బాబు ఉచ్చులో జగన్ ఇరుక్కున్నారా?

695

విశాఖ ఘటనను బాబు ముందే ఊహించారా?
విశాఖపై నిజమైన టిడిపి ‘కడప నిందలు’
నాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న జగన్
ఎయిర్‌పోర్టు ఘటనతో టిడిపికి మైలేజీ ఇచ్చారా?
జడ్జి వ్యాఖ్యలతో పోలీసుల పరువు పోయిందా?
న ందిగంకో రూలు..నారాకో రూలా?
విశాఖ పోలీసులేం చేస్తున్నారు?
నాడు బాబు చేసిన తప్పులే నేడు జగన్ చే స్తున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
గతంలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులనే, నేటి సీఎం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారా? కసి,పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ప్రత్యర్థి చేతికి అస్ర్తాలందిస్తున్నారా? ఆయన అనుభవరాహిత్యంతో ఇస్తున్న ఆదేశాలు, పోలీసుల పరువుతీస్తోందా? నాడు తనను విశాఖకు వెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని, వెనక్కి పంపించిన బాబుపై ఇప్పుడు జగన్ ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ ఒక్క సంతృప్తి తప్ప… చంద్రబాబు విసిరిన విశాఖ ఉచ్చులో జగన్ ఇరుక్కున్నట్లేనా?.. జగన్ ఇగో చల్లబడి, చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లగొట్టబడి, విశాఖ ఎయిర్‌పోర్టు రణరంగమైన తర్వాత జరుగుతున్న చర్చ ఇది.
టిడిపి అధినేత చంద్రబాబునాయుడును, విశాఖలో జరిగే చైతన్య యాత్రకు వెళ్లకుండా చేయడంలో, జగన్ సర్కారు విజయం సాధించింది. గతంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా, విశాఖలో జరిగిన ప్రత్యేకహోదా ఉద్యమానికి జగన్ వెళ్లారు. అయితే ఆయనను బయటకు వెళ్లకుండా, నాటి బాబు సర్కారు అడ్డుకుంది. దానితో ఆగ్రహించిన జగన్,విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు ధర్నా నిర్వహించారు. చివరకు పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు పంపేశారు. ఇప్పుడు చంద్రబాబును కూడా, విశాఖ జిల్లాలో జరిగే ప్రజాచైతన్య యాత్రకు వెళ్లకుండా.. ప్రత్యక్షంగా వైసీపీ కార్యకర్తలు, పరోక్షంగా పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని, బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. చెప్పులు, కోడిగుడ్లువేశారు. దానితో పోలీసులు, ఆయనను ‘కాపాడేందుకు’ సీఆర్‌పీసీ 151 కింద, ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్ విమానంలో వెనక్కి పంపించారు. మొత్తంగా ఇదీ.. గురువారం నాటి విశాఖ ఎయిర్‌పోర్ట్ లొల్లి.
ఈ వ్యవహారంలో చెప్పుకోవాల్సిందేమిటంటే..విశాఖకు వెళ్లాల్సిన బాబును పోలీసులు వెనక్కిపంపించారు. రెండేళ్ల క్రితం జగన్‌ను కూడా, బాబు సర్కారు ఇలాగే అదే విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి పంపింది. అప్పుడు జగన్ బృందం అక్కడ ధర్నా చేస్తే, ఇప్పుడు బాబు బృందం ధర్నా చేసింది. మిగిలినందా సేమ్ టు సేమ్. దీనితో జగన్ పగ,ప్రతీకారం, ఇగో చల్లారినట్టయింది. కాకపోతే ఆ వ్యవహారంలో జగన్‌కు వచ్చిన మైలేజీనే, ఇప్పుడు బాబుకూ కనిపిస్తోంది. గతంలో జగన్‌ను విశాఖకు అనుమతించి ఉంటే, నాలుగు మాటలు మాట్లాడి వెనక్కి వెళ్లేదానిని, తమ ప్రభుత్వమే అనవసర ప్రాధాన్యం ఇచ్చిందని అప్పట్లో టిడిపి నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ను అడ్డుకుని, వెనక్కి పంపడం ద్వారా.. ఆయనకు చంద్రబాబు నాయుడే పొలిటికల్ మైలేజీ, సానుభూతి సంపాదించి పెట్టారన్న విమర్శలు టిడిపిలోనే వినిపించాయి.

ఇప్పుడు అదే అసంతృప్తి… బాబు విషయంలో, వైసీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతుండటం విశేషం. బాబును యాత్రకు వెళ్లనిస్తే, రోజువారీ తమ ప్రభుత్వంపై చేసే విమర్శలు తప్ప, అందులో కొత్తదనం ఉండదంటున్నారు. దానిబదులు ఆయనను అడ్డుకోవడం వల్ల, ప్రభుత్వం అనవసరంగా అప్రతిష్టను కొని తెచ్చుకున్నట్టయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారం పోయినప్పటి నుంచీ టిడిపి శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించిందని, అయితే తమ ప్రభుత్వమే ఆ పార్టీకి అస్ర్తాలు అందిస్తోందన్న భావన, వైసీపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఈ సంఘటనతో తమ అధినేత అహం చల్లబడిందే తప్ప, తమకు రాజకీయంగా నయాపైసా ఉపయోగం లేదంటున్నారు.
పైగా,మంత్రులే బాబు పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చి, అప్రతిష్ఠ కొనితెచ్చుకున్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ శాంతిభద్రతల అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. తమ హయాంలో ఏ ఘటన జరిగినా, అది తమకే నష్టమన్న జాగ్రత్తతో అడుగులు వేస్తుంటుంది. అందుకే తమ కార్యకర్తలను సంయమనం పాటించాలని మంత్రులు పిలుపునిస్తుంటారు. కానీ జగన్ సర్కారు మాత్రం
అందుకు భిన్నంగావ్యవహరించి, మంత్రులతోనే విపక్ష నేత పర్యటనను అడ్డుకోమని చెప్పడమే, ఈ పరిణామాలకు దారితీసిందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, విశాఖ ఎపిసోడ్‌లో చంద్రబాబు విసిరిన వలలో జగన్ చిక్కుకున్నారన్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. తన పర్యటనను అడ్డుకోమని మంత్రులే పిలుపునివ్వడం, ఆ మేరకు జనసమీకరణ చేసి, సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేయడాన్ని బాబు గ్రహించారు. అందుకే కావాలనే పట్టుదలతో ఆయన విశాఖకు వెళ్లారు. పైగా తన పర్యటనకు, ఆయన ముందుగానే అనుమతి తీసుకున్నారు. తన పర్యటనను జగన్ ప్రతీకారానికి వేదికగా వాడుకుంటారని తెలిసే, బాబు విశాఖకు వెళ్లినట్లు కనిపిస్తోంది. పోలీసులు ఎయిర్‌పోర్టులోకి పోలీసులు వైసీపీ కార్యకర్తలను అనుమతించటంతో, అక్కడికి వారంతా పెద్ద సంఖ్యలో కోడిగుడ్లు, టమాటోలతో వెళ్లగలిగారు.
తన యాత్రను వైసీపీ అడ్డుకోవడం ద్వారా.. ఇప్పటిదాకా తాను విశాఖలో కడప ముఠాలు, పులివెందుల గ్యాంగులు రెచ్చిపోతున్నాయంటూ.. ఇప్పటివరకూ బాబు చేస్తున్న ఆరోపణలను, వైసీపీ కార్యకర్తల తొందరపాటు నిజం చేసినట్టయింది. ఆ విధంగా తన ఆరోపణలకు బాబు ఒక ఆధారాన్ని చూపినట్టయింది. ప్రశాంతంగా ఉన్న విశాఖలో వైసీపీ గూండాలు భగ్నం చేస్తున్నారని, కబ్జాలకు దిగుతున్నారంటూ టిడిపి చాలాకాలం నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో పోలీసులు ఉన్నప్పటికీ, లెక్కచేయకుండా లోపలికి వెళ్లి తనను అడ్డుకున్న ఘటనను.. బాబు నేర్పుగా తన వాదనకు మద్దతుగా చూపడంలో విజయం సాధించారు.
అయితే.. బాబును వెనక్కిపంపించడం, అందుకు నిరసనగా టిడిపి నేతలు ధర్నా చేయడం, పోలీసులపై బాబు ఆగ్రహం రాజకీయ ఎత్తుగడలోభాగమే కావచ్చు. కానీ, అసలు అంతమంది జనాలను కోడిగుడ్లు, టమాటోలతో ఎయిర్‌పోర్టు వరకూ పోలీసులు ఎలా అనుమతించారన్న ప్రశ్న, మెడపై తల ఉన్న ఎవరికైనా రావడం సహజం. పైగా వారిని పోర్టికో, టెర్మినల్ పోర్టికో వరకూ అనుమతించటం మరోఆశ్చర్యం. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక విపక్ష నేతను, నాలుగు గంటల పాటు ఆందోళనకారులు చుట్టుముట్టినా, 300 మంది పోలీసులు చోద్యం చూడటం వింతలో వింత. ఒకవేళ ఆ సందర్భంలో జరగరాని ఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరన్నది ప్రశ్న. అసలు అత్యున్నత భద్రత, మావోయిస్టులతో ముప్పు ఉన్న మాజీ సీఎంను ఆందోళన కారులు చుట్టుముడితే, వారిని పోలీసులు చెల్లాచెదురు చేయాల్సి ఉంది. ఇది బాబు కయినా, జగన్‌కయినా, మరెవరికైనా వర్తిస్తుంది. కానీ, పోలీసులు.. ఆందోళన కారులనుంచి అడ్డంకులు ఎదుర్కొన్న, చంద్రబాబునే వెనక్కి పంపించడమే విస్మయకరం.
ప్రజలే బాబును అడ్డుకున్నారని, మంత్రులంతా ఒకే మంత్రం పఠించడం వరకూ బాగానే ఉంది. మరి ప్రజలు అడ్డుకుంటుంటే భద్రత ఇవ్వాల్సిన పోలీసులు, ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ఇటీవల తనను అడ్డుకున్నారంటూ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై, పోలీసులు వాయువేగంతో స్పందించారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరి జడ్ ప్లస్‌భద్రతలో ఉన్న విపక్ష నేతను అడ్డుకున్న వారిపై కూడా, అంతే వాయువేగంతో స్పందించి, కేసులెందుకు పెట్టలేదన్న ప్రశ్నకు పోలీసు బాసుల వద్ద జవాబు లేదు. బాబు పర్యటనకు ముందే మంత్రులు, ఆయన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చి, అడ్డంగా దొరికిపోవడం ఈ ఎపిసోడ్‌లో మరో విశేషం.
మంత్రులు చెప్పినట్లు..బాబును విశాఖ ప్రజలే అడ్డగించి ఉండవచ్చు. ఇదే లాజిక్ ప్రకారం.. రేపు ఒకవేళ జగన్ గానీ, మంత్రులు గానీ, టిడిపి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తే, అప్పుడు కూడా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా అన్నది ప్రశ్న. అప్పుడు కూడా గతంలో డిజిపి ప్రకటించినట్లు, నిరసన ప్రకటించడం తప్పు కాదని చెబుతారా? లేక ఆ నియోజకవర్గ ప్రజలే వారిపై తిరగబడ్డారని చెబితే, వారిని వదిలేస్తారా? అన్న ప్రశ్నలకు పోలీసులు ఏం జవాబు చెబుతారు?
దీనిపై కోర్టు వేసిన ప్రశ్నలు, ఆగ్రహం చూస్తే పోలీసులు భారీ మూల్యమే చెల్లించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘‘అధికార పక్షానికి, ప్రతిపక్షానికి వేర్వేరు రూల్స్ ఉంటాయా? బాబు పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చి, 151 కింద ఎందుకు నోటీసులిచ్చారు? అయినా.. ఒకవ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతడిని అదుపు చేయడానికి సెక్షన్ 151ను ఉపయోగించాలి. నోటీసు ఇచ్చిన ప్రకారం చూస్తే, ఈ ే సు వ్యవహారం అలా లేదు. ముందస్తు అరెస్టు చేయాల్సింది రాళ్లు, గుడ్లు వేయడానికి వచ్చిన వారిని కదా? ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎయిర్‌పోర్టు వరకూ రాకుండా వారిని ఎందుకు నిలువరించలేకపోయారు’’? అని హైకోర్టు, పోలీసులపై సీరియస్ అయింది. బాబును అడ్డుకోవాలంటూ మంత్రులు చేసిన ప్రకటనలు, ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆందోళనకారుల సిసి టివి పుటేజీలు ఈ కేసులో కీలకం కానున్నాయి. మొత్తంగా విశాఖ వ్యవహారంతో పోలీసు శాఖ అప్రతిష్టపాలయినట్లే కనిపిస్తోంది. కనీసం వైసీపీ నేతలను ముందస్తు గృహనిర్బంధం చేసినా, పోలీసుల వాదనకు కొద్దిగానయినా బలం చేకూరేది.