బిజెపి-టీఆర్‌ఎస్ లెక్కల యుద్ధం!

551

నయా పైసా రాల్చలేదని కేటీఆర్ ధ్వజం

1.76 లక్షల కోట్లు ఇచ్చామని నిర్మలా సీతారామన్ వెల్లడి

ఆ సొమ్మెక్కడికి పోయిందని బిజెపి మాటల యుద్ధం

కేసీఆర్ సర్కారు బతుకుతున్నదే కేంద్ర నిధులపైనేనని ఎద్దేవా

కేంద్ర పక్షపాతంపై మళ్లీ గొంతెత్తిన కేటీఆర్

మెట్రోకు మీరిచ్చిందే పదిశాతమన్న తలసాని

మెట్రోరైల్‌పై కిషన్‌రెడ్డి-తలసాని మాటల తూటాలు

తెలంగాణలో తెరాస-బిజెపి మధ్య బడ్జెట్ పంచాయతీ (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో అధికార తెరాస-ప్రతిపక్ష భాజపా మధ్య నిధులు కేంద్రంగా మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి సర్కారు సవతిప్రేమ చూపిస్తోందని, నయాపైసా ఇవ్వకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై అంత ప్రేమ ఉంటే, బిజెపి నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో తెలంగాణకు విడుదల చేసిన నిధుల వివరాలు వెల్లడించారు. ఆ వివరాలతో బిజెపి నేతలు తెరాసపై మాటల యుద్ధం ప్రారంభించడం, దానికి కేటీఆర్ కూడా ధీటుగా జవాబివ్వడంతో ఈ అంశం రసవత్తరంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులలో కేంద్ర వివక్షను కేటీఆర్ తూర్పారపట్టారు. రాష్ట్రాల వాటాను 42నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల, తెలంగాణకు 4 వేల కోట్ల నష్టం వస్తుంది. కష్టపడి పని చేసే మాలాంటి రాష్ట్రాలకు ఎందుకీ శిక్ష? జాతీయ ప్రాధాన్యం ఉన్న మా రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరినా ఫలితం లేదు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై మంత్రి నిర్మల లెక్క హాస్యాస్పదం. మోసపూరితం. ఐదేళ్లలో తెలంగాణ తరఫున కేంద్రానికి 2.70 లక్షల కోట్లు చెల్లించాం. కానీ కేంద్రం నుంచి 1.15 లక్ష కోట్లే వెనక్కి వచ్చాయి. మిగిలిన 1.60 లక్షల కోట్లేమయ్యాయి? భారతదేశం రాష్ట్రాల సమూహం. ఇక్కడ ఇచ్చేవాళ్లు, పుచ్చుకునేవాళ్లెవరూ ఉండరు. కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలు రావలసిందే’ అని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్‌రెడ్డి సైతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ధ్వజమెత్తారు. గత బడ్జెట్‌లో వివిధ ప్రాజెక్టుల కోసం 19718 కోట్లు కేటాయించగా, బడ్జెట్ సవరణలో 15,987 కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, భగీరధకు నిధులివ్వలేదని, ఫార్మా సిటీకి నిమ్స్ హోదా కల్పించాలని కోరినా స్పందించలేదని విమర్శించారు. దీనితో తెరాస ఆరోపణలు క్షేత్రస్థాయికి చేరి, తెలంగాణపై కేటీఆర్ చెప్పినట్లుగానే.. బిజెపి సర్కారు సవతిప్రేమ చూపుతోందన్న భావన స్థిరపడింది. అయితే.. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్.. 2014 నుంచి తెలంగాణకు ఇప్పటివరకూ వివిధ రూపాల్లో 1,76,262.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పడంతో, లెక్కల కథ మరో మలుపు తిరిగింది. ‘2014-15 నుంచి 2019-20 (ఫిబ్రవరి 5 వరకూ) మధ్య కాలంలో పన్నులవాటా కింద 85,013.08 కోట్లు, రాష్ట్ర విపత్తుల సహాయనిధికి 1289.4 కోట్లు, స్థానిక సంస్ధలకు 8463.83 కోట్లు, జాతీయ విపత్తు నిధి కింద 873.27 కోట్లు, ఇతర ఆర్ధిక సంఘం గ్రాంట్లు 512.4 కోట్లు, ఇతర ప్రణాళిక గ్రాంట్లు 405.44 కోట్లు, ప్రత్యేక సాయం కింద 1916.14 కోట్లు, విదేశీ సహకారంతో చేపడతున్న ప్రాజెక్టులకు 3225.59 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గ్రాంట్లు 57036.27 కోట్లు.. ఇలా ఆయా శాఖలకు 17526.73 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నిర్మల తన లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. దానిని బిజెపి నేతలు అందుకుని, తెరాస సర్కారుపై ఎదురుదాడికి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ‘మెట్రో’పై మరో కిరికిరి.. తలసాని-కిషన్‌రెడ్డి మాటల తూటాలు హైదరాబాద్ మెట్రోపై రెండు పార్టీల మధ్య మరో కిరికిరికి తెరలేచింది. మెట్రో రైల్ జేబీఎస్-ఎంజీబీస్ మార్గం ప్రారంభోత్సవం వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలడానికి కారణమయింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకారన్న వ్యూహంతో.. కావాలనే ఆరోజుల్లో ప్రారంభోత్సవం పెట్టారని బిజెపి నగర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెరాస సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న బిజెపి మెట్రో అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు, అది కూడా ఒక మంత్రితో పిలిపించారని బిజెపి మండిపడుతోంది. అందులో భాగంగా కిషన్‌రెడ్డి మెట్రో అధికారులను పిలిచి సమీక్ష నిర్వహించి, వారిని తలంటారు. తాను లేని సమయంలో ఎలా ప్రారంభోత్సవం పెడతారని నిలదీశారు. ‘మెట్రో నిర్మాణానికి కేంద్రం 1200 కోట్లు ఇచ్చింది. మీ డీపీఆర్ ప్రకారం ఫలక్‌నుమా వరకూ మెట్రో పనులు పూర్తి చేయాలి. ఆ పనులు పూర్తి చేయకుండా అంత హడావిడిగా ఎందుకు ప్రారంభోత్సవం చేశారు. చాలా స్టేషన్లలో లిఫ్టులు కూడా సరిగా లేవు. మీరేం చేస్తున్నారు? అని కిషన్‌రెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. తర్వాత ఆయన బిజెపి నేతలతో కలసి మెట్రోలో ప్రయాణించారు. కిషన్‌రెడ్డి పర్యటన, సమీక్ష సర్కారుకు షాక్ కలిగించింది. దీనితో రంగంలోకి దిగిన సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మెట్రోకు కేంద్రం ఇచ్చిన లెక్కలు వెల్లడించి, బిజెపిని ఇరుకునపెట్టారు. ‘మీరిచ్చింది 10 శాతం నిధులు మాత్రమే. మెట్రో ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు నేనే కిషన్‌రెడ్డిని కలిసి ఆహ్వానించా. అసలు మెట్రో ఒప్పందం జరిగిందే కాంగ్రెస్ హయాంలోనని గుర్తుంచుకోవాలి. మా సీఎం కేసీఆరే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3 వేల కోట్లతో మెట్రో పూర్తి చేశాం. డబుల్‌బెడ్‌రూముల గురించి కిషన్‌రెడ్డి-లక్ష్మణ్ చేస్తున్న ప్రకటనలు వెగటు పుట్టిస్తున్నాయి. అలాంటి పథకం మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా లేవని వాళ్లిద్దరూ గుర్తుంచుకోవాలి’ అని తలసాని ఎదురుదాడి చేయడం ఆసక్తి కలిగించింది. కాగా.. నిర్మలా సీతారామన్ సమాధానాన్ని అందిపుచ్చుకున్న బిజెపి నేతలు తెరాస సర్కారుపై మూకుమ్మడి దాడి ప్రారంభించారు. అసలు కేసీఆర్ బతుకున్నదే కేంద్ర నిధులతోనని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు కాగ్‌ను కోరతామన్నారు. ఎంపి సోయం బాపూరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నగర అధ్యక్షుడు రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కేటాయింపులను ఏకరవు పెట్టారు. ఈ బడ్జెట్‌లో 1.55 కోట్లు తెలంగాణకు కేటాయించారన్నారు. డబుల్‌బెడ్‌రూముల విషయంలో కేంద్ర వాటా తీసుకుంటూనే, అదంతా తమ ఘనతేనని కేసీఆర్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. రిమ్స్‌కు 30 కోట్లు విడుదల చేయగా. రాష్ట్ర వాటా కింద మరో 20 కోట్లు ఇస్తే అన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల ప్రాజెక్టు పనులలో కేసీఆర్ సర్కారు తన వాటా విడుదల చేయకుండా, కేంద్రంపై నిందలు వేస్తోందని ఆరోపించారు. దానికింద ఇప్పటికే 2500 కోట్లు విడుదల చేశామని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారన్నారు. తెలంగాణలోని స్ధానిక సంస్ధలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తే, కేసీఆర్ సర్కారు నిధులు నిలిపివేసిందని ఆరోపించారు. అసలు ఆరేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. గ్రాంట్లు, గ్యారంటీల కింద కేంద్రం ఇచ్చిన 3 లక్షల కోట్లకు లెక్కలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆరకంగా.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులతోనే నడుస్తోందని, కేంద్ర పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటోందన్న ప్రచారం క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ద్వారా, తెరాస ఆరోపణల్లో పస లేదన్న భావన కలిగించే ప్రయత్నాలు ప్రారంభించింది.