బీజేపీ-టీఆర్‌ఎస్..శత్రుపక్షమా?మిత్రపక్షమా?

412

ట్రంప్‌తో లంచ్‌కు కేసీఆర్ ఒక్కరికే ఆహ్వానం
మిగిలిన సీఎంలంతా ఎన్డీఏ మిత్రులే
జగన్‌నూ కాదని కేసీఆర్‌కు ఆహ్వానంలో మతలబేమిటి?
బీజేపీలో సైద్ధాంతిక గందరగోళం
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక గ్రామంలో ఇద్దరు నేతల మధ్య వైరం ఉంది. ఇద్దరిలో పెద్దాయనది పెద్ద వర్గం. చిన్నాయనకూ కొంత వర్గం ఉంది. ఇంకో వర్గం ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య రచ్చబండ దగ్గర రోజూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పెద్దాయన హిందువులతోపాటు ముస్లిములనూ ఆదరిస్తారు. వారి కోసం ఏమైనా చేస్తారు. అలాగని ఆయన ముస్లిం పక్షపాతి కాదు. పదహారణాల దైవభక్తుడు. యజ్ఞాలు, యాగాలు చేస్తారు. గుళ్లకు వెళతారు. స్వాముల కాళ్లకు మొక్కుతారు. జాతకాలంటే చెవికోసుకుంటారు. చిన్నాయన వీటికి భిన్నం. ఆయనదంతా గుళ్లు, గోపురాలే. ఆ గ్రామంలో జనం కూడా వారిద్దరి మైండ్‌సెట్‌కు అనుగుణంగా చీలిపోయారు.ఓ రోజు పక్క ఊళ్లో ఉన్న చిన్నాయన గురువు గారి బాసు, కొందరు పెద్ద మనుషులకు విందు ఏర్పాటు చేశారు. దానికి పెద్దాయనకు ఆహ్వానం అందింది. ఇది ఆ గ్రామంలో ఇప్పుడు పెద్ద చర్చ. మనం రోజూ చిన్నాయన-పెద్దాయన కోసం కొట్టుకుంటు, తిట్టుకుంటుంటే.. అక్కడ చిన్నాయన గురువు తమకు తెలియకుండానే పెద్దాయనను విందుకు పిలవడం వారికి సుతరామూ మింగుడుపడలేదు. అదే విషయాన్ని చిన్నాయన ముందుంచారు. పాపం ఆయన కూడా తనకేమీ తెలియదని తెల్లమొఖం వేశారు.  మరిప్పుడు ఏం చేయాలి? చిన్నాయనతో ఉండాలా? రేపు మళ్లీ పెద్దాయన వర్గంతో కొట్లాటలు కొనసాగించాలా? వద్దా? ఇదీ.. వారి సందేహం. సంకటం!
ఇండియాకు వచ్చే అమెరికా అధిపతి ట్రంప్ విందు కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్న సందర్భంలో.. సరిగ్గా ఇలాంటి సందేహ, సంకట పరిస్థితే బీజేపీ-టీఆర్‌ఎస్ వర్గాల మధ్య నెలకొంది. ప్రధానంగా, రోజూ టీఆర్‌ఎస్‌పై ఒంటికాలితో లేచే, కమలదళాల పరిస్థితి కడు సంకటంగా మారింది. ట్రంప్‌తో విందుకు హాజరయ్యే సీఎంల జాబితాను,  రాష్ట్రపతి కార్యాలయమే రూపొందించింది. దానిని పేరుకు తయారుచేసింది రాష్ట్రపతి కార్యాలయమే అయినప్పటికీ, కర్త,కర్మ,క్రియ అంతా బీజేపీ వ్యూహకర్తలే. ఆవిధంగా దేశం మొత్తం మీద, కేవలం 8 మంది సీఎంలకు మాత్రమే ట్రంప్ విందుకు ఆహ్వానం అందితే, అందులో ఒకరు కేసీఆర్ కావడం విశేషం. మిగిలిన ఏడుగురు సీఎంలూ ఎన్డీఏ మిత్రపక్షాల గూటికి చెందిన వారే. వారిలో బీజేపీని వ్యతిరేకించేవారు ఒక్కరూ లేరు. చివరకు.. బీజేపీతో దోస్తానా కోసం పరితపిస్తున్న ఏపీ సీఎం జగన్ పేరు కూడా లేకపోవడం ఒక విశేషమయితే, రోజూ కమలంతో కయ్యానికి దిగే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉండటం మరో విశేషం.
నిజానికి ఆ జాబితాలో కేసీఆర్ బదులు, ఆయన శిష్యుడైన జగన్ పేరు ఉన్నట్టయితే ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. కానీ, విచిత్రంగా పేర్లు తారుమారై, శిష్యుడు బదులు గురువు పేరుండటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్‌తో విందుకు ఆహ్వానమంటే మామూలు విషయం కాదు. శ్వేతసౌధాధిపతితో ఒక్క సెకను మాట్లాడినా చాలనుకునే వారు ఈ భూప్రపంచం మీద కోట్లమంది పైనే ఉంటారు.ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఆయనతో ముచ్చట్లాడే అవకాశం అంటే అది మరీ క్రేజ్! పక్కా వ్యాపారి అయిన అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా..  అసలు లక్ష్యం మాత్రం తన దేశ వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి లాభ నష్టాల ప్రాతిపదికనే ఉంటాయి. అది ఒక కోణం. కానీ, అమెరికా ప్రెసిడెంట్‌తో భేటీ అంటే ఇండియా పొలిటీషియన్లు పోటీ పడతారు. ఆయనతో ఫొటో దిగడమంటే, ఎవరెస్టుపైకెక్కి జండా పాతినంత గొప్పగా ఫీలవుతారు. అలాంటి అదృష్టం మన ముఖ్యమంత్రి, తెలుగువాడైన కేసీఆర్‌కు దక్కడం నిజంగా గొప్పే! కేసీఆర్‌కు అలాంటి అరుదైన ఆహ్వానం, గౌరవం దక్కినందుకు గర్విద్దాం.
మరి తెలంగాణలో కమలదళాల సంగతేమిటి? ఇప్పటిదాకా ప్రతిరోజూ టీఆర్‌ఎస్, కేసీఆర్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్న కమలదళాలు.. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? ఒక వేళ ఏమైనా తిడితే, ‘మా గొప్పతనాన్ని మీ కేంద్రమే గుర్తించి, మా సారు కేసీఆర్‌ను ట్రంప్ విందుకు పిలిచారు. మీరేం మాట్లాడతారు? మీకు మా సారును, మా ప్రభుత్వాన్ని విమర్శించే సినిమా లేదని’ రేపు ఏ తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి ఫైర్‌బ్రాండ్లో సెటైర్లు వేస్తే పరువేం కావాలి? అసలిక్కడ రోజూ తాము కేసీఆర్‌పై యుద్ధం చేస్తుంటే, తమ పార్టీ నాయకత్వం ఆయననే విందుకు పిలిచి గౌరవిస్తే.. ఇక మేమేం కావాలి? పైన వాళ్లంతా విందు రాజకీయాల్లో మునిగితే, ఇక్కడ మేం వారి కోసం తన్నులు తినాలా? అసలిప్పుడు కేసీఆర్‌తో  యుద్దం చేయాలా? కాడి కిందపడేయాలా?.. ఇవీ తెలంగాణలో కమలదళాల సరికొత్త సందేహాలు.నిజమే. ట్రంప్ విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం అందిందన్న వార్త వెలువడిన తర్వాత, బీజేపీ శ్రేణులు ఇలాంటి భావనతోనే కనిపిస్తున్నారు. ఇటీవల భైంసాలో జరిగిన ఘటన కేంద్రంగా, కేసీఆర్ సర్కారుపై కమలం సమరం కొనసాగిస్తోంది. ఉత్తర తెలంగాణలో సంజయులిద్దరూ సమరం సాగిస్తున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు, కుటుంబపాలన, అవినీతిపై రాజీ పడేది లేదని కమలదళాలు కన్నెర్ర చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలయితే దాదాపు రోజూ యుద్ధక్షేత్రంలోనే ఉండి టీఆర్‌ఎస్‌తో పోరాడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు, బీజేపీనే ప్రత్యామ్నాయమన్న భావన కలిగించే పనిలో ఉన్నారు. ఈ సమయంలో ట్రంప్ విందుకు, కేసీఆర్‌కు ఆహ్వానం పంపిస్తే, కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని కమలదళాలు వాపోతున్నాయి.
ఒకవేళ ఈ విందు కార్యక్రమం రాజకీయంగా వ్యూహాత్మకమైనప్పటికీ, అది కేంద్రానికి తప్ప, రాష్ట్రంలో పార్టీకి ఏ మాత్రం అక్కరకు రాదంటున్నారు. దానివల్ల లాభం లేకపోగా, పోరాడే కార్యకర్తల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ‘‘దేశంలో ఇంతమంది బీజేపీయేతర సీఎంలు ఉంటే, ట్రంపుతో విందుకు  మేం రోజూ యుద్ధం చేసే కేసీఆరే దొరికారా? అంటే మా పార్టీ నాయకత్వం టీఆర్‌ఎస్‌ను రాజకీయ ప్రత్యర్ధిగా భావించడం లేదన్న సంకేతం, సాధారణ కార్యకర్తకూ తెలిసిపోతుంది కదా? మరి అలాంటప్పుడు ఇకపై ఇక్కడ మమ్మల్ని ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ నేతలు దీనిని అడ్డుపెట్టుకుని చేసే విమర్శలపై ఏం సమాధానం చెబుతాం? కేంద్రానికి రాజకీయపరమైన అవసరాలుండవచ్చు. దానికి మార్గాలు చాలా ఉన్నాయి. బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతున్న ఈ దశలో, కేసీఆర్‌ను ఆహ్వానించడం ఎంవతవరకూ తెలివైన నిర్ణయమో వారికే తెలియాలి. ఈ విషయంలో ఇక్కడ నేతల మనోభావాలు కూడా ఢిల్లీ వాళ్లు తెలుసుకున్నట్లు లేదు. అసలు మమ్మల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా వారికి లేకపోవడం దురదృష్టం. పగ్గాలు వాళ్లు పట్టుకుని ప్రత్యర్ధులపై యుద్ధం చేయమంటే కుదురుతుందా? ఇది కూడా అంతే’’నని తెలంగాణ సీనియర్ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
అటు ఈ పరిణామం టీఆర్‌ఎస్‌లోనూ కొంతమేరకు అసంతృప్తిగా ఉంది. తమను మైనారిటీలను దూరం చేసేందుకే, వ్యూహాత్మకంగా ఆహ్వానించారన్న అనుమానం టీఆర్‌ఎస్ నేతలకు లేకపోలేదు.అయితే.. ఆహ్వానించింది కేంద్రమే కాబట్టి (పేరుకు రాష్ట్రపతి భవన్ అయినప్పటికీ).. మా అధినేత కేసీఆర్ గొప్పతనాన్ని గుర్తించినందుకే ట్రంప్‌తో విందుకు పిలిచారని, ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. తెలంగాణలో అమలుచేస్తున్న వివిధ పాలనా సంస్కరణలు, పథకాలను గతంలో కేంద్రమంత్రులే ప్రశంసించారని గుర్తు చేసే వీలుంటుంది. అయితే.. ఈ రెండు పార్టీలపై విమర్శల దాడి చేసే అవకాశం మాత్రం కాంగ్రెస్‌కు దక్కనుంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్-బీజేపీలది రహస్య అజెండా అని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తోంది. పార్లమెంటులో ప్రవేశపెట్టే అన్ని బిల్లులనూ టీఆర్‌ఎస్ సమర్ధిస్తోంది.  రాష్ట్రంలో మాత్రం బీజేపీతో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ, మైనారిటీలను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతలు, ఇప్పటికే విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ విందుకు ఆహ్వానం వారికి మరో అస్త్రం కానుంది.

1 COMMENT

  1. […] తెలంగాణ రాష్ట్రంలో ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు ఒక్కటే మిగిలిన నేపథ్యంలో.. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నగర మాజీ అధ్యక్షుడు జి.ఆర్.కరుణాకర్ కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. పార్టీలో అగ్రనేతల ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు,దారి తప్పుతున్న సిద్ధాంతాలు, ఆర్గనైజేషన్‌లో తప్పులను ప్రశ్నించిన కరుణాకర్‌ను అగ్రనేతలు వ్యూహాత్మకంగా పక్కనపెట్టారు. అలాంటి ఫైర్‌బ్రాండ్ లేకపోవడంవల్లనే, కొద్దో గొప్పో బలంగా హైదరాబాద్‌లో కూడా, పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర కమిటీలో అలాంటి నేతలు ఉండటం వల్ల, గాడితప్పిన ఆర్గనైజేషన్ మళ్లీ పట్టాలకెక్కుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇది కూడా చదవండి… బీజేపీ-టీఆర్‌ఎస్..శత్రుపక్షమా?మిత్రప… […]