వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి?
అయోధ్య, బీద, వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అన్నయ్యేమో ఒకప్పుడు మెగాస్టార్. ప్రజారాజ్యం పెట్టి, వైఎస్ జమానాలోనే ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన నాయకుడు. ఆయన తమ్ముడు ఇప్పుడు జనసేన దళపతి. వైఎస్ తనయుడు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అన్నయ్య మూడు రాజధానులను స్వాగతించి, జగన్‌తో కుటుంబసమేతంగా కలసి భోజనం కూడా చేశారు. తమ్ముడేమో.. మూడు రాజధానులను పిచ్చి తుగ్లక్ ఆలోచనగా తిట్టిపోస్తున్నారు. అమరావతి రాజధాని రైతులకు బాసటగా నిలుస్తున్నారు. అలాంటి అన్నదమ్ముల మధ్య జగన్ అగ్గి రాజేస్తున్నారా?..  జగడం పెడుతున్నారా?.. ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అందులో ఒకటి నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లాకు చెందిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీట్లు దాదాపు ఖరారయిరన ట్లు పార్టీ వర్గాల సమాచారం.
నాలుగో సీటును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న వారిలో అయోధ్య రామిరెడ్డి ప్రముఖుడు. జగన్ సీబీఐ కోర్టుకు హాజరయిన రోజున అయోధ్య నివాసానికి వెళ్లి, ఆర్ధిక వ్యవహారాలు చక్కబెట్టుకునేవారన్న ప్రచారం లేకపోలేదు. ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసినప్పుడు దాదాపు 100 కోట్లు నష్టపోయారన్న ప్రచారం ఉంది. పైగా అయోధ్య సమీప బంధువైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చిన జగన్, దానిని అమలుచేయలేదు. అయోధ్య మరో సమీప బంధువైన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీ సీటు అడిగినా ఇవ్వకుండా,  గుంటూరు ఎంపీ సీటివ్వడంతో ఓడిపోయారు. దీనితో అయోధ్యకు రాజ్యసభ ఇవ్వడం జగన్‌కు అనివార్యమయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక ఇటీవల వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మస్తాన్‌రావుకు, రాజ్యసభ ఇస్తానని జగన్ గతంలోనే హామీ ఇచ్చారంటున్నారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఒక్క యాదవుడికీ రాజ్యసభ ఇవ్వనందుకు అసంతృప్తితో ఉన్న యాదవ వర్గాన్ని సంతృప్తి పరచడంతోపాటు, టిడిపికి దన్నుగా ఉన్న యాదవులను ఆకట్టుకునేందుకు  బీదకు రాజ్యసభ ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గత ఎన్నికల్లో ఒంగోలు సిట్టింగ్ ఎంపిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సీటు ఇవ్వకుండా, మాగుంటకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా, ఈసారి జగన్ బాబాయ్ సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇస్తారంటున్నారు. ఆయనకు టిడిడి చైర్మన్ ఇచ్చినప్పటికీ, గతంలో కుదిరిన ఒప్పందం మేరకు రాజ్యసభ సీటు ఇస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవికి సైతం రాజ్యసభ సీటు ఇస్తారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బిజెపితో కలసి తన  సర్కారుపై పోరాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతున్న జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ దూకుడును సీఎం జగన్ సహిచలేకపొతున్నారు. అందుకే ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకే జగన్… ఆయన సోదరుడైన చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారన్న చర్చ జరుగుతోంది. పైగా, చిరంజీవికి ఎంపీ సీటు ఇవ్వటం ద్వారా, కాపులను తనవైపు మళ్లించుకోవడమే జగన్ ధ్యేయమంటున్నారు. విశాఖలో భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసిన చిరంజీవి, అక్కడ సినిమా స్టూడియో నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇటీవల జగన్‌ను కలసి, విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించారని విశ్లేషిస్తున్నారు. అయితే..కాపులు, చిరంజీవిని ఎంతవరకూ నమ్ముతారన్నదే ప్రశ్న. చిరంజీవిని ఒకసారి నమ్మి మోసపోయిన కాపులు, మళ్లీ ఆయనను నమ్ముతారనుకోవడం భ్రమేనని కాపునేతలు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Close Bitnami banner