పిండాలకూ.. తప్పని ‘పన్ను’పోటు!

721

ఏపీలో ఇదో నయా ఔరంగజేబు వైచిత్రి
(మార్తి సుబ్రహ్మణ్యం)
అప్పుడెప్పుడో.. కొన్ని వందల సంవత్సరాల క్రితం.. ఒక చక్రవర్తి ప్రజలు జుట్టు పెంచిన వారిపై పన్నులేశారు. ముస్లిమేతరులపై జిజియా పన్ను వేశారు. దాన్ని తొలగించాలని గళమెత్తినందుకు గజరాజులతో తొక్కించి, రాజమార్గాన్ని పునుగుల పోగును చేశారు. సంగీతాన్ని లోతుగా మట్టిలో పాతిపెట్టమని ఆదేశించారు. సొంత మతస్తులనే ఆదరించారు.  తులాభారం, నౌరోజీ ఉత్సవాలు తొలగించేశారు. మరో చక్రవర్తి..  రాజధానిగా ఉన్న ఢిల్లీని దౌలతాబాద్‌కు మార్చి, మళ్లీ అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. ప్రజల వద్ద ఉన్న బంగారు-వెండి నాణేలు కాదని, రాగి-ఇత్తడి  నాణేలు తయారు చేశారు. ప్రజల వద్ద ఉన్న బంగారు-వెండి నాణేలను ఖజానాకు పంపాలని ఆదేశించారు. అయితే ప్రజలు తెలివిగా.. కొద్ది నాణేలే ఖజానాకు పంపి, మిగిలినవి దాచుకున్నారు. తర్వాత రాగి-ఇత్తడి నాణేలను కరెన్సీగా ప్రవేశపెట్టారు. అది అందరి వద్దా విచ్చలవిడిగా దొరికేది. దానిపై ఉన్న లిపి-గుర్తులు  సులభంగా ఉండటంతో, అందరూ దానిని సొంతంగా ముద్రింకునేవారు. దానితో ఖజనా అంతా రాగి-ఇత్తడితో నిండిపోయింది. ఈ పరిణామాలతో  తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. అందుకు దాదాపు ఏడేళ్ల సమయం పట్టింది.  ఇవన్నీ ఔరంగజేబులు, మహ్మద్‌బీన్ తుగ్లక్‌ల  నాటి కాలంలో!
అప్పటి వారెవరూ ఇప్పుడు లేరు. ఆ గాధలు యూట్యూబ్‌లో చెప్పే నాటి చరిత్రకారులూ లేరు. కానీ చరిత్రలో వారి చిత్ర, విచిత్ర కథలు వినడమే తప్ప చూసినవారెవరూ లేరు. అంటే ఆ రాజుల సలహాదారులు అంత గొప్పవారన్నమాట. నిజానికి రాజులకు రాజ్యం పట్ల, ప్రజల పట్ల ఆసక్తి కంటే, భోగాలు, యుద్ధాలపైనే మక్కువ ఎక్కువ. అందుకే పాలన అంతా వారి పేరుతో సలహాదారులు, రాజగురువులే లాగించేవారు.ఇదంతా కొన్ని వందలు, వేల ఏళ్ల క్రితం నాటి ముచ్చట.
ఇప్పుడూ వారి వాసనలు బతికే ఉన్న వారసులు మనకు దర్శనమిస్తున్నారు. ఇష్టం వచ్చిన వాటిపై పన్నులు వేసే అలనాటి ఔరంగజేబు పాలనా వారసులు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి. ఇదంతా ఏ దేశంలోనో అనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే! ఏ అరబ్ దేశాలలో అనుకుంటే మళ్లీ పప్పులో కాలేసినట్లే!! మన తెలుగునేల మీదనే ఈ చోద్యం చూడాల్సివస్తోంది. అక్షరాలా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ మతివిహీన నిర్ణయం అమలవుతోంది. అంటే.. ఔరంగజేబు మాదిరిగా జిజియా పన్ను కాదు. పిండప్రదానాల పన్ను! అవును. మీరు వింటున్నది నిజమే. మీరు చదువుతున్నదీ అక్షర సత్యమే!! ఇదెక్కడో కాదు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, మద్దూరు గ్రామ పంచాయతీలో అమలవుతున్న పిండ ప్రదాన పన్ను!!! అయితే.. అదంతా ఘాట్ అభివృద్ధికేనని పంచాయతీ అధికారులు సెలవిస్తున్నారు.
ఇక ఇలాంటి విచిత్ర, పైత్య విధానాలు అమలుచేస్తున్న మద్దూరు గ్రామానికి వెళదాం. మద్దూరు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ పుష్కర ఘాట్ వద్ద, కొన్నేళ్ల నుంచి దివంగతులైన తమ తలిదండ్రులకు పిండ ప్రదానాలు చేసే సంప్రదాయం కొనసాగుతోంది. అక్కడకు పురోహితులు కూడా, నిత్యం అందుబాటులో ఉంటారు. పిండప్రదానం చేసిన తర్వాత, వచ్చిన వారు పురోహితులకు దక్షణ సమర్పించుకుంటారు. ఇదంతా ఎక్కడైనా జరిగేదే. కానీ, ఈమధ్య, ఆ ఘాట్ వద్ద పిండప్రదానం చేయాలంటే, పన్ను కట్టాల్సిందేనని పంచాయితీ అధికారులు హుకుం జారీ చేసిన వైనం తెలిసి, జనం తెల్లమొఖమేశారు. ఆ హుకుం చేసిన నయా ఔరంగజేబు చర్యలను స్థానికులు నిలదీశారు. ఇదేం దిక్కుమాలిన నిర్ణయమని కడిగేశారు. ఇదేమి చోద్యం? మీకేం పోయేకాలమని చీవాట్లు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ ఘాట్‌లో టెంట్లు, మంచినీటి వసతి కోసమే పన్ను వసూలుచేస్తున్నామని విశాల దృక్పథంతో నయా ఔరంగజేబులు సెలవిచ్చారు. సరే.. వచ్చే వారి సౌకర్యం కోసమే ఇలాంటి పన్నులేసిన నయా ఔరంగజేబులు.. మరి  అదే పాలసీని క్రైస్తవులు, ముస్లిముల ఆచారాల్లోనూ అమలుచేయగలరా? అన్నది ఇప్పుడు హిందూ సంఘాలు వేస్తున్న ప్రశ్న. ఇప్పటి సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు పుష్కర స్నానం చేసి, పిండ ప్రదానం చేసినప్పుడు లేని ఈ పద్ధతులు ఇప్పుడేమిటని ప్రశ్నిస్తున్నారు.  హలో.. జగద్గురు  విశాఖ  స్వరూపానంద సరస్వతేంద్రుల వారూ.. మీకు అర్ధమవుతోందా?!

2 COMMENTS