పీఠం.. మఠాల నుంచి బయటకు రారా స్వామీ?

642

‘సింహాచలం సిత్రాల’పై స్వాములేం చేస్తున్నారు?
అసలు స్వరూపానంద విశాఖలోనే ఉన్నారా?
చిన జీయర్ స్వామి పెదవి విప్పరేం?
అది గజపతిరాజుల వ్యవహారంగా చూస్తున్నారా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

వారు హిందూ ధర్మానికి పరిరక్షకులు. ధర్మానికి, మతానికి ఏ ఆపద వచ్చినా అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రభుత్వంపై ధర్మాగ్రహం వ్యక్తం చేస్తారు. అవసరమైతే ఆందోళనకు దిగుతారు. అందుకే భక్తులు, హైందవ సమాజం ఆ పీఠాథిపతులు, మఠాథిపతుల కాళ్లు మొక్కుతారు. వారిలో కనిపించని దేవుడిని దర్శిస్తారు. నడిచే దేవుళ్లుగా పూజిస్తారు. వారిని మహిమాన్వితులని భావిస్తారు. కానీ, ఇదంతా ఒకప్పుడు! ఇప్పడు  కాలం మారింది. కల్చరు మారింది. కొందరు కాస్ట్లీ స్వాములు, సామాన్యుల మాదిరిగానే ఇహలోక సుఖాలకు అలవాటుపడుతున్నారు. బెంజి కారుల్లో సేదతీరుతున్నారు. పీ.ఆర్.ఓలతో ప్రచార ప్రపంచాన్ని అనుభవిస్తున్నారు. సర్కారు ఇచ్చే సుఖాలు, సౌకర్యాలను అరమోడ్పుకన్నులతో ఆస్వాదిస్తున్నారు. వేదాలు వల్లించే పీఠాల కంటే, పాలకులు  వేసే పెద్ద పీటకే దాసులవుతున్నారు. అందుకే హైందవం ప్రమాదంలో పడినా.. పీఠాలు, మఠాలు వదలి బయటకు రావడం లేదు!!  సింహాచలం దేవాలయం-మాన్సాస్ ట్రస్టు పరిణామాల అనంతరం, స్వాముల నిస్తేజాన్ని దర్శించిన హైందవ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ధర్మాగ్రహం ఇది!!!

సింహాచలం దేవస్థానం-మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజును సర్కారు అర్ధరాత్రి ఉత్తర్వుతూ తొలగించి, పేజ్-3 సంస్కృతిని పాటించే, ఉమా గజపతిరాజు కుటుంబ వారసురాలయిన సంచయితను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వైనం,  హైందవ సమాజాన్ని దిగ్భ్రమ పరిచింది. అశోక్ గజపతిరాజును తొలగించి, అందరికీ తెలిసిన ఆ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తిని నియమిస్తే, పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, క్రైస్తవ సంస్కృతి పాటిస్తారని ఆరోపణలున్న  కుటుంబానికి చెందిన మహిళను నియమించడమే, ఇంత  రచ్చకు దారి తీసింది. ఆమె కట్టు-బొట్టు, ఆధునిక వస్త్రధారణ, వాటికన్ సిటీలోని చర్చిలో తల్లీ-కూతుళ్ల ఫొటోలు, ఆమె ఏ మతానికి చెందిన వారో తనకు తెలియదని.. స్వయంగా బాబాయ్ అయిన అశోక్ గజపతిరాజు చె ప్పిన వైనం, సోషల్ మీడియాలో సంచయిత ఫొటోలు చూసిన హైందవ సమాజానికి, జగన్ ప్రభుత్వం హైందవ ధర్మంలో కాళ్లూ-వేళ్లూ పెడుతోందన్న ఆగ్రహం వ్యక్తమయింది. సింహాచలం భూములు కొట్టేసేందుకే ఆమెను నియమించారన్న రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాయి. అది వేరే కోణం.

చివరకు హిందూమతంపై పేటెంట్ హక్కులు ఉన్నాయని భావించే, భారతీయ జనతా పార్టీ కూడా, ఈ చర్యను ఆక్షేపించింది. విశాఖ కమలదళాలే సర్కారు చర్యకు వ్యతిరేకంగా గళం విప్పాయి. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణుకుమార్‌రాజు వంటి అగ్రనేతలే, అశోక్‌గజపతిరాజుపై వేటు వేయడాన్ని నిరసించారు. ఇది గజపతిరాజుల కుటుంబ వ్యవహారం కాదన్నారు.  హిందూధర్మానికి చెందిన వ్యవహారమని కుండబద్దలు కొట్టారు. ఇందులో పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని మండిపడ్డారు. వైసీపీ సర్కారు రాక్షసక్రీడ ఆడుతోందని కన్నెర్ర చేశారు.  సంచయిత విజయనగరంలో ఎంతమందికి తెలుసని విరుచుకుపడ్డారు. అటు బీజేపీ కూడా, రాజకీయంగా కొరడా ఝళిపించింది. తమకు తెలియకుండా, అడ్డదారిలో సింహాచలం ఆలయ చైర్మన్ పదవి పొందిన సంచయితను వెలి వేయాలని, నాయకత్వానికి సిఫార్సు చేసింది. ఆఖరకు, హిందుత్వను వ్యతిరేకించే వామపక్షాలు కూడా ఈ చర్యను  ఖండించాయి.

సింహాచలం ఆలయ వ్యవహారంపై హైందవ సమాజంలో ఇంత కల్లోలం రేగినా, హిందూ ధర్మ పరిర క్షకులుగా తమను తాము భావించుకునే పీఠాథిపతులు, మఠాథిపతులు, స్వాములు.. ఈ వ్యవహారాలపై,  ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే, హిందూ సమాజాన్ని విస్మయపరుస్తోంది. స్మార్త సంప్రదాయాలు అనుసరించే విశాఖ శారదాపీఠాథిపతి స్వరూపానంద సరస్వతికి గానీ, వైష్ణవ సంప్రదాన్ని నిర్దేశించే చిన జీయరు స్వామికి గానీ.. సింహాచలంలో జరిగిన ఈ ధర్మవిరుద్ధ వ్యవహారంపై, హిందూ సమాజంలో మొదలయిన హాహాకారాలు గానీ వినిపించకపోవడం విచిత్రమే. సింహాచలం ఆలయానికి చినజీయరు స్వామి పెద్దదిక్కుగా ఉన్నారు. అక్కడి పూజాదికాలన్నీ  వైష్ణవ సంప్రదాయం ప్రకారమే కొనసాగుతున్నాయి. అయినా జీయరు స్వామి, సర్కారు నిర్ణయంపై ఇప్పటిదాకా ధర్మాగ్రహం వ్యక్తం చేయలేదు.

చిన జీయరు స్వామి హైదరాబాద్‌లో ఉంటారు. కానీ, విశాఖలోనే కొలువు దీరిన శారదా పీఠాథిపతి, సీఎం ధార్మిక గురువైన, స్వరూపనంద సరస్వతి కూడా దీనిపై గళం విప్పకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఆయన విశాఖలోనే ఉన్నారా? ఉన్నప్పటికీ, తాను పెదవి విప్పితే సర్కారుకు ఎక్కడ ఇబ్బంది వస్తుందన్న మొహమాటంతో, లౌక్యం ప్రదర్శిస్తున్నారా? అన్న సందేహం తెరపైకొస్తోంది. తమిళనాడులో మతమార్పిడి, అన్యమత ప్రచారాన్ని అడ్డుకుంటామని, చెన్నైకి వెళ్లి మరీ హెచ్చరించిన స్వరూపానంద.. అదే విధానం ఏపీలో అమలవుతున్నా, స్వామి వారు ఇప్పటివరకూ స్పందించిన పాపాన పోలేదు. పిఠాపురంలో దేవతావిగ్రహాల విధ్వంసంపై స్వాములంతా రోడ్డెక్కినా, స్వరూపానంద మాత్రం పత్తా లేరు. విశాఖ నగర నడిబొడ్డున ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమాన్ని కబ్జా చేస్తున్నారని, స్వామి పూర్ణానంద సరస్వతి బహిరంగ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, అక్కడికి దగ్గరలోనే ఉన్న చినముషిడివాడలో కొలువుదీరిన స్వరూపానందుల వారికి మాత్రం,  ఆయన ఆందోళనలు వినిపించలేదు. మిగిలిన స్వాములు కూడా దీనిపై పెద్దగా స్పందించినట్లు లేదు.

అసలు,  హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీనే, ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే… హైందవ సమాజానికి దిక్సూచి, గురువులుగా భావించే స్వాములు మాత్రం, మౌనవ్రతం పాటించటంలో మర్మమేమిటన్నది, హిందూ సమాజం సంధిస్తున్న ప్రశ్నాస్త్రం. దీనికి జవాబు చెప్పేదెవరు?

2 COMMENTS