పోలీసులూ మనుషులే కదా!?

131

( మార్తి సుబ్రహ్మణ్యం)
రాష్ట్రం ఏదైనా కానీ.. జిల్లా ఏదైనా కానీయండి. ప్రజలు నిర్భయంగా గుండెపైచేయి వేసుకుని, పడుకుంటున్నారంటే దానికి కారణం పోలీసు వ్యవస్థ. పగలు, రాత్రి సమాజానికి కాపలా కాసే పోలీసులు లేకపోతే, వ్యవస్థ ఇంత సజావుగా సాగదు. రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు రక్షకభటుల్లా కనిపిస్తారు. అదే అధికారం పోతే మాత్రం, వారు భక్షకుల్లా కనిపిస్తుంటారు. అదే రాజకీయం.
కానీ పోలీసుల వృత్తి కత్తిమీద సాము. ఐపిఎస్ అధికారులను మినహాయిస్తే, రోడ్డుపై రోజూ డ్యూటీ చేసే సాధారణ కానిస్టేబుల్ నుంచి, ఎస్‌ఐ, సీఐ వరకూ చేసే విధినిర్వహణకు ఏ ప్రభుత్వమూ గుర్తింపు ఇవ్వదు. ఏ రాజకీయ పార్టీ అభినందించదు. ఓవరాక్షన్ చేసే ఎలక్ట్రానిక్ మీడియాకు పోలీసు క్వార్టర్లపై వైపు తొంగిచూసి, అక్కడి పోలీసు కుటుంబాలు పడే కష్టాలు చూసే ఓపిక ఉండదు. పోలీసులలో అవినీతిపరులు ఉండవచ్చు. స్టేషన్ బెయిల్‌కూ చేతులుచాపే కక్కుర్తిపరులు ఉండవచ్చు. మాజీ నక్సలైట్లను అడ్డుపెట్టుకుని, సెటిల్‌మెంట్లు చేసే వారూ ఉండవచ్చు. చిల్లర దొంగలతో లాలూచీ పడేవారూ ఉండవచ్చు. కానీ, మనుషుల్లో మంచి వారు-చెడ్డవారు ఎలా ఉంటారో, పోలీసులలోనూ అంతే ఉంటారు. ఎందుకంటే…వారూ మనుషులే కాబట్టి!

ప్రజల రక్షణ కోసం కుటుంబ జీవితానికి దూరంగా ఉండి, రోడ్డుపై వాహనాలు వెదజల్లే కాలుష్యాన్ని… అమృతంగా స్వీకరించే పోలీసుల త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఏ ఉదయం, ఏ రాత్రిళ్లు వారివి కాదు. వీవీఐపిలు వస్తే ఇక అంతే సంగతి. కుటుంబ సభ్యులతో సినిమా, షికార్లకు వెళ్లడమంటే వారికి కల. పిల్లల చదువులు పట్టించుకునే తీరిక, ఓపిక, సమయం అసలే ఉండదు. అలా వారి జీవితమంతా, జనం మధ్యలోనే తెల్లారిపోతుంది. అలాంటి పోలీసులకు విందు, వినోదాలలో పాల్గొనే అవకాశం, సమయం అతి తక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్లు కూడా మామూలు మనుషుల్లాగానే ప్రవర్తిస్తారు. కానీ, దానిని మీడియా భూతద్దంలోచూపి, అదేదో సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నంత హడావిడి చేయడమే విడ్డూరం. దానికి పోలీసు బాసులు వాయువేగంతో స్పందించి, వారిపై చర్యలు తీసుకోవడం మరీ విడ్డూరం.

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో, ఇటీవల సాటి కానిస్టేబుల్ కుటుంబంలోజరిగిన ఓవివాహానికి అక్కడి కానిస్టేబుళ్లు హాజరయ్యారు. మిత్రుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకను వారు సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణలో చావయినా, పెళ్లయినా మందుఉండటం సహజం. దానితో ఆ కానిస్టేబుళ్లు మందుబాటిళ్లతో సరదా చేసుకున్నారు. దానిని వీడియోలో బంధించిన కొందరు, అదేదో ఘోర తప్పిదమన్నంత హడావిడి చేశారు. కొన్ని చానెళ్లు కూడా దానిపై ఓవరాక్షన్ చేశాయి. దానితో జిల్లా పోలీసు అధికారులు ఆగ్రహించి, వారిని సరెండర్ చేశారు. ఇదీ వార్త!

బాగానే ఉంది. నలుగురైదుగురు పోలీసులు, సాటి ఉద్యోగి ఇంట్లో పెళ్లి జరిగితే, మందుబాటిళ్లతో పార్టీ చేసుకున్నారు. దానికి పోలీసు బాసులు స్పందించి, చర్యలు తీసుకున్నారు. మరి.. ఐపిఎస్, ఐఏఎస్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో తాగి, స్టెప్పులేసి, అవి టీవీలో వచ్చినా ఎందుకు స్పందించరు? కలెక్టర్ల స్థాయి అధికారులు క్యాట్‌వాకులు చేస్తే పట్టించుకోరు. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే.. పైవారికో న్యాయం? కిందిస్థాయి ఉద్యోగులకో న్యాయమా?.. గవర్నమెంటు ఆఫీసుల్లో పేకాట ఆడే ఉద్యోగులను ఎందుకు పట్టించుకోరు? ఐపిఎస్, ఐఏఎస్‌ల పిల్లలు వీకెండ్ రోజుల్లో అర్ధరాత్రి వరకూ పీకల దాకి పబ్బుల్లో తాగి, రోడ్డెక్కినా ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే వారు మనుషులు కాదు. మహాత్ములు కాబట్టి! కానీ సగటు కానిస్టేబుల్ ఓ బాటిల్ పట్టుకుని, స్టెప్పులేస్తే మాత్రం వారిపై శిక్షలు విధిస్తారు. ఎందుకంటే వారు మనుషులు కాబట్టి!!

ఇటీవల బీజేపీ ఎంపి సీఎం రమేష్ ఇంట్లో జరిగిన వివాహవేడుకలో, ఆయన బహిరంగంగానే డాన్సులు వేశారు. ఆ తర్వాత ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా స్టేజీపై స్టెప్పులేశారు . నర్సరావుపేట మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా, ఇటీవల ఓ వేడుకలో డాన్సులేశారు.కానీ… వీటిని ఎవరూ తప్పు పట్టలేదు.తెలంగాణలో జరిగే ప్రతి శుభ, అశుభ కార్యక్రమంలో మద్యం తప్పనిసరిగా వినియోగించే సంస్కృతి, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. దానిని వారు ప్రతిష్ఠ, గౌరవంగా భావిస్తారు.దాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన పనిలేదు. అది వారి జీవనవిధానంలో ఓ భాగం. ప్రజల అలవాటు, సంస్కృతి, సంప్రదాయం ఇవేమీ తెలియని మీడియా, ఏదో సంచలనం కోసం వాటిని చూపించి హడావిడి చేయడమే తప్పు. దానికి మితిమీరి స్పందించి, పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పున్నర తప్పు.ఇప్పటికైనా చర్యలు తీసుకున్న సాధారణ పోలీసులను వదిలేస్తే మంచిది.