ఏపీలో కరోనా వైరస్‌ లేదు

242

అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్19) లేదని వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిరంతర నిఘా పెట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి 263 మంది ప్రయాణికులు రాష్ట్రానికొచ్చారని, వారందరినీ పరిశీలనలో ఉంచామని తెలిపారు. అందులో 50 మంది వారివారి ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. 211 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని చెప్పారు. 11 మంది శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా 10 మందికి నెగెటివ్‌ అని తేలిందని చెప్పారు. ఒకరి శాంపిల్‌కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందన్నారు. కాగా, తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే.