ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర?

594

జగన్ నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బ
30 ఏళ్లు ఉండాలంటే పాలన ఇలాగేనా?
వైఎస్‌కు భిన్నంగా జగన్ పాలన
నియామకాల్లో బాబు దారిలోనే జగన్
సొంత గూటిలోనే అసంతృప్తి
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా,30 ఏళ్లు సీఎంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్న ఏపీ సీఎం, వైసీపీ దళపతి జగన్ కోరికకు…ఆయన అనుసరిస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన కనిపించడంలేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఏడేళ్ల కఠోర శ్రమ,పట్టుదల,అవమానాలు ఎదుర్కొని సాధించిన అనిర్వచనీయమైన విజయాన్ని, పదిలం చేసుకునే పాలనా పద్ధతులేవీ కనిపించడం లేదన్న వ్యాఖ్యలు, సీనియర్లనుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాలనాశైలి మహానేత వైఎస్‌కు ఎక్కడా పోలిక కనిపించకపోగా, అందుకు భిన్నంగా సాగుతోందన్న అసంతృప్తి, వైఎస్ అనుచరుల్లోనూ వ్యక్తమవుతోంది.ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న తొందరపాటు, అనుభవరాహిత్య విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినాల్సివస్తోందన్న ఆవేదన వైసీపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ అనేక నిర్ణయాలు కోర్టులో ఎదురుదెబ్బలకు గురవడంతో, పానలపై ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమవుతోందంటున్నారు. ఎవరితో సంప్రదించకపోవడం, ఎవరినీ విశ్వసించకపోవడం, సమిష్టి నిర్ణయాలపై నమ్మకం లేకపోవడ ం, సమర్ధులైన బృందం లేకపోవడంతో, తమ ప్రభుత్వం తక్కువ కాలంలోనే అభాసుపాలవుతోందన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. పాలన అంటే కేవలం ప్రచారం కాదని, ప్రజల పనులు కావడమే ప్రధానమని జగన్ నమ్మటంలో తప్పులేదంటున్నారు. విపక్షాన్ని సమర్ధించే మీడియాను మెప్పించాల్సిన అవసరం, పనిలేదు. వారి మెప్పు కోసమే పనిచేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ, ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న జగనన్న అభ్యర్ధన మన్నించి, ఓట్లువేసిన వారి నమ్మకం నిలబెట్టాల్సినబాధ్యత ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈతొమ్మిది నెలల పాలనలో కేవలం కమ్మ కులాన్ని, మరికొంత కాపు కులాన్ని అణచివేసే కార్యక్రమాలే లక్ష్యంగా చేసుకుని పాలన సాగుతోంది తప్ప, రాష్ట్రంలో పరిపాలన లేదన్న భావన మెజారిటీ ప్రజల్లో నాటుకుపోయిందంటున్నారు. రాష్ట్రంలోకమ్మ వారి శాతం అత్యల్పమని గుర్తు చేస్తున్నారు. టిడిపికి ఆర్ధికంగా దన్నుగా ఉంటారన్న అనుమానం,గత ఎన్నికల్లో తన ఓటమికి వారే కారణమన్న కసితో, ఆ కులంవారిని అణచివేయానికే.. ఉన్న సమయాన్ని వృధా చేసుకోవడం తెలివైన పనికాదంటున్నారు. ఆమాటకొస్తే.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ వర్గం, తమ పార్టీకీ పట్టంకట్టిన విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి అమరావతి నుంచి రాజధాని మార్పు, ఐఏఎస్-ఐపిఎస్ అధికారులకు పోస్టింగులివ్వకపోగా, సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలతో జగన్ తన అమూల్యమైన సమయం వృధా చేసుకుంటున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
దాదాపు 34 కార్యక్రమాలను రద్దు చేయడమంటే, ఆయా పథకాల లబ్ధిదారులకు దూరం కావడమేనని స్పష్టం చేస్తున్నారు. రేషన్ కార్డుల ఏరివేత మంచి కార్యక్రమమేనని, భూస్వాములు కూడా తెల్ల కార్డులతో పథకాలు అనుభవిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే పెన్షన్లు రద్దు చేయడం ద్వారా, లక్షలమంది లబ్ధిదారులకు దూరం కావడమేనని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కొత్త పథకాలు ప్రకటించ పోయినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా జనం పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్నేళ్ల నుంచి అనుభవిస్తోన్న పథకాలు తొలగిస్తే, ఆ వ్యతిరేకతకు భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. పైగా మహానేత వైఎస్ ఇచ్చిన పెన్షన్లు, తెల్లకార్డులను తొలగించడం లేని వ్యతిరేకతను మూటకట్టుకోవడమేనని స్పష్టం చేస్తున్నారు.
ఒక పార్టీకి ఐదేళ్ల అధికారమంటే తక్కువ సమయమే. అలాంటిది, 2022 న వంబర్ నుంచి దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయన్న వార్తలు వెలువతున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఉన్న సమయాన్ని ప్రతిపక్షాన్ని అణిచివేయడం, పాత ప్రభుత్వ ముద్రను తొలగించడం, పాత పథకాలు రద్దు చేయడం, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా కక్ష సాధించడం వంటి చర్యలతో,తమ అధినేత అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నారని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని ప్రచారం చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయంటున్నారు.
ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా, పాలకులకు అనుగుణంగా పనిచేసే అధికారులను వేధించం సరైంది కాదంటున్నారు. ఈ విషయంలో జగన్, తన తండ్రి వైఎస్ తీరుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ సీఎం అయిన తర్వాత, టిడిపిని రాజకీయ ప్రత్యర్ధిగానే చూశారు తప్ప, శత్రువుగా చూడలేదంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్-బాబు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినప్పటికీ, సర్దుబాట్లు, సామరస్యం ఉండేదని గుర్తు చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చే వినతిపత్రాలకు వైఎస్ స్పందించేవారు. సీఎంఆర్‌ఎఫ్ వినియోగంలో నాటి టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముందుండేవారు. కానీ ఇప్పుడు పాలన అందుకు భిన్నంగా సాగుతోందని చెబుతున్నారు. టిడిపి హయాంలో పనిచేసిన వారిని వైఎస్ ఎప్పుడూ సస్పెండ్ చేయలేదని, బాబు అమలుచేసిన కార్యక్రమాలను కొనసాగించారంటున్నారు. అలాగే వైఎస్ కార్యక్రమాలను బాబు కొనసాగించారని, ఆయన వద్ద పనిచేసిన అధికారులను ఏనాడూ సస్పెండ్ చేయలేదని చెబుతున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేరు మార్చారు తప్ప, ఆ పథకాన్ని రద్దు చేయలేదు.
కమ్మ వర్గానికి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబు, చంద్రబాబు హయాంలో ఎంత వెలిగారో, వైఎస్ జమానాలో అంతకంటే ఎక్కువ హవా చెలాయించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే కృష్ణబాబుకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తనకు కావలసిన రెడ్డి వర్గ అధికారులను నియమించినప్పటికీ, ఇతర కులాల వారిని అణచివేసే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదని చెబుతున్నారు. కెవిపి వంటి అనుభవజ్ఞులైన సలహాదారులు లేకపోవటం తమకు కచ్చితంగా లోటేనని అంగీకరిస్తున్నారు. వైఎస్ సీనియర్ మంత్రుల సలహాలు తీసుకునేవారు. కానీ జగన్ ఎవరితో మాట్లాడరని, అభిప్రాయాలు పంచుకోకపోతే మంచి ఫలితాలు ఎలా వస్తాయని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పాలనలో వైఎస్‌ను జగన్ ఆదర్శంగా తీసుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
జాస్తి కృష్ణకిశోర్, ఏబీ వెంకటేశ్వరరావు వంటి అధికారుల విషయంలో జగన్ ప్రభుత్వం అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం మంచిదికాదంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఏవిధంగా అయితే, సీఎం ఆదేశాల మేరకు పనిచేస్తున్నారో, అప్పుడు ఏబి, జాస్తి కూడా అదే పనిచేశారంటున్నారు. ఆ ప్రకారంగా నేడు ప్రవీణ్ ప్రకాష్ చేస్తున్నది ఒప్పయితే, నాడు వారిద్దరు చేసింది కూడా ఒప్పే అవుతుంది తప్ప, తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రవీణ్ ప్రకాష్‌కు, గత బాబు ప్రభుత్వం మంచి పోస్టింగులే ఇచ్చింది. ఇప్పుడు డిజిపిగా ఉన్న గౌతంసవాంగ్, ద్వారకా తిరుమలరావు వంటి అధికారులంతా, గతంలో బాబు సర్కారులో కీలక బాధ్యతలు నిర్వహించిన వారేనని గుర్తు చేస్తున్నారు. వారిద్దరికీ సమర్థత,సీనియారిటీ ప్రాతిపదిక తప్ప, విధేయత ప్రాతిపదికన పోస్టింగులు ఇవ్వలేదని, ఒకవేళ అదే నిజమైతే సవాంగ్‌కు డీజీపీ పదవి అప్పుడే రావలసిందని విశ్లేషిస్తున్నారు.
పైగా ఇంటెలిజన్స్ దళపతి సీటులో ఎవరున్నా నిందలు తప్పవు. గతంలో శివశంకర్, అరవిందరావు, మహేందర్‌రెడ్డి వంటి సీనియర్లు చేసిన పనినే ఏబీ వెంకటేశ్వరరావు చేశారని, కాకపోతే కొంత ఎక్కువ చేసి ఉండవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ హోదాలో ఉన్న ఏ అధికారయినా ప్రభుత్వ పనులతోపాటు,పార్టీ పనులూ చేయాల్సి ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అంతమాత్రాన వారిని కొత్త ప్రభుత్వాలు సస్పెండ్ చేయడం మంచిది కాదంటున్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన వారిని బాబు గానీ, బాబు హయాంలో పనిచేసిన అధికారులను వైఎస్ గానీ ఏనాడూ అవమానించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని,బాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు.కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జోలికి వెళ్లలేదు. వైఎస్ హయాంలో విచారణలు జరిపించినా, అవి కొన్ని అంశాలకే పరిమితమయ్యేవి.
వైఎస్ హయాంలో నిఘా దళపతిగా పనిచేసిన అరవిందరావును, తర్వాత వచ్చిన కాంగ్రెస్ సీఎం డీజీపీని చేశారు. కాంగ్రెస్ హయాంలో నిఘా దళపతిగా పనిచేసిన మహేందర్‌రెడ్డిని తర్వాత వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఏకంగా డీజీపీ పదవినే ఇచ్చింది. మహేందర్‌రెడ్డి గత ప్రభుత్వంలో పనిచేసినందున, ఇప్పటి జగన్ సిద్ధాంతం ప్రకారం ఆయనకు డీజీపీ ఇవ్వకూడదు. కానీ, కేసీఆర్ కేవలం ఆయన సమర్థతను చూసే డీజీపీ పదవి ఇచ్చారు. బాబు హయాంలో నిఘా దళపతిగా చేసిన శివశంకర్‌కు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎస్‌పిఎఫ్ డిజి పదవి ఇచ్చింది. ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన నిఘా దళపతులకు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పోస్టింగులే ఇచ్చి గౌరవించిన విషయాన్ని వైసీపీ లోని వైఎస్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. కానీ, జగన్ పాలనా పద్ధతులు తండ్రికి భిన్నంగా ఉన్నాయంటున్నారు.
నియామకాల్లో జగన్ వ్యవహారశైలి చంద్రబాబు తరహాలోనే సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.చంద్రబాబు కూడా సమర్థత కాకుండా కులప్రాతిదికనే నియామకాలు చేశారని, ఇప్పుడు జగన్ కూడా అదే విధానం అమలు చేస్తున్నారని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ, వారికి ఇచ్చే పదవులు అందుకు వారు అర్హులా?కారా?అన్నది పరిగణించడం లేదు. బాబు కమ్మ వర్గానికి ఎక్కువ పట్టం కట్టారు.అయితే ఆ వర్గంలో సమర్ధులను కాకుండా, ఏమాత్రం అర్హత లేని వారిని నియమించారు.ఇప్పుడు జగన్ కూ ఆ రెడ్లను అందలం ఎక్కిస్తున్నారు. అయితే అందులో అనర్హులే ఎక్కువగా ఉన్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.న్యాయ,శాసనపరమైన పదవులు కేవలం అర్హులు, అనుభవజ్ఞులకే ఇవ్వాల్సి ఉంది. కానీ తమ అధినేత నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు. మీడియాను సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు జర్నలిస్టు ప్రముఖులకు పదవులిచ్చారు.కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్‌ను మీడియా ముద్దాయిగా నిలబెడుతుంటే, లక్షల రూపాయలు తీసుకుని పనిచేస్తున్న సదరు జర్నలిస్టు ప్రముఖులు, ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా, తమ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు… కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతుంటే, పదవులు తీసుకున్న వారేం చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న క్లిష్ట పరిస్థితిలో,దాని నుంచి బయటపెట్టడంపై దృష్టి సారిస్తే మంచిదని సీనియర్లు సూచిస్తున్నారు. ఎవరో విమర్శిస్తారని భయపడకుండా, కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే నిధులు వస్తాయంటున్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బిజెపికి బాహాటంగా మద్దతు ప్రకటించినా వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు పాత పనులకు సంబంధించి వేల కోట్లరూపాయలు చెల్లించాల్సి ఉంది. మార్చి తర్వాత ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టంగానే ఉంది. ఇప్పటికే జగన్ నిర్ణయాలపై, జాతీయ స్థాయి మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. మరి సలహాదారుల పదవులు తీసుకున్న మాజీ జర్నలిస్టులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. చివరకు తన మిత్రుడి కుమారున్న ప్రేమ ప్రదర్శించే, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి నేతలు కూడా, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు. దానిని మార్చుకోవలసిన అవసరం ఉందని వైసీపీ సీనియర్లు సూచిస్తున్నారు.

3 COMMENTS

  1. […] మరికొద్దిరోజుల్లో ఏడాది పాలన పూర్తి చేసుకుని, విజయోత్సవాలు చేసుకోనున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు.. ఏపీ హైకోర్టు ఒకేరోజు మూడు అంశాలపై ఇచ్చిన వ్యతిరేక తీర్పులు బహుమానంగా భావించాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే దాదాపు 60 సందర్భాల్లో జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులిచ్చింది. కొన్ని కీలకమైన కేసుల్లో జగన్ సర్కారు, హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లినా.. అక్కడ కూడా హైకోర్టు తీర్పునే ఖరారు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసిన సందర్భాలున్నాయి. ఇదికూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర? […]

  2. […] నిజానికి ఎల్జీపాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం చేయాల్సిన పని, ఇవ్వాల్సిన ఆదేశాలను కోర్టు ఇచ్చింది. ఇది ఒకరకంగా పాలకులకు నగుబాటు వ్యవహారమే. కంపెనీని అప్పుడే సీజ్ చేసి, పోలీసులు వారి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, రసాయనాల తరలింపునకు సంబంధించి అన్ని రికార్డులు చూసి, తరలించి ఉంటే హైకోర్టు అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. జగన్ సర్కారు ఆ పనిచేయకపోగా, యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినందున, అనేక అనుమానాలకు ప్రభుత్వ చర్యలే అవకాశం ఇచ్చాయి. హైకోర్టు తీర్పు దానిని సరిచేసింది. దీనిని హర్షించాల్సిందే.ఇదికూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర? […]

  3. […] నిజానికి ఎల్జీపాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం చేయాల్సిన పని, ఇవ్వాల్సిన ఆదేశాలను కోర్టు ఇచ్చింది. ఇది ఒకరకంగా పాలకులకు నగుబాటు వ్యవహారమే. కంపెనీని అప్పుడే సీజ్ చేసి, పోలీసులు వారి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, రసాయనాల తరలింపునకు సంబంధించి అన్ని రికార్డులు చూసి, తరలించి ఉంటే హైకోర్టు అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. జగన్ సర్కారు ఆ పనిచేయకపోగా, యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినందున, అనేక అనుమానాలకు ప్రభుత్వ చర్యలే అవకాశం ఇచ్చాయి. హైకోర్టు తీర్పు దానిని సరిచేసింది. దీనిని హర్షించాల్సిందే.ఇదికూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర? […]