మంకీ ఫీవర్ .. కర్ణాటకలో ఓ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది

484

మంకీ ఫీవర్ ..
కర్ణాటకలో ఓ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రమాదకరంగా ప్రబలుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రబలుతున్న తీరు కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించేలా చేసింది. ఈ వైరస్ పేరే- కైసనూర్ ఫారెస్ట్ డిసీస్. సింపుల్‌గా మంకీ ఫీవర్ అని పిలుస్తున్నారు. ఈ వైరస్ బారిన ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 55 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు వారిలో కనిపించడంతో అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు.

ఈ ఫీవర్‌ను ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గ జిల్లాల్లో తొలిసారిగా గుర్తించారు. అనంతరం ఇది ఉత్తర కన్నడ జిల్లాకు విస్తరించింది. ఈ రెండు జిల్లాల్లో ఈ మంకీ ఫీవర్ బారిన పడి ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లాలోని సాగరలో 58 సంవత్సరాల ఓ మహిళ మరణించారు. తాజాగా ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపుర తాలూకా హొన్నెఘటకి సమీపంలోని మలగుళి గ్రామానికి చెందిన వారికి ఉన్నట్లు అధికారులు అంటున్నారు.

అదే సమయంలో 55 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని శివమొగ్గ, మణిపాల్ ఆసుపత్రులకు తరలించారు. అత్యవసరంగా వారికి చికిత్స అందిస్తున్నారు. వారందరిలోనూ మంకీ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని శివమొగ్గ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ ఫీవర్‌ను నియంత్రించడానికి అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.

వ్యాక్సిన్ల ద్వారా మంకీ ఫీవర్‌ను నియంత్రించడానికి అవకాశం ఉందని చెప్పారు. అవసరమైన వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయని అన్నారు. సాధారణంగా కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యకాలంలో తరచూ కనిపిస్తుంటుందని, ఈ సారి దీని లక్షణాలు కాస్త ముందే వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కాగా- మంకీ ఫీవర్ ప్రబలిపోవడం, ఇప్పటికే ఇద్దరు మరణించడం, 55 మందిలో లక్షణాలు కనిపించడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు శివమొగ్గ, ఉత్తర కన్నడ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంకీ ఫీవర్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.