ఏప్రిల్ 1 నుండి బిఎస్ 6 వాహనాలు అమ్మకాలు జరగాలి

692

పత్రికా ప్రకటన
డిటిసి కార్యాలయం విజయవాడ. తేదీ 20/02/2020

ఏప్రిల్ 1 నుండి బిఎస్ 6 వాహనాలు అమ్మకాలు జరగాలి – డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు

జిల్లాలోని వాహన డీలర్లు ఏప్రిల్ 1వ తారీఖు నుండి BS VI ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరపాలని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు.
స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయం నుండి మంగళవారంనాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రవాణాశాఖ నివేదిక సంఖ్య GSR/889(E) ప్రకారం ఏప్రిల్ 1, 2020 నుండి BS VI ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే వాహన డీలర్లు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరపాలని BS VI కాకుండా ఏ ఇతర వాహనాలను అమ్మకాలు గాని రిజిస్ట్రేషన్ గాని చేసే వీలుండదని డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. వాహన డీలర్ల వద్ద BS VI కి ముందు ప్రమాణాలు (BS III, IV, V) కలిగిన వాహనాలు ఉన్నట్లయితే మార్చి 31వరకు నిరీక్షించకుండ మార్చి 15 నాటికల్లా పూర్తిగా అమ్మకాలు, వాహన రిజిస్ట్రేషన్లు జరుపుకోవాలని ఆయన కోరారు. సాంకేతికపరమైన ఇబ్బందులు వాటిల్లినా కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవని ఆయన తెలిపారు. గతంలో BS III నుండి BS IV కు మారేటప్పుడు ఆ వాహనాల రిజిస్ట్రేషన్ విషయములో గడువును పెంచుతూ కొంచెం వెసులుబాటు కల్పించడం జరిగిందని, కానీ బిఎస్ VI అమలు లో ఎటువంటి వెసులుబాటు లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని మార్చి 31 చివరి రోజువరకు నిరీక్షించకుండ, ముందుగానే వాహనాల అమ్మకాలు జరుపుకోవాలని ఆయన అన్నారు. రవాణా వాహనాలు లారీలు ట్యాంకర్లు మొదలైన వాటి విషయంలో బాడీ బిల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అటువంటి పనులు కూడా మార్చి 31 లోపు పూర్తి చేసుకొని వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి పాత వాహనాలు రిజిస్ట్రేషన్లు జరగవని ఆయన అన్నారు. మార్చి 31 తర్వాత వాహన డీలర్ల వద్ద
BS VI కి ముందు ప్రమాణాలు కలిగిన వాహనాలు మిగిలి ఉన్నట్లయితే వాటిని మ్యానుఫ్యాక్చరర్స్ కు తిరిగి పంపించడం గాని, స్క్రాప్ గా అమ్మకం జరపడం గాని చేయాలని ఆయన అన్నారు. ఈ అంశాలపై డీలర్ల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులలో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వినియోగదారులకు నిర్ణీత కాలవ్యవధి లో వాహన రిజిస్ట్రేషన్ల సేవలు పూర్తి చేసేలా చూడాలని, వాహన సబ్ డీలర్లకు కూడా ఈ అంశాలపై తెలియజెప్పాలని డీలర్లను కోరారు. ఈ విధానంలో ఏదైనా ఇబ్బందులు వాటిల్లిన ఎడల సంబంధిత రవాణాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని డీలర్లను డిటిసి కోరారు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి వాహనములు కొనుగోలుచేసే వినియోగదారులు కూడా ఈ నిబంధనల ప్రకారం BS VI ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే కొనుగోలు చేసుకోవాలని డిటీసీ కోరారు