జగన్‌లో.. మార్పు వస్తోందా?

459

ముఖేష్ అంబానీతో రెండు గంటల చర్చలు
గతంలో వైఎస్ మృతి తర్వాత రిలయన్స్‌పై వైసీపీ శ్రేణుల దాడులు
ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానన్న అంబానీ
(మార్తి సుబ్రహ్మణ్యం)
అనుభవాలు పాఠాలు నేర్పుతాయంటారు. ఏపీ సీఎం జగన్- పారిశ్రామిక దిగ్గజమైన ముఖేష్ అంబానీ భేటీ చూస్తే అది నిజమేననిపిస్తుంది. గతంలో ఆగర్భశత్రువుగా భావించిన అంబానీకి, జగన్ ఎదురేగి స్వాగతం పలికిన తీరు చూస్తే, జగ న్ లో మార్పు వస్తోందన్న సంకేతాలకు కారణమవుతోంది. అటు అంబానీ కూడా, రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు రావడం మరో ఆసక్తికర విషయం.

అంబానీ-చంద్రబాబు  సంబంధం

సెల్‌ఫోన్ రంగంపై దృష్టి సారించాలని, చంద్రబాబు నాయుడే తమ కుటుంబానికి సూచించారని, గతంలో అంబానీ చెప్పిన విషయం తెలిసిందే. అంబానీ సోదరులు జాతీయ స్థాయిలో రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఒకరు కాంగ్రెస్, మరొకరు బీజేపీ శిబిరంలో ఉంటారన్నది బహిరంగమే. అయితే, వారిద్దరు జాతీయ స్థాయిలో ఏ పార్టీ వైపు ఉన్నప్పటికీ, ఏపీ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడుతోనే ఉంటారన్నదీ అంతే నిజం. గతంలో బాబు సీఎంగా ఉన్న సమయంలో, రిలయన్స్ గ్యాస్‌పై విపక్షాల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతికి రిలయన్స్ కూడా ఒక కారణమని, స్వయంగా గతంలో జగన్ ఆరోపించారు.
వైఎస్ మృతి తర్వాత ఆగ్రహించిన వైఎస్ అభిమానులు, రెండు తెలుగు రాష్ర్టాల్లోని రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారు.
అప్పట్లో తన తండ్రి హెలికాప్టర్ మరణంపై విచారణ జరిపించాలని జగన్ కూడా డిమాండ్ చేశారు.
కాకినాడ గ్యాస్ నిక్షేపాలపై, అంబానీ-జగన్ మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలు, అప్పట్లో వెలువడిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచీ అంబానీ-జగన్ మధ్య దూరం అలాగే ఉండిపోయింది.

ముఖేష్ ప్రధాని బృందంలో సభ్యుడిగా ఉన్నప్పటికీ, జగన్‌తో సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో వారిద్దరూ భేటీ కావడం సహజంగానే ఆసక్తి కలిగించింది. అమరావతికి వచ్చిన ముఖేష్ అంబానీకి జగన్ దంపతులు ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక విమానంలో వచ్చిన అంబానీ,ఆయన కుమారుడు అనంత్ అంబానీకి, గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు.
వారిని ఆయన జగన్ నివాసానికి తీసుకువెళ్లారు. వారిద్దరూ సుమారు రెండు గంటల పాటు చర్చించారు.
జగన్ సర్కారు విద్యారంగంలో మార్పు కోసం, ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమానికి రిలయన్స్ సహకారం, రాష్ట్రంలో పెట్టుబడులపైనే ఎక్కువసేపు చర్చ జరిగినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ భేటీ జగన్ షెడ్యూల్‌లో లేకపోవడం గమనార్హం.

జగన్ సర్కారు విద్యా , వైద్య రంగాల్లో అమలు చేస్తున్న వివిధ పధకాలకు, రిలయన్స్ భాగస్వామ్యంపై చర్చలు జరిగాయి.
తాజా పరిణామాలు పరిశీలిస్తే, జగన్‌లో స్వాభావిక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అంబానీ కుటుంబం పేరు చెబితేనే భగ్గుమనే జగన్.. స్వయంగా ఆ కుటుంబ పెద్దతోనే చర్చించడమే, దానికి కారణమని విశ్లేషిస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బలహీనంగా ఉండటం , రాజకీయంగా బీజేపీతో పెరుగుతున్న దూరం, అంబానీతో ప్రధానికి సన్నిహిత సంబంధాల కోణంలోనే జగన్.. తన పాత వైఖరిని మార్చుకుని, ముఖేష్‌తో చర్చలకు అంగీకరించినట్లు కనిపిస్తోంది. తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుకి సన్నిహితుడని తెలిసినప్పటికీ , ముఖేష్‌తో మంతనాలు సాగించారంటే..జగన్‌లో మార్పు వస్తున్నట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మార్పు ఎవరికైనా మంచిదే కదా? అయితే, అలాంటి గుణాత్మక మార్పు తండ్రి వైఎస్ మాదిరిగా ఉంటే, జగన్ తక్కువ కాలంలోనే పెద్ద నేతగా చరిత్రలో నిలిచిపోతారు. పాదయాత్ర సందర్భంగా, వైఎస్ తన విరోధులతో రాజీ చేసుకున్నారు. ఒక సందర్భంలో తనకు కోపం అనే ఆరో నరం తెగిపోయిందని వైఎస్ వ్యాఖ్యానించారు. అనుభవాలు అనేక పాఠాలు నేర్పిస్తాయి. ఈ విషయంలో జగన్ కూడా మినహాయింపు కాదు.