకర్తలు, మరింత గందరగోళంలో పడే ప్రమాదం ఉందని రాష్ట్ర నేతలు తలపట్టుకున్నారు. దానితో నష్టనివారణకు దిగిన రాష్ట్ర పార్టీ, సంచయితను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది.  బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణుకుమార్‌రాజు మీడియా ముందుకొచ్చి, జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇది గజపతిరాజుల కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదన్నారు. సంచయితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం ఆవిధంగానయినా, వైసీపీతో తమకు దోస్తీ లేదని జనం నమ్ముతారన్నది కమలనాధుల ఆశ.

ఢిల్లీ బాసులకు తెలియదా?:
అయితే, రాష్ట్ర పార్టీని లెక్కచేయని జగన్, ఢిల్లీ బాసులతో సఖ్యతగానే ఉన్నారు. రాజ్యసభలో సర్కారు బిల్లుల ఆమోదానికి, సహకరిస్తూనే ఉన్నారు. కమలనాధులు కూడా ఆయనతో కయ్యం బదులు, వియ్యం నెరుపుతున్నారు.  మరి బీజేపీ నాయకత్వం అనుమతి లేకుండానే, ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయం జగన్‌కు తెలియదా? అన్నది ప్రశ్న. పాపం.. ఈ లోగుట్టు, తెరచాటు బంధాల గురించి తెలియకుండానే, ఆంధ్రా కమలదళాలు తొందరపడ్డాయా? లేక తమ బంధం బయటపడింది కాబట్టి, నష్టనివారణ కోసం చేస్తున్న ప్రయత్నమా? అన్నది సందేహం! ఇప్పటి సమాచారం ప్రకారం.. బీజేపీలో ఓ కీలక నేత స్వయంగా రంగంలోకి దిగి, వైసీపీలో నెంబర్‌టూని పిలిచి, సంచయితకు ఆ పదవి ఇవ్వమని సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజం అప్పన్నకే ఎరుక?

ఇంతకూ సంచయితది ఏ మతం?:

సహజంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తలంటే.. పంచె, పట్టువస్త్రాలు, పట్టుచీరలతో గుర్తుకువస్తారు. కానీ, సింహాచలం వంటి ప్రతిష్టాత్మక ఆలయానికి చైర్మన్‌గా వచ్చిన సంచయిత మాత్రం.. పబ్బులు, సినిమా ఫంక్షన్లకు హాజరయ్యే డ్రెస్సులతో, దర్శనమివ్వడం విమర్శలకు దారితీస్తోంది. దీనికి సంబంధించి, సోషల్‌మీడియాలో ఆమె వేసుకున్న డ్రెస్సులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె పాటించే క్రైస్తవమతానికి సంబంధించిన ఓ ఫొటోతోపాటు, ఆమె వేసుకున్న మోడరన్ డ్రెస్సులపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
‘ ఇంత పవిత్రంగా, ఒంటిచుట్టూ బట్టలు చుట్టుకుని, హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఇలాంటి వారిని, ఆలయ చైర్మన్‌గా నియమించినందకు జగన్‌కు కృతజ్ఞత చెప్పడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత. అలాంటి దుస్తులతోనే ఆమె ఆలయానికి వస్తే, ఆలయ పవిత్ర మరింత పెరుగుతుంది’ అని నెటిజన్లు, ఆమెకు ఆ పదవి ఇచ్చిన ఏపీ సీఎం జగనన్నకు హారతులు పడుతున్నారు. వేరే మతానికి చెందిన వారిని ఆలయ చైర్మన్‌గా నియమిస్తే సమస్యలు వస్తాయని అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే, ఆమె హిందువు కాదన్న విషయం స్పష్టమవుతోంది.  సింహాచలం ఆలయ చైర్మన్‌గా నియమితురాలయిన సంచయిత, క్రైస్తవ ధర్మం ఆచరిస్తారన్న ప్రచారం జరగడమే, నెటిజన్ల ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner