మహిళా దినోత్సవ స్పూర్తితో సమస్యల పరిష్కారానికై పోరాడదాం

539

మహిళా దినోత్సవ ర్యాలీ లో డి. రమాదేవి, కె. ధనలక్ష్మి

ప్రభుత్వ విధానాలతో మహిళల సమస్యలు పెరుగుతున్నాయని మహిళా దినోత్సవ స్పూర్తితో ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కే .ధనలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నగరంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ర్యాలీ జరిగింది.

ప్రభుత్వ ఆసుపత్రి, ఏలూరు లాకులు సెంటర్ ,న్యూ ఇండియా హోటల్ అలంకార్ సెంటర్ మీదుగా లెనిన్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో ఐద్వా మహిళా సంఘం, సి ఐ టి యు, ఎన్ఆర్సీ వ్యతిరేక వేదిక, మధ్యతరగతి ఉద్యోగ సంఘాల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన సభలో రమాదేవి, ధనలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో సైతం మహిళలపై దాడులు ,అత్యాచారాలు పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో ఆర్థిక మాంద్యం నెలకొందని దీనివలన ఉపాధి దెబ్బతిన్న వారిలో మహిళలు ఉన్నారని తెలిపారు. గృహిణులు నిర్వహిస్తున్న పనిని దేశ జీడీపీలో పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.పని ప్రదేశాలలో లైంగిక వేధింపు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పథకాల లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు.పౌరసత్వ బిల్లుతో నష్ట పోయే వారిలో మహిళలు ఎక్కువ శాతం ఉంటారన్నారు. కేవలం జనగణన కు మాత్రమే ప్రభుత్వం పరిమితం కావాలని, సి ఎ ఎ, ఎన్ పి ఆర్, ఎన్ ఆర్ సి అమలు చేయరాదని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో శ్రామిక మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మిక చట్టాల మార్పుతో శ్రామిక మహిళల పరిస్థితులు దిగజారి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు .మహిళలు ప్రత్యేకించి శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహిళా దినోత్సవ స్పూర్తితో పోరాటాలు చేపడతామని చెప్పారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందక పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు .కే .సరోజ, టి గజలక్ష్మి, ఇవి నారాయణ అధ్యక్షత వహించిన సభలో యుటిఎఫ్ నాయకులు పి లీల, ఎన్ ఆర్ సి వ్యతిరేక నాయకులు షాహినా, మధ్యాహ్న భోజన పథకం నాయకులు రమాదేవి, సి ఐ టి యు పశ్చిమ కృష్ణా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్ ఆశ కార్యకర్తలు నాయకులు శ్రీలక్ష్మి సహన దుర్గా లక్ష్మి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి కుమారి పాల్గొన్నారు.