ఆ ఇద్దరు హీరోలపై రస్ అల్ ఖైమా గురి?

556

నోరు విప్పిన నిమ్మగడ్ట ప్రసాద్?
అందులో ఒకరు ఎంపీగా ప్రయత్నాలు?
ఇద్దరూ జగన్‌కు సన్నిహితులే
యుఏఈ కోర్టుల ఉత్తర్వుల అమలుకు ఇండియా సై
కొత్త మలుపు తిరగనున్న రస్ అల్ ఖైమా కేసు?
రెడ్‌కార్నర్ నోటీసు ఇస్తేనే తదుపరి చర్యలు
దానిని భారత్ అమలుచేయాల్సిందే
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు తెరపై వెలుగుతున్న ఇద్దరు అగ్ర తారలపై రస్ అల్ ఖైమా దేశం అధికారుల దృష్టి పడిందా? ప్రస్తుతం సెర్బియాలో పోలీసుల అదుపులో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఆ మేరకు వారిద్దరి పేర్లు వెల్లడించారా? తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని ఫెడరల్, లోకల్ కోర్టులు జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్ల ఉత్తర్వును భారత్ అంగీకరించిన నేపథ్యంలో,  త్వరలో ఊహించని మలుపులు ఈ కేసులో చోటుచేసుకోనున్నాయా?.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తెరలేచిన కొత్త చర్చ ఇది.
రస్ అల్ ఖైమా దేశానికి సంబంధించి, ఆ దేశపు కోర్టులు ఇచ్చే డిక్రీలను అమలుచేసేందుకు భారతదేశం అంగీకరించింది. అవి జారీ చేసే డిక్రీలు, తీర్పును ఇక్కడ కూడా అమలుచేయనుంది. పన్ను బకాయిలు, పెనాల్టీలు, డబ్బుల చెల్లింపుతో ముడిపడిన అంశాలు దీనిలో ఉంటాయి. ‘పరస్పర సహకార పూర్వక భాభూగం’గా ఆ దేశాన్ని భారత్ గుర్తించింది. అందులో భాగంగా యుఏఈ లోని అయిదు లోకల్ కోర్టులు, రెండు ఫెడరల్ కోర్టులను ఆ దేశపు ఉన్నత న్యాయస్థానాలుగా భారత్ గుర్తించింది. దానితో, అక్కడ జారీ చేసే తీర్పులను మన దేశంలోనూ అమలుచేయనుంది.  తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వు కూడా విడుదల చేసింది. ఆ ప్రకారంగా.. ఆ దేశం వద్ద ఉన్న నిందితుల వివరాలు, వారికి సంబంధించిన నేరాలు, దానికి సంబంధం ఉన్న వ్యక్తులను ఆ దేశానికి అప్పగించేందుకు భారత్ అంగీకరిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ వ్యవహారం ఏపీలో ఇప్పటికే పీకల్లోతు కష్టాలో కూరుకుపోయిన అధికార పార్టీ నేతలకు  మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టనుంది. ప్రధానంగా, ఆర్ధిక నేరాల కేసులో ఇప్పటికే సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. రస్ అల్ ఖై మా సొమ్మును, తాను ఎవరికి ఇచ్చానన్న వివరాలను అక్కడి పోలీసులకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా.. తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తున్న ఇద్దరు అగ్ర హీరోల పేర్లు కూడా బయటపెట్టినట్లు,  తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. నిమ్మగడ్డకు వారిద్దరితో  అత్యంత సన్నిహిత సంబంధాలతోపాటు.. ‘అన్ని రకాల’ బంధాలున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలకు తెలిసిందే. సినీ రంగంలోని ప్రముఖులతో ఆయన తరచూ కనిపించే చిత్రాలు మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా ఫంక్షన్లలో ఆయన ఎక్కువగా కనిపిస్తుంటారు. రాజకీయ నేతల వద్ద పలుకుబడి సంగతి సరేసరి.  పదేళ్ల నుంచి ఆయనకు సినీ, మీడియా టైకూన్‌గా పేరుంది.
ఆ ప్రకారంగా.. ఆ ఇద్దరు హీరోలకు చెందిన కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, టివిలు, కొత్త వెంచర్ల కోసం వారికి ఆ నిధులు కొంత  ఇచ్చినట్లు అక్కడి పోలీసులకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిలో ఒక అగ్ర హీరో వైసీపీ నుంచి ఎంపీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో హీరోకయితే ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. ఈ ఇద్దరికీ విశాఖలో భారీ స్థాయిలో భూములుండగా, అక్కడ స్టుడియోలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ఒక హీరో.. ఒకవేళ జగన్ విశాఖలోనే  రాజధానిని ఏర్పాటుచేస్తే, ఆయనకు విశాఖ బీచ్ సమీపంలోని తన ఫాంహౌజ్‌ను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
Ras Al-Khaimah Investment Authority sen..ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రిని కలిసి, ఆయనను విడిపించే ప్రయత్నాలు చేయాలని లేఖ ఇచ్చారని టిడిపి ఆరోపించింది. నిమ్మగడ్డ ప్రసాద్ రస్ అల్  ఖైమాకు జగన్ పేరు చెప్పినందుకే, ఆయన విదేశాలు వెళ్లడం లేదని టిడిపి నేతలు తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పారన్న ప్రచారమే తప్ప, ఇంతవరకూ దానికి సంబంధించిన ఆధారాలేమీ కనిపించడం లేదు. తాజాగా భారత్ అక్కడి కోర్టుల తీర్పులను ఆమోదించిన నేపథ్యంలో, ఇకపై రస్ అల్ ఖైమా కథ కొత్త మలుపు తిరగవచ్చేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెడ్‌కార్నర్ నోటీసు ఇస్తే తప్ప, ఏపీలోని నిందితులను అక్కడకు తీసుకువెళ్లేందుకు వీలు లేదని అధికారులు చెబుతున్నారు. అంటే దుబాయ్‌లో స్విచ్  వేస్తే ఆంధ్రాలో లైట్ వెలుగబోతోంది అన్నమాట!
పీఏ శ్రీనివాస్‌పై దాడులు వెనుక?
కాగా చంద్రబాబు వద్ద చాలాకాలం పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై, ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడుల వెనుక రాజకీయ కారణాలున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. బిజెపి-టిడిపి కలసి ఉన్నప్పుడు, ఢిల్లీలో బిజెపికి చెందిన ఆంధ్రా ప్రుముఖుడు ఫోన్ చేసి, బాబుతో మాట్లాడాలని శ్రీనివాస్‌ను కోరారట. అందుకు, సార్ బిజీగా ఉన్నారు. నేను మాట్లాడిస్తానని చెప్పారట. అయితే, ఆ తర్వాత కూడా ఆ ప్రముఖుడికి ఫోన్ చేయించకపోవడంతో సదరు నేత దాన్ని మనసులో పెట్టుకుని, పనిలోపనిగా శ్రీనివాస్‌పై ఐటి దాడులు చేయించారంటున్నారు. ప్రతిమా శ్రీనివాస్ సంస్థలపై కూడా అనే సమయంలో ఐటి దాడులు జరిగినా, దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా, బాబు పీఏ శ్రీనివాస్‌పై దాడులకే కావాలని ప్రచారం కల్పించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  అయితే, ఈ ప్రచారంలో పెద్దగా పస కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాలను శాసించిన సదరు ప్రముఖుడు కేవలం ఒక పీఎస్‌పై కక్ష కట్టే స్థాయికి దిగజారతారా అన్నదే సందేహం.