కమలదళంలో ఆ ముగ్గురి దారులు వేరు!

510

ఆ ముగ్గురూ ‘ఫ్యాను’కు ఊపిరిపోస్తున్నారా?
సర్కారును వదిలి, విపక్షంపై విమర్శలు
సర్కారుతో రాయబేరాలాడుతున్నారా?
అందులోఒకరికి పవర్ ప్రాజెక్టు, హోటల్ ఇచ్చినట్లు ప్రచారం
కమలం గూటిలో పెరుగుతున్న అనుమానాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అగ్ర నేతల దారులు వేరయ్యాయా?.. ఓ ముగ్గురు నేతలు అధికార పార్టీ అనధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా?.. అందులో ఓ అగ్ర నేత, వైసీపీ ఎప్పుడు కష్టంలో ఉన్నా, వచ్చి ఏపీలో వాలిపోయి, టిడిపిని దుయ్యబట్టే పనికి ఒప్పుకున్నారా? అందుకు సదరు నేతకు పవర్ ప్రాజెక్టుతోపాటు, హోటల్ కూడా నజరానాగా ముట్టిందా? ఇంతకూ ఆ ముగ్గురూ వైసీపీ నేతలా? బీజేపీ నేతలా? ..ఇదీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్!
ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేకపోయినా, ముఠాలకు, గ్రూపులకు మాత్రం కొదవలేదు. ఒక్కొక్కరు ఒక్కో మోదీ, అమిత్‌షా,అద్వానీ స్ధాయిలా భావిస్తుంటారు. డివిజన్ స్థాయి నేతలు, సొంతగా వంద ఓట్లు కూడా సాధించలేని కొందరు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలుగా చెలామణి అవుతున్న దుస్థితి. ఉన్న ఊళ్లో ఠికానా లేకపోయినా, ఢిల్లీ నేతల పరిచయాల పుణ్యాన, రాష్ట్ర-జాతీయ నేతలుగా చెలామణి అవుతున్న వైచిత్రి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బాపతు నేతలు గల్లీకి తక్కువ-బెజవాడకు ఎక్కువ. వారిది ఏపీలో విచిత్ర వైఖరి. రాష్ట్ర నేతలది ఒక దారయితే, ఆ ముగ్గురిదీ మరోదారి. రాష్ట్ర నేతలంతా అధికార పార్టీపై విరుచుకుపడితే.. ఆ ముగ్గురు మాత్రం, జీవచ్ఛవంలా పడి ఉన్న టిడిపిని ఇంకా విమర్శిస్తున్న విచిత్ర రాజకీయ పరిస్థితి.
రాజధానిగా ఉన్న అమరావతిని విశాఖకు తరలించాలన్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని, బీజేపీ రాష్ట్ర కమిటీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. అయితే, ఓ నేత మాత్రం ఆ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. మా పార్టీ వైఖరి అమరావతే అంటారు. మళ్లీ అంతలోనే అందులో కేంద్రం జోక్యం చేసుకోదని సన్నాయి నొక్కులు నొక్కుతారు. గతంలో టిడిపి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని విరుచుకుపడతారు.అంతే తప్ప, రాజధాని మార్పు ప్రయత్నాలను అసలు విమర్శించరు. ఇప్పటివరకూ సదరు నేత, ఒక్కసారి కూడా సర్కారును విమర్శించిన దాఖలాలు, భూతద్దంవేసి వెతికినా కనిపించవు. అందుకు మరో ఇద్దరి మద్దతు. అసలు ప్రధాని మోదీనే స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధాని నగరాన్ని మరొక చోటకు మారిస్తే,ఈ నాయకశిఖామణులు దానిని ఏ మాత్రం అవమానంగా భావించకపోవడంపై, సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సహజంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని, విమర్శలు చేస్తుంది. కానీ, ఏపీలో మాత్రం విచిత్రంగా.. విపక్షంలో ఉన్న బీజేపీకి చెందిన ఓ ముగ్గురు నాయకులు మాత్రం, దానిని విరుద్ధంగా అధికారం కోల్పోయిన టిడిపిపై దాడి చేస్తుండటంపై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయి, 23 స్థానాలకు దిగజారి, సొంత పార్టీ నేతలే పక్క పార్టీల వైపు చూస్తున్న టిడిపిని విమర్శించి.. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీని విస్మరించడంపై కమదళాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దానితో ఈ నేతలు అసలు వైసీపీలో ఉన్నారా? తమ పార్టీలోనే ఉన్నారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ప్రధానంగా.. రాష్ట్రంలో, ఆ మాటకొస్తే కనీసం సొంత ఊరిలో కూడా ఏ మాత్రం పట్టు లేని ఓ సీనియర్ నాయకుడు.. వైసీపీ రాజకీయంగా కష్టంలో ఉన్న ప్రతిసారీ ఏపీకి వచ్చి, దానిని ఆదుకునేందుకు చేస్తున్న ప్రకటనలపై బీజేపీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అధికార పార్టీని కాకుండా, కేవలం ప్రతిపక్షమైన టిడిపిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న వైనంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సదరు నేత రాష్ర్టానికి వచ్చినప్పుడల్లా, ఎవరికీ లేని విధంగా ప్రభుత్వం ఆయనకు.. ఎస్కార్టు, పైలట్ వాహనాలు సమకూర్చడాన్ని బీజేపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటివరకూ జగన్ సీఎం అయిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు సహా సీనియర్లెవరూ ఆయనను కలసిన దాఖలాలు లేవు. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పురంధీశ్వరి, కావూరి సాంబశివరావు, రావెల కిశోర్‌బాబు వంటి నేతలెవరూ సీఎంను కలవకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. చివరకు అనేక ప్రజాసమస్యలపై కన్నా, సీఎం జగన్‌కు బహిరంగలేఖలు రాసినా ఆయన నుంచి స్పందన లేదు. అయితే, కొందరు మాత్రం ఆయనను కలవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది.
ఇంగ్లీషు విద్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సీఎం జగన్ నేరుగా విమర్శిస్తే, రాష్ట్ర అధ్యక్షుడితో సహా, నేతలంతా ఎదురుదాడి చేశారు. కానీ ఆ ముగ్గురు నేతలు మాత్రం పెదవి విప్పకపోవటాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. పురంధ్వీరిని వైసీపీలో చేరకపోతే, దగ్గుబాటి అవసరంలేదని వైసీపీ అధినేత స్పష్టం చేసినప్పుడు కూడా బీజేపీ నేతలు దానిని విమర్శించారు. కానీ, ఈ ముగ్గురు మాత్రం నోరు మెదపలేదు. కాగా, వీరిలో ఒకరికి పవర్ ప్రాజెక్టు, ఒక హోటల్ నజరానాగా దక్కినట్లు పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ అంతర్గత సమావేశాల్లో సైతం, జగన్‌లో బాగా మార్పు వస్తోందని కితాబు ఇవ్వడంపై సీనియర్లు నోరెళ్లబెడుతున్నారు. సదరు నేత ఢిల్లీలో చక్రం తిప్పుతున్న, ఒక ప్రముఖుడితో టచ్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. మరోనేత, గతంలో మాదిరిగానే ఈ సర్కారులో కూడా కావలసిన పనులు చక్కబెడుత్నునట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తపన పడుతున్న తమ పార్టీ పరిస్థితి… ‘అక్క ఆర్భాటమే తప్ప బావ బతికుంది లేద’న్నట్లుగా మారిందని సీనియర్లు చెబుతున్నారు. తమ పార్టీ నేతలు కొందరు, రోజూ మీడియాలో కనిపించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన లేదని విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కనీస బలం కూడా లేని కొందరిని, నాయకత్వం తమ నెత్తిన రుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించే ప్రయత్నాన్ని, ఈ తరహా నేతలు అవమానంగా భావించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా విశాఖలో చంద్రబాబుపై దాడి జరిగితే, దానిని విశాఖ జిల్లా నేతలయిన ఎమ్మెల్సీ మాధవ్, బీజేఎల్పీ మాజీ నేత విష్ణుకుమార్‌రాజు ఖండించారు. అది ప్రజలు చేసిన దాడి కాదని, అలాంటి చిల్లర పనులతో విశాఖ పరువు తీయవద్దని వ్యాఖ్యానించారు. అయితే, యుపీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం.. హటాత్తుగా ఈ ఘటన జరిగిన తర్వాత ఏపీకి వచ్చి, చేసిన ప్రకటన బీజేపీలో భిన్నవైఖరులకు అద్దం పట్టింది. నిన్నటి సంఘటన కంటే ఎక్కువగా గతంలో టిడిపి వ్యవహరించిందని, కాబట్టి ఇప్పుడు జరిగిన ఘటన చిన్నదేనన్నారు. గతంలో జగన్ విశాఖకు వెళితే బాబు సర్కారు అడ్డుకుందని, కోడి త్తితో దాడి జరిగితే హాస్యాస్పదంగా ఉందని వ్యవహరించిన టిడిపి.. గతంలో సరిగా వ్యవహరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. గతంలో అమిత్‌షా తిరుపతి వచ్చినప్పుడు ఆయనపై చెప్పులు వేయించారని, గతంలో చంద్రబాబు చేసిన తప్పులే నేడు ఆయనను వెన్నాడుతున్నాయని చెప్పారు. జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలు చూసి, వైసీపీ అధికార ప్రతినిధులు కూడా ఈర్ష్యపడుతున్నారన్న వ్యంగ్యోక్తులు బీజేపీలో వినిపిస్తున్నాయి. అమిత్‌షాపై చెప్పులు వేయించిన వైనాన్ని గుర్తు చేయడం మంచిదేనని, అయితే జగన్‌ను గతంలో అవమానించినందుకే, ఇప్పుడు బాబునూ అవమానించారన్నట్లు మాట్లాడటమే బీజేపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.