రాజధాని నగరంపై మళ్లీ టిడిపి గురి
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా పునరేకీకరణ యత్నాలు
అరవిందకుమార్ గౌడ్ కసరత్తు
పదవుల కోసం పెరుగుతున్న పోటీ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కోల్పోయిన పట్టును మళ్లీ నిలబెట్టుకునేందుకు తెలుగుదేశం నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలే లక్ష్యంగా, పార్టీని పునర్నిర్మించే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది. అందులో పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు పి.సాయిబాబాకు గ్రేటర్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనుంది. ఆ మేరకు వివిధ పార్టీలకు వలస వెళ్లగా, మిగిలిన నేతలతో జరిగిన అభిప్రాయసేకరణలో సాయిబాబా పేరు ఏకగ్రీవంగా రావడంతో, ఆయన అధ్యక్ష పదవి ఖరారయినట్టయింది. కాగా.. హైదరాబాద్‌పై మళ్లీ దృష్టి సారించి, పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేత, జాతీయ అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్‌కు అప్పగించింది.రాజధాని నగరంలో టిడిపికి నూతన జవసత్వాలు తీసుకువచ్చి, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో లక్ష్యం చేరువయ్యేందుకు,  ఆ పార్టీ సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆ మేరకు ఆయన ముందుగా నగర కమిటీ నిర్మాణంపై దృష్టి సారించారు. పార్టీలో పనిచేస్తున్న వారితోపాటు, వివిధ కారణాలతో మౌనంగా ఉన్న నేతలనూ గుర్తిస్తున్నారు. వివిధ పార్టీల్లో చేరినప్పటికీ, అక్కడ సంతృప్తిగా లేని నేతల వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలతో, నగర పార్టీ కార్యాలయంలో సమావేశాలు ప్రారంభించారు. నగరంలో పార్టీ పునర్నిర్మాణం, సీనియర్లకు ప్రాధాన్యం, ఎన్నికల నాటికి పార్టీ పురోగతి అంశాలపై చర్చిస్తున్నారు.
సమావేశాలకు హాజరయిన నేతలంతా సాయిబాబాకు అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. నిజానికి పార్టీ వ్యవస్థాపక కాలం నాటి నాయకుల్లో ఒకరైన సాయిబాబాకు ఆ పదవి తీసుకోవడం ఇష్టం లేదు.అయితే, నగరంలో పార్టీకి మిగిలిపోయిన నాయకులంతా.. సీనియర్ నాయకుడు, అందుబాటులో ఉండే సాయిబాబాకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. గత ఆరేడు నెలల నుంచి నగర కార్యాలయంలో కూర్చుని, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయిబాబాకే పార్టీ పగ్గాలు ఇవ్వడం మంచిదని స్పష్టం చేశారు. నిజానికి నాటి నుంచి నగర పార్టీ కార్యక్రమాలను సాయిబాబాతో పాటు రాజాచౌదరి,  సీనియర్ బీసీ నేత నల్లెల కిశోర్,  మహిళా నేత విజయశ్రీ, బాలరాజ్‌గౌడ్, బోస్,  ముప్పిడి మధుకర్, శ్రీపతి సతీష్ తదితర నేతలు సమన్వయం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, దానికి కావలసిన నిధులను వీరే సర్దుబాటు చేసుకుంటూ,  పార్టీని భుజాన వేసుకుంటున్నారు.
బాబును కలసిన వారికే గుర్తింపా?
కాగా, అసలు పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ పాల్గొనకుండా, చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ నేతకు, అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని నగర నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నగర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న  పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు కొందరు,  ఇప్పటికే నగరంలో పార్టీని భ్రష్ఠుపట్టించారని విరుచుకుపడుతున్నారు.  ప్రజలకు దూరమైన కొందరు నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూర్చుని, తమలాంటి జనంలో బలం లేని నేతలనే తమపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆరేడు నెలల నుంచి నగర పార్టీ కార్యాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు చుట్టూ చేరిన ఇద్దరు, ముగ్గురు నేతలు, ఆయనకు భజన చేయడానికే తప్ప.. నగరంలో పార్టీపై దృష్టి సారించటం లేద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘మేము చంద్రబాబు పార్టీ ఆఫీసుకు వచ్చినప్పుడు ఆయనను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే, ఈ నాయకులు ఆయనతో గంటలపాటు మాట్లాడుతుండటం వల్ల, మాకు ఆయనను కలిసి మాట్లాడే అవకాశం రావడం లేదు. సారేమో వాళ్లిద్దరితో మట్లాడండి అంటారు. కానీ వాళ్లకు సిటీపై అవగాహన లేదు. గత గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అసలు వాళ్లిద్దరికీ సిటీపై అవగాహ న ఉంటే, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంద’’ని నేతలు ప్రశ్నిస్తున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner