* ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం
దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు వెల్లడించింది. తెదేపా ఎంపీ కేశినేని నాని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2016 సెప్టెంబర్‌ 30 నాటి కేంద్ర ఆర్థికశాఖ లేఖ ప్రకారం 100 శాతం పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందని అందులో స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాను కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని సమాధానంలో పేర్కొన్నారు. కేంద్రం ప్రకటన చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం ఆమోదం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.8,614.16కోట్లు చెల్లించామని.. గతనెలలో విడుదల చేసిన రూ.1,850 కోట్లు కూడా దీనిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

ఏపీ ఇచ్చే వివరాలపైనే మిగిలిన నిధులు…
పోలవరంపై 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చు ఆడిట్‌ నివేదికలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశామని.. 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు కూడా సమర్పించాలని ఆయా లేఖల్లో ప్రస్తావించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2018 జులై 26న, 2019 మే 6న రాసిన రెండు లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఆడిట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందించే వరకు తదుపరి నిధులు విడుదల చేయడం కుదరదంటూ గతేడాది నవంబర్‌ 26న కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రానికి మరో లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం తాత్కాలికంగా రూ.5,175.25 కోట్లకు గాను.. రూ.3,777.44 కోట్లకు ఆడిట్‌ పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాలపైనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడం ఆధారపడి ఉంటుందన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గజేంద్రసింగ్‌ షెకావత్‌ వివరించారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner