సస్పెండ్ ఏల?.. సొమ్ములివ్వడమేల?

455

కోర్టుకెళితేనే న్యాయం జరుగుతుందా?

కోర్టులు లేకపోతే ఏపీలో పరిస్థితేమిటంటున్న అధికారులు

కోర్టుల్లో బెడిసికొడుతున్న జగన్ నిర్ణయాలు

జాస్తి, ఏబీలపై చర్యను తప్పుపట్టిన క్యాట్ వార్దదిరికీ జీతాలివ్వాలని ఆదేశం

ఏబీకి జీతమిస్తామని ముందే చెప్పిన సర్కారు అసలు చెప్పేదెవరు? వినేదెవరు? ( మార్తి సుబ్రహ్మణ్యం)

అడుసు తొక్కనేల కాలు కడగనేల? అన్న సామెత.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఎదురుతిరుగున్న వేళ గుర్తుకొస్తోంది. తనకు సరిపడని అధికారులపై ఎడాపెడా వేటు వేయడం, తర్వాత భూమి తలకిందులయినట్లు హడావిడి చేసి, పరిహారం చెల్లించడం జగన్ సర్కారుకు అలవాటయిపోయింది. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు క్యాట్‌లో బూమెరాంగవడం సర్కారుకు అప్రతిష్ఠగా మారింది. అంటే.. దీనితో ఈ ప్రభుత్వంలో క్యాట్‌కు వెళితే తప్ప న్యాయం జరగదన్న భావనతోపాటు, సర్కారు తనకు సరిపడని అధికారులను వేధిస్తోందన్న సంకేతాలు జనంలోకి వెళ్లడానికి కారణమవుతున్నాయి.
జగన్మోహన్‌రెడ్డి ఏపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత నవరత్నాల హామీని ఎంత వేగంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారో… తన రాజకీయ ప్రత్యర్ధి టిడిపితో అనుబంధం ఉందని, గతంలో తానే చేసిన ఆరోపణలకు సంబంధించిన అధికారులను వేటాడి, వెంటాడటంలోనూ అంతే వేగం ప్రదర్శిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పేషీలో పనిచేసిన అధికారులకు, ఐపిఎస్‌లకు అసలు పోస్టింగులు లేకుండా వెయిటింగ్‌లో ఉంచుతున్న వైనం విమర్శలకు గురవుతోంది. దానితోపాటు పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడం, ఇంగ్లీషు విద్య వంటి అంశాల్లో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు కోర్టులో అడ్డం తిరిగాయి.
జగన్ నిర్ణయాలు పిర్ర గిల్లి జో కొట్టడంలా మారుతున్నాయి. ఉన్నతాధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉండటం, సస్పెండ్ చేసిన సందర్భాల్లో ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఇస్తున్న ఉత్తర్వులు, ఆ తర్వాత నాలిక్కరచుకుని మార్చుకుంటున్న నిర్ణయాలు చూస్తే, ఈ సామెత నిజమేననిపించక మానదు. తొలుత ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ విషయంలో అదే జరిగింది. ఆయనకు అటు జీతం చెల్లించకుండా, ఇటు తన మాతృశాఖకు వెళ్లిపోతానన్నా పంపించకుండా వే ధించిన సర్కారు తొందరపాటు నిర్ణయాన్ని క్యాట్ తప్పుపట్టింది. ఆయనకు వేతనం ఎందుకు చెల్లించడం లేదని, వెంటనే జీతం చెల్లించాలని ఆదేశించడంతో జగన్ సర్కారు దానికి తలవంచక తప్పలేదు.
ఆ తర్వాత సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనూ జగన్ సర్కారుకు క్యాట్‌లో తలబొప్పి కట్టింది. తనకు 8 నెలల నుంచి పోస్టింగుతోపాటు, వేతనం కూడా చెల్లించడం లేదని ఆయన క్యాట్‌కు ఎక్కారు. దానితో ఖంగుతిన్న  సర్కారు ఆయనకు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని,  ప్రభుత్వ తరఫు న్యాయవాది విచారణ సందర్భంలో  క్యాట్‌కు చెప్పారు.  మరి జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ పని ముందే ఎందుకు చేయలేదు? క్యాట్‌కు వెళ్లిన తర్వాతనే జీతం చెల్లించాలని నిర్ణయించిందా? లేక అంతకుముందే నిర్ణయించిందా? ఒకవేళ అంతకుముందే నిర్ణయిస్తే అది అమలు కాకుండా అడ్డుపడింది ఎవరు? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
నిజానికి 8 నెలలపాటు పోస్టింగు కోసం వేచి చూసిన ఏబీవీకి, క్యాట్‌కు వెళ్లాలన్న ఉద్దేశం లేదంటున్నారు. అలాంటి ఆలోచన ఉంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారని, లూప్‌లైన్ అయినా తనకు పోస్టింగు వస్తుందన్న నమ్మకంతో ఉన్నందునే క్యాట్‌కు వెళ్లలేదంటున్నారు. నిజానికి అధికార మార్పిడి తర్వాత సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఏబీవీ ప్రయత్నించారని, అదేరోజు ఏసీబీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ తనకు పోస్టింగు, వేతనం ఇవ్వాలని ఆయన లేఖ రాసిన తర్వాతనే, సస్పెండ్ చేయడంతో క్యాట్‌కు వెళ్లే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలు పరిశీలిస్తే… టిడిపి సర్కారు హయాంలో నాటి పాలకులకు సన్నిహితంగా ఉన్న అధికారులకు పోస్టింగులు ఇవ్వకూడదని జగన్ సర్కారు ఒక విధాన నిర్ణయం తీసుకున్న విషయం స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సహజంగా ప్రభుత్వం మారిన తర్వాత ‘అనుమానిత అధికారులకు’ లూప్‌లైన్‌లో పోస్టింగులివ్వడం ఆనవాయితీ అని, అసలు పోస్టింగులు లేకుండా ఖాళీగా ఉంచడం జగన్‌తోనే మొదలయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘గతంలో రెడ్డి, దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం వర్గాలకు చెందిన పోలీసు, ఇతర శాఖలకు చెందిన అధికారులను టిటిడి సర్కారు చాలాకాలం పాటు పోస్టింగులేకుండా ఖాళీగా ఉంచింది. అందుకు సీఎంఓలో ఉన్న సతీష్‌చంద్ర, ఏబీవీ కారణమన్న చర్చ జరిగింది. దానిపై నాటి విపక్షమైన వైసీపీ కూడా విమర్శలు కురిపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అదే విధానం పాటిస్తే, వాళ్లకు వీళ్లకూ ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు కమ్మవాళ్లకు, కాపులకు పోస్టింగులు ఇవ్వడం లేదు. ఎస్పీ కోయప్రవీణ్‌కూ పోస్టింగు ఇవ్వలేదు. ఇలా చేస్తే తాము మాత్రమే నిజాయితీపరులమని వైసీపీ ఏవిధంగా ప్రచారం చేసుకోగలదు? మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక నెల జీతం ఇవ్వకుండా ఆపమనండి చూద్దాం. ఏదైనా ఇలాంటి చర్యలు చంద్రబాబు తీసుకున్నా, జగన్ తీసుకున్నా ఆక్షేపించాల్సిందే’నని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
సరే. ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిశోర్‌కు నెలల పాటు పోస్టింగులు, జీతాలు  లేకుండా చేసిన వైనం బాగానే ఉంది. మరి ఇప్పుడు క్యాట్ ఆదేశాల ఫలితంగా వారికి జీతాలు ఇవ్వక తప్పలేదు కదా? అంటే అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారుల సేవలు అన్ని నెలల పాటు వాడుకోని తప్పు సర్కారుదేనని స్పష్టమవుతోంది. వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా అన్ని నెలల జీతాలు చెల్లించడం వల్ల ఖజానాకే కదా నష్టం? పని చేయించుకోవలసిన ప్రభుత్వం, ఆ పనిచేయకుండా, వారిని ఖాళీగా కూర్చోబెట్టి, క్యాట్ ఆదేశాలతో జీతాలివ్వడం వల్ల ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఉన్న వారితోనే పనిచేయించుకోలేని ఏపీ ప్రభుత్వం.. ఇటీవల తమకు కొన్ని ఏడీజీ, మరి కొన్ని ఉన్నత స్థాయి హోదాలు కావాలని కేంద్రాన్ని కోరడం వింతలో వింత!
అయితే.. ఏపీలో ఇప్పుడు తమకు న్యాయం జరగాలంటే కోర్టులే దిక్కన్న అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది. డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక అధికారిని  కేంద్రానికి పంపుతూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ ఆయనే నిలుపుదల చేసి, మరొకరిని పంపించడం ఇదే మొదటిసారంటున్నారు. తాము కేంద్రానికి వెళ్లిపోతామన్నా పంపించకపోవడం, అలా ప్రయత్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న వైనంపై అధికారులు హడలిపోతున్నారు. ‘మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ వేస్తోంది. ఎంతోమంది సీఎంలకు చూశాం. కొన్నిటిపై మా అభిప్రాయాలను వారికి చెప్పేవాళ్లం. అందులో చాలామంది పాటించేవారు. కొందరు పాటించకపోయినా వ్యతిరేకంగా వెళ్లేవారు కాదు. కానీ మన సీఎం అసలు ఎవరి మాట వినరు. ఆయనకూ ఎవరూ చెప్పే ధైర్యం చేయరు. ఇలాగైతే మన పరిపాలన ఇతర రాష్ట్రాల్లో చులకన అవుతుంది. ఇప్పటికే డిఓపీటీలో మన రాష్ట్రం నవ్వులపాలవుతోంది. శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై డీఓపీటీ అధికారులు వెటకారంగా మాట్లాడుతున్నారు. అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంది. ఏదో మంచి పోస్టింగుల కోసం ఆశపడి, పైవాళ్లు చెప్పినట్లు చేస్తే తర్వాత వాళ్లే ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామందికి పోస్టింగులు రాకపోవడానికి అదే కారణం’ అని ఓ సీనియర్ ఐఏఎస్ వ్యాఖ్యానించారు.