రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

499

ఏపీలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నంb 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఓఎంఆర్ షీట్ నింపేందుకు అరగంట ముందే పరీక్ష కేంద్రాల్లో ఉండాలని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన లేదని స్పష్టం చేశారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిస్తామని చెప్పారు. ఆలస్యానికి కారణం తెలుసుకుని విద్యార్థులను అనుమతించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల అనుమతిపై పరిస్థితుల మేర నిర్ణయం ఉంటుందని అన్నారు.

కాగా, ఈసారి మొత్తం 10.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలో 1,411 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పూర్తిస్థాయి జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. హాల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరంలేదని అన్నారు.

విద్యార్థుల సౌకర్యార్థం యువర్ ఎగ్జామ్ సెంటర్ అనే యాప్ రూపొందించామని వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. 1800 2749868, 0866 2974130 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. అంతేకాదు, 9391282578 నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమస్యలు నివేదించవచ్చని తెలిపారు.

1 COMMENT