ముస్లీంల సంక్షేమానికి రూ.2.70 కోట్లు కేటాయింపు

308

ముస్లీంల సంక్షేమానికి రూ.2.70 కోట్లు కేటాయింపు : మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ముస్లీం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2.70 కోట్ల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, రొంపిచర్ల, చౌడేపల్లితో పాటు పులిచర్ల మండలం కల్లూరు గ్రామంలో సుమారు రూ.50 లక్షల చొప్పున ముస్లీం మైనార్టీల కోసం నాలుగు షాదీమహల్స్ నిర్మాణంకు ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నాలుగు మండలాల్లో దాదాపు రెండు కోట్ల రూపాయలతో పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే సదుం రొంపిచర్ల, సోమల, కల్లూరు లకు నలబై లక్షల రూపాయల చొప్పున మసీదుల మరమ్మత్తులు, ఆధునీకరణ పనుల కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.40 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని తెలిపారు. ఒక్కో మసీదుకు పది లక్షల రూపాయలతో పనులు చేపడతామని వెల్లడించారు. అలాగే ఎప్పటి నుంచో పుంగనూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం వున్న షాదీమహల్ కు అదనంగా మొదటి అంతస్తు నిర్మాణంను ముస్లీం సోదరులు కోరుతున్నారని, దానిపై కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ మేరకు ప్రభుత్వం మొదటి అంతస్తు నిర్మాణంకు రూ. 30 లక్షలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేటాయిస్తూ జీఓ జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.