తెలంగాణ ఆర్టీఐలో బీసీ, ఎస్సీలేరీ?

429

అర్హులే లేరా.. నాయకా?
సామాజిక న్యాయమేదీ?
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కింద  కొత్తగా నియమించిన సమాచార కమిషనర్ పదవికి అర్హులైన ఒక్క బీసీ, ఎస్సీ కూడా లేరా? సామాజిక న్యాయం పాటించరా?
తాజాగా రెండో దఫా ప్రకటించిన ఐదుగురు సమాచార  కమిషనర్ల జాబితా చూస్తే సహజంగానే ఈ అనుమానం రాక తప్పదు. మొత్తం ఏడుగురు సభ్యులను కేసీఆర్ సర్కారు భర్తీ చేసింది. వారిలో గతంలోనే ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజాసదారాం, కమిషనర్‌గా బుద్దా మురళి నియమితులయ్యారు. వీరిద్దరిలో మురళీ  అగ్రవర్ణాలకు చెందిన వారు.సదారాం ఒక్కరే బీసికి చెందిన వారు. అందులో సదారాం శాసనసభ కార్యదర్శిగా పనిచేయగా, బుద్దా మురళి జర్నలిస్టుగా లబ్థప్రతిష్టులు.తాజాగా ప్రకటించిన మరో ఐదుగురు కమిషనర్ల జాబితాలో ఒక్కరు కూడా బీసీ,ఎస్సీలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా కట్టా శేఖర్‌రెడ్డి, మైద నారాయణరెడ్డి, మహ్మద్ అమీన్ హుస్సేన్, జి.శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లాను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. అయితే కేంద్రం సవరించిన నిబంధనల ప్రకారం వీరి పదవకాలం ఇప్పుడు మూడేళ్లే. గతంలో వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి హోదా ఉండేది. అది కూడా తగ్గించింది. దానితోపాటు వేతనం కూడా తగ్గించింది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ, సమాచార కమిషనర్లలో ఒక్కరిని కూడా బిసి, ఎస్సీని నియమించకపోవడంపై బీసీ, ఎస్సీ సంఘాలు విమర్శలు కురిపిస్తున్నాయి. తెలంగాణ బీసీ, ఎస్సీలలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు అనేకమంది ఉన్నప్పటికీ.. వారిలో కేసీఆర్‌కు ఒక్కరు కూడా కనిపించలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యా, సాంస్కృతిక రంగంలో ఎంతోమంది బీసీ,ఎస్సీ మేధావులున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ‘తెలంగాణలో బీసీ,ఎస్సీ మేధావులెంతమందో ఉన్నారు. కానీ వారిలో ఎవరినీ సమాచార కమిషనర్లుగా నియమించకపోవడం ఆశ్చర్యం. ఇప్పటికయినా ప్రభుత్వం పునరాలోచించాలి. లేదా గవర్నర్ జోక్యం చేసుకుని సామాజిక న్యాయం పాటించేలా చూడాల’ని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే.. సమాచార కమిషనర్లుగా ఎవ రిని నియమించాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అందులో రిజర్వేషన్ కోటాలనేవి ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి.