విద్యార్థులకు 25వేల కోట్ల వరకు జగన్ ఎగ్గొట్టాడు.

404

· 9నెలల్లో అన్ని వర్గాలను మోసగించినట్లుగానే, ముఖ్యమంత్రి విద్యార్థులను కూడా దగా చేశాడు.

· జగనన్న వసతి దీవెన, ఫీజురీయింబర్స్ మెంట్, అమ్మ ఒడి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఏటా రూ.35వేల కోట్లవరకు చెల్లించాల్సి ఉండగా, జగన్ కేవలం రూ.12,500 కోట్లే చెల్లిస్తున్నాడు.

· రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదలచేయాలి.

· జగన్ రోజుకో మోసం చేస్తున్నాడు కాబట్టే, టీడీపీ ప్రజాచైతన్య యాత్ర ద్వారా ఆమోసాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది

· విద్యార్థులకు న్యాయం చేయకుంటే, వారితో కలిసి టీడీపీ ఉద్యమిస్తుంది.

· జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే 30 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి.

· 12 రకాల స్కాలర్ షిప్పులను జగన్ సర్కారు నిలిపేసింది.

· శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (టీడీపీ నేత)

జగన్మోహన్ రెడ్డి బాధితుల జాబితాలో తాజాగా విద్యార్థులు కూడా చేరారని, రుణమాఫీ పేరుతో రైతుల్ని, అమ్మఒడి పేరుతో తల్లులను, వాహనమిత్ర పేరుతో డ్రైవర్లను మోసగించిన జగన్, తాజాగా తన మోసపు వలను విద్యార్థులకపైకి విసిరాడని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పేదవారి చదువులకయ్యే ఖర్చు మొత్తాన్ని తన ప్రభుత్వమే భరిస్తుందని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, అదనంగా ఏటా రూ.20వేల వరకు మెస్ ఛార్జీలు చెల్లిస్తానని, సరాసరిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుస్తానని మేనిఫెస్టోలో చెప్పిన జగన్, ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కాడన్నారు. మేనిఫెస్టో తనకు భగవద్గీత, భైబిల్, ఖురాన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి, అందులో చెప్పిన హామీనే గాలికొదిలేశాడన్నారు. జగన్ సర్కారు గోరంత సాయం చేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటోందన్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ.6,400కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.2,300కోట్లు, విద్యా దీవెన పథకం కింద రూ.3,700కోట్లు, మొత్తం కలిపి రూ. 12,400కోట్లు ప్రతిఏటా విద్యార్థులకు ఖర్చు చేస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటనలు గుప్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం (ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్-2019 నివేదిక) రాష్ట్రంలో 17లక్షల 60వేల830 మంది విద్యార్థులున్నారని, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గానికి చెందినవారు దాదాపు 12లక్షల మంది వరకు ఉంటారన్నారు. వారందరికీ తరతమ బేధాలు లేకుండా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం న్యాయం చేయాల్సిన జగన్, వసతి దీవెన పథకం కింద, ప్రతిఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15వేలు, డిగ్రీ ఆపై చదువులు చదివేవారికి రూ.20వేలు చెల్లిస్తానని చెబుతున్నాడన్నారు. సరాసరిన ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున లెక్కేసినా, 12 లక్షల మంది విద్యార్థులకు ఏటా రూ.18వేల కోట్లను ఒక్క జగనన్న వసతి దీవెన పథకం కిందే చెల్లించాల్సి ఉంటుందని పట్టాభి పేర్కొన్నారు. దానితోపాటు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4వేల కోట్ల వరకు ఉన్నాయని, అమ్మఒడి పథకం కింద 80 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున చెల్లిస్తే, దానికి రూ.12వేల కోట్ల వరకుఖర్చవుతుందన్నారు. 18+12+4వేల కోట్లు కలిపితే, మొత్తం రూ.34వేల కోట్లతోపాటు, స్కాలర్ షిప్పుల బకాయిలు కూడా కలిపితే మరో వెయ్యికోట్లవుతాయన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కలిపి రూ.35వేలకోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, జగన్ సర్కారు కేవలం రూ.12,400కోట్లనే చెలిస్తోందన్నారు. తద్వారా విద్యార్థులకు రూ.25వేలకోట్ల వరకు జగన్ కోత పెట్టాడని పట్టాభి వివరించాడు. రైతులకు రూ.12,500 ఇస్తాననిచెప్పి, దాన్ని రూ.6వేలకు పరిమితం చేసినట్లుగానే, విద్యార్థులను కూడా రూ.25వేల కోట్ల వరకు జగన్ మోసగించాడన్నారు. ఈ విధంగా విద్యార్థులను దగా చేసిన వైనాన్ని ప్రజలు, విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏటా చెల్లించే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను జగన్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. గతంలో ఉన్న పథకాలకు కొత్త ముసుగులు వేస్తున్న జగన్, గత ప్రభుత్వం చేసినదాని కంటే, ఇచ్చినవాటికంటే తక్కువగానే చెల్లింపులు చేస్తున్నాడన్నారు. గత ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి మెస్, కాస్మొటిక్ ఛార్జీల కింద కలిపి రూ.19వేల వరకు చెల్లించిందన్నారు. కొత్తగా తాను చెప్పింది చేయకపోగా, గత ప్రభుత్వం విద్యార్థులకు అమలు చేసిన పథకాలను ఆపేయడం ద్వారా జగన్ సర్కారు విద్యావ్యవస్థనే కుప్పకూల్చిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఆపేయడం వల్ల, రాష్ట్రంలో 2,200వరకు కాలేజీలుంటే, సగానికి పైగా మూతపడే దశకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రంలో 218 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, వాటిలో 30కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయని, మరో 70 కాలేజీలు మూతపడే దశకు చేరుకున్నాయన్నారు. జగన్ ఘనకార్యాల వల్ల కాలేజీలు మూతపడుతున్నాయని, చాలా కాలేజీలు 7, 8 నెలలుగా అధ్యాపకులకు జీతాలు కూడా చెల్లించడంలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నేరుగా కాలేజీ యాజమాన్యాలకు మెస్ ఛార్జీలు చెల్లిస్తే, జగన్ వచ్చాక ఆ చెల్లింపులు ఆపేశాడన్నారు.

గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన 12 రకాల స్కాలర్ షిప్పులను కూడా జగన్ రద్దు చేశాడన్నారు. గతంలో విదేశాల్లో చదివేవారికి రూ.10లక్షలవరకు చంద్రబాబు చెల్లించాడని, జగన్ రాగానే దాన్ని ఆపేశాడన్నారు. మెస్ ఛార్జీలు, స్కాలర్ షిప్పులు, ఫీజురీ యింబర్స్ మెంట్ బకాయిలు ఆపేసిన జగన్, ఆఖరికి విద్యార్థి చదువుకయ్యే మొత్తం ఖర్చు భరిస్తానని చెప్పి, దానికి కూడా పంగనామాలు పెటాడన్నారు. విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో ప్రారంభం కానుందని, కానీ ఇంతవరకు ఫీజు స్ర్టక్చ్ ర్ వివరాలను ప్రభుత్వం ఖరారు చేయలేదన్నారు. ఇలా ఒక పక్క విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన జగన్, తానే దాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా చెప్పడం దుర్మార్గమని పట్టాభి మండిపడ్డారు.

మరోవైపు నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా ఆపేశారని, విద్యపూర్తయ్యాక కూడా విద్యార్థులు రోడ్లపై తిరిగే దుస్థితికి జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడని టీడీపీనేత మండిపడ్డారు.

రూ.20వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చెప్పండి…

జూన్ నుంచి ఇప్పటివరకు రూ.20వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న జగన్ సర్కారు, అవి ఎప్పుడు వచ్చాయో, ఎక్కడ పెట్టుబడులు పెట్టారో చెబితే ప్రజలంతా సంతోషిస్తారని పట్టాభి ఎద్దేవాచేశారు. 8 మెగాయూనిట్లు రూ.8వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చాయని, దాదాపు 6572 ఎంఎస్ఎంయూలు ప్రారంభమైనట్లు, రూ. 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబతున్న జగన్ సర్కారు, ఆ జాబితాను బయటపెట్టి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో చెబితే, ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. ఉన్న పరిశ్రమలను తన్ని తరిమేస్తున్న జగన్, విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోగా, వారికి చివరకు ఉద్యోగాలు కూడా లేకుండా చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేశాడన్నారు.