అబ్బబ్బబ్బ.. జీవీఎల్ చెప్పింది… అర్ధమవుతోందా?

621

పార్టీ-ప్రభుత్వానికి సంబంధం లేదట
పార్టీ కోరినవన్నీ ప్రభుత్వం చేయాలనేం లేదట
మరి అయోధ్య ఎలా చేపట్టారు?
370 రద్దు కూడా అదే కదా?
రాష్ట్ర విభజనలో చెప్పిందీ అదే
అమరావతిపై సహచరులవి తప్పుడు హామీలేనట
‘ఇలాంటిమోషన్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర’ంటున్న కమల దళం
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘పార్టీ రాష్ట్ర శాఖ చెప్పింది కేంద్రం వినాలనేం లేదు. అమరావతిపై తీర్మానం చేసినా కేంద్రం వినాలనేం లేదు’
‘ఎవరైనా కేంద్రం చేతిలో ఉంది కదా అని, అమరావతి విషయంలో తప్పుడు హామీలిచ్చినా, వ్యాఖ్యలు చేసినా అవి వారి వ్యక్తిగత అభిప్రాయలే’
– ఇవన్నీ కేంద్రానికి మిత్రపక్షమో, శత్రుపక్షమో తెలియని వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. స్వయంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పిన మాటలు. ప్రభుత్వానికి-పార్టీకీ సంబంధం లేదన్నది జీవీఎల్ తేల్చేశారు.
అమరావతి విషయంలో తమ నేతలు కొందరు తప్పుడు హామీలిస్తున్నారన్న వ్యాఖ్యైెపె, ఇప్పుడు కమలదళం కారాలు మిరియాలు నూరుతోంది. ఇది అమరావతిని రాజధానిగా అక్కడే కొనసాగించాలని సమరం సాగిస్తోన్న కమలదళంలో అగ్గి రాజేసింది.

అమరావతి రాజధాని అంశంపై బీజేపీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిపై కొందరు జాతీయ నేతలు, తమ సొంత అభిప్రాయాలు రుద్దుతున్నారని విమర్శించారు. ఎల్లయ్య, పుల్లయ్యలు చెబితే స్పందించనని ఆయన పరోక్షంగా, జీవీఎల్ వ్యాఖ్యలపై విరుచుకుపడటం పార్టీలో చర్చనీయాంశమయింది.
సుజనా మీడియాతో మాట్లాడిన గంటన్నరకే.. జీవీఎల్ మీడియా ముందుకు వచ్చారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ చెప్పినంత మాత్రాన, కేంద్రం స్పందించాలనేం లేదని చెప్పడం, గందరగోళానికి దారితీసింది. తాము రాజకీయ పార్టీగా ఎన్నో డిమాండ్లు చేస్తుంటామని, అలాగని కేంద్రం వాటిని ఆచరించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అంటే.. ప్రభుత్వానికి-పార్టీకీ సంబంధం లేదని స్పష్టం చేశారన్నమాట. ఇది ఒకరకంగా, తమ పార్టీ ఓట్ల కోసం, ప్రజలను మోసం చేస్తుందన్న అపోహకు దారితీసేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇలాంటిమోషన్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

దానిపైనే ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జీవీఎల్ చెప్పినట్లు.. పార్టీ చెప్పినవన్నీ, ప్రభుత్వం చేయదన్నదే నిజమైతే మరి పార్టీ-ప్రభుత్వం కలసి, ఇప్పటివరకూ అమలుచేసిన కార్యక్రమాల సంగతేమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీ కొన్నేళ్ల నుంచి చేస్తున్న డిమాండ్. దానికోసం బీజేపీ అగ్రనేతలు శిలాన్యాస్‌లో పాల్గొన్నారు.

అద్వానీ, ఉమాభారతి వంటి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపునకు గురయ్యారు. తాము అధికారంలోకి వస్తే, అయోధ్యలో రామమందిరం నిర్మాస్తామని, పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్ర ప్రయత్నం, సుప్రీంకోర్టు జోక్యం, కలసి వెరసి అయోధ్యలో రామమందిరం సాధ్యం కాబోతుంది. ఆ ప్రకారంగా అయోధ్యలో రామమందిరంపై, బీజేపీ ఇచ్చిన హామీని కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్న అదే పార్టీ, అమలుచేసినట్టయింది.

జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్టికల్ 370ను రద్దు చేయాలని బీజేపీ, ఒక రాజకీయ పక్షంగా కొన్నేళ్ల నుంచీ ఉద్యమిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తామని బీజేపీ ఒక రాజకీయ పార్టీగా హామీ ఇచ్చింది. కామన్‌సివిల్ కోడ్ అవసరం గురించి బీజేపీ, వాజపేయి హయాం నుంచీ ప్రస్తావిస్తూనే ఉంది. ఆ ప్రకారంగానే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ, 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, అక్కడ రెండు రాష్ట్రాలు ఏర్పాటుచేసింది. అంటే, పార్టీ ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందన్నమాట!

ఇక పౌరసత్వ సవరణ చట్టం కేంద్రప్రభుత్వం అమలుచేసింది. దానికి బీజేపీని రాజకీ యంగా విమర్శించే, ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతునిచ్చాయి. కానీ, అది బీజేపీ రాజకీయపార్టీగా ఇచ్చిన హామీ కాదు. అయినప్పటికీ, దానిపై బీజేపీ దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు పెట్టి, వివరణలు ఇస్తూనే ఉంది. ఎన్నార్సీ కూడా బీజేపీ ప్రకటించిన కార్యక్రమం కాదు. కానీ, దానిపైనా బీజేపీ రాజకీయ పార్టీగా, దేశవ్యాప్త సభలు నిర్వహిస్తోంది.

మరి ఆ ప్రకారంగా… జీవీఎల్ సూత్రీకరించినట్లు, 370 రద్దుపై బీజేపీ రాజకీయ పార్టీగా చేసిన డిమాండ్‌ను, కేంద్రంలో ఉన్న అదే పార్టీ చేయకూడదు. అయోధ్య విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే, దానిని ఒక రాజకీయ పార్టీగా బీజేపీ సమర్ధించి, సభలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారంలో కూడా, రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ కాకినాడలో తీర్మానించింది. తర్వాత, ఆ హామీ మేరకే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విభజనకు మద్దతు ఇచ్చామని, బీజేపీ స్పష్టం చేసింది. ఇక నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని బీజేపీ ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ స్పైసెస్ బోర్డు ఏర్పాటుచేసింది.

మీకు అర్ధమవుతోందా…

అంటే.. పార్టీపరంగా బీజేపీ, ప్రభుత్వపరంగా కేంద్రం సమన్వయంతోనే వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సహజంగా అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ.. ప్రతిపక్షాలకు భయపడి, ‘పార్టీ వేరు-ప్రభుత్వం వేరు’ అని చెబుతుంటాయి. కానీ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీల సమావేశాలప్పుడు మాత్రం, ‘పార్టీ-ప్రభుత్వం వేర్వేరు కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాల’ని స్పష్టం చేస్తూనే ఉంటాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇదిలాఉండగా, అమరావతిపై తమ పార్టీ నేతలు కొందరు ఇచ్చేవన్నీ తప్పుడు హామీలేనంటూ, జీవీఎల్ చేసిన వ్యాఖ్యపై.. రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అమరావతి రైతులతో కలసి.. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధీశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, రావెల కిశోర్ వంటి అగ్రనేతలు చేస్తున్న పోరాటాలు.. అమరావతిని అంగుళం కూడా కదలనీయమని ఇస్తున్న హామీలను, జీవీఎల్ వెక్కిరించినట్లుగానే ఉందని, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సొంత పార్టీ నేతలను అవమానించడంతోపాటు, అధికార వైసీపీ నేతలకు అస్త్రం ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు.

ఒక చానెల్ ఇంటర్వ్యూలో కూడా, కొత్తగా చేరిన నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపైనా, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చేరిన కొందరు నేతలకు, పాత వాసనలు పోవడం లేదని జీవీఎల్ చే సిన వ్యాఖ్యను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అమిత్‌షా, నద్దా సమక్షంలో చేరిన వారిని, జీవీఎల్ వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని మార్పులో కేంద్రానికి సంబంధం లేదని వాదిస్తున్న జీవీఎల్.. మరి సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న రైతులకు న్యాయం జరుగుతుందని, ఏ హోదాలో హామీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

అసలు అమరావతిపై రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటనలు చేసిన ప్రతిసారీ, జీవీఎల్ రంగంలో దిగి, దానికి విరుద్ధంగా మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. అమరావతి గురించి మాట్లాడిన ప్రతిసారీ, జీవీఎల్ రంగప్రవేశం చేయడంపై ఇప్పటికే పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి మీడియాతో మాట్లాడిన వెంటనే, జీవీఎల్ మీడియాను పిలిచి మాట్లాడటాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పైగా, ఆయన చేస్తున్న ప్రకటనలు, వైసీపీ నేతలను కూడా ఈర్ష్యపరిచేలా ఉన్నాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘మా ఎంపీ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయి. ఆ పక్కనే సుజనా చౌదరి చేసిన ప్రకటన కూడా వచ్చింది. వాటిని రాజకీయాలకు సంబంధం లేని సామాన్య వ్యక్తి చదివినా, జీవీఎల్ గారు ఎవరి కోసం, ఎందుకోసం, ఆవిధంగా మాట్లాడారన్నది తెలిసిపోతుంది. ఆ రెండూ చదివితే, మా పార్టీలో అగ్రనేతల మధ్య సయోధ్య లేదన్న విషయం అందరికీ స్పష్టమవుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్‌పై మా జాతీయ నాయకత్వానికి ఒక విధానం లేదని కూడా అర్ధమవుతుంది. ఈ గందరగోళం తేల్చకుండా, రాష్ట్రంలో పార్టీ ఏ దిశలో వెళ్లాలని నిర్ణయించకుండా, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.