కేసీఆర్ అమరావతి నేతలను కలుస్తారా?

447

అమరావతి నగర శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్
మళ్లీ వేడి పుట్టించనున్న అమరావతి ఉద్యమ నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి ఉద్యమం మళ్లీ వేడి పుట్టించనుంది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ, ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తోన్న అమరావతి పరిరక్షణసమితి.. రెండో దశ ఉద్యమ ప్రణాళికను ప్రకటించింది. అందులో భాగంగా రేపు విజయవాడలో భారీ ర్యాలీ, ఆ తర్వాత 29న రౌండ్‌టేబుల్ సమావేశం, మార్చి తొలి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాలు ఉంటాయని పరిరక్షణ సమితి ప్రకటించింది.
అయితే, తాము త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్‌నూ కలుస్తామన్న నేతల ప్రకటనే చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వారిని కలవడం ఎంతవరకూ సాధ్యమన్నదే ఆ చర్చకు కారణం. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటివరకూ ఏ ఒక్క ఉద్యమ సంస్థకూ అపాయింట్‌మెంట్ ఇచ్చింది లేదు. స్వయంగా తెలంగాణ కోసం పోరాడి, ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కే, ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. తర్వాత ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోవలసి వచ్చింది. వివిధ సంఘాలు ఇప్పటికీ ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే, తమ జన్మ ధన్యమవుతుందన్న భావనతో ఉన్నాయి.నిజానికి కేసీఆర్..  మంత్రులు, ఎమ్మెల్యేలనే చాలా అరుదుగా కలుస్తున్నారు. పార్టీ-పాలనా వ్యవహారాల్లో అధిక శాతం ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దానితో వారంతా ఆయన వద్దకే వెళుతున్నారు. మరి ఇలాంటి ప్రత్యేక పరిస్థితిలో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, కేసీఆర్‌ను కలుస్తామని చెప్పడం సహజంగానే ఆసక్తి నెలకొంది.
ఏపీ సీఎం జగన్ ఇటీవల కేసీఆర్‌ను కలసిన సందర్భంలో.. మూడు రాజధానుల ఆలోచనను కేసీఆర్ ప్రశంసించినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మరో సందర్భంలో తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఏర్పాటుచేసినా ఒక్క వ్యతిరేకత కూడా రాలేదు. ఆంధ్రాలో మూడు రాజధానులపై గందరగోళం జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలూ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.ఈ నేపథ్యంలో రాజధానిని విశాఖకు మార్చాలన్న, ఏపీ సీఎం జగన్ మనోగతానికి విరుద్ధంగా పోరాడుతున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలకు, కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా అన్నది చర్చనీయాంశమయింది. ఒకవేళ ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే,  అమరావతి ఉద్యమంలో అది కీలక మలుపే అవుతుంది. ఎందుకంటే ఆ ఉద్యమం 29 గ్రామాలకే పరిమితమయిందని ఒకసారి, అది కుల ఉద్యమమని మరోసారి, పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్యమమని ఇంకోసారి విమర్శించిన వైసీపీ.. అమరావతి రైతు ఉద్యమాన్ని ఖాతరు చేయడం మానేసింది. పైగా ప్రజాప్రతినిధులను రైతులు అడ్డుకున్న సమయంలో, వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తోంది.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలను తెలంగాణ ఉద్యమకారులు ఇదేవిధంగా అడ్డుకున్నారు. వారికి పువ్వులతో పాటు వినతిపత్రాలు ఇచ్చి, తెలంగాణ కోసం పోరాడమని కోరేవారు. గాంధీగిరితో తమ డిమాండ్లు వినిపించారు. అయితే, అప్పుడు ఎవరిపైనా కేసులు నమోదు చేయటం గానీ, అరెస్టులు గానీ చేసిన దాఖలాలు లేవు.  ఇప్పుడు ఏపీలో అమరావతిని కాపాడుకునేందుకు, అక్కడి రైతులు కూడా దాదాపు అదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలను అడ్డుకుని వారికి వినతిపత్రాలు ఇస్తున్నారు. అయితే, వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న విభిన్న పరిస్ధితి నెలకొంది.
ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమ పరిరక్షణ సమితి నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే.. అమరావతి నగర శంకుస్థాపనకు,  ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు,  తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా.. తాను అమరావతి శంకుస్థాపన సభలో ఏదైనా ప్రకటిద్దామని భావించానని, అయితే ప్రధాని ఏమీ ప్రకటించకపోవడంతో,  తాను మౌనం వహించానని ఒక సందర్భంలో చెప్పారు. ఒకవేళ కేసీఆర్ వారిని కలిస్తే, ఏపీ రాజధాని ఉద్యమానికి తెలంగాణ సీఎం సంఘీభావం ప్రకటించారన్న సంకేతాలు వెళతాయి. అది రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా లాభించవచ్చు. హైదరాబాద్‌లో స్థిరపడిన సెటిలర్లు సహజంగానే కేసీఆర్ వైపు మొగ్గుచూపుతారు.  కానీ, రాజకీయంగా వైసీపీ ఇరకాటంలో పడాల్సి ఉంటుంది. అందుకే అమరావతి ఉద్యమ నేతలను కేసీఆర్ కలుస్తారో, లేదో చూడాలి!