ఏపీ-తెలంగాణ కమలవనంలో అధ్యక్ష సందడి

517

తెలంగాణ లోనే ఎక్కువ పోటీ
రేసులో జితేందర్‌రెడ్డి, రామచంద్రరావు, డికె అరుణ, బండి సంజయ్
లక్ష్మణ్‌కే కిషన్‌రెడ్డి మద్దతు?
ఏపీలో మళ్లీ కన్నాకే అవకాశం?
రేసులో సోము వీర్రాజు, మాధవ్
రేపో, మాపో ప్రకటన?

(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ట్రాలలోని భారతీయ  జనతా పార్టీ నేతల్లో అధ్యక్ష సందడి పెరిగింది. నద్దా జాతీయ అధ్యక్షుడైన తర్వాత వివిధ రాష్ట్రాల పార్ట అధ్యక్షులను మారుస్తున్న నేపథ్యంలో ఏపి-తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై ఉత్కంఠ మొదయిలంది. అధ్యక్ష పదవి కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. అయితే, ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది.ఒకటి, రెండు రోజుల్లో అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.
బలమైన క్యాడర్, లీడర్లు ఉన్న తెలంగాణలో అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రకటించిన బిజెపి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు ఎంపీలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ల శాతం సాధించింది. గత కొద్ది నెలల క్రితం టిడిపి నుంచి ఎంపి గరికపాటి మోహన్‌రావు బిజెపిలో చేరిక తర్వాత, పలు జిల్లాల్లో ఆ పార్టీకి క్యాడర్ పెరిగినట్టయింది.ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉన్న టిడిపి శ్రేణులంతా ఆయన వెంట బిజెపిలో చేరారు. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి, సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు  కూడా బిజెపిలో చేరడంతో పార్టీ బలపడే దిశగా వెళుతోంది.దీనితో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా, బిజెపి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ దశలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తినెలకొంది.  బిసి వర్గానికి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ మరోసారి కొనసాగేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన హయాంలోనే బిజెపి రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది.అయితే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. స్వతహాగా వివాదరహితుడైన లక్ష్మణ్‌పై పెద్ద వ్యతిరేకత లేకపోయినా, పార్టీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.  ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మద్దతుకూడా ఉండటంతో తిరిగి ఆయననే కొనసాగించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు.
బిసి వర్గానికే చెందిన ఎంపి బండి సంజయ్ పేరు చాలాకాలం నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది.ఇక కాంగ్రెస్ నుంచి చేరిన ఫైర్‌బ్రాండ్ డికె అరుణ పేరు కూడా వినిపిస్తోంది. అన్ని రంగాల్లో పైచేయి ప్రదర్శించే ఆమెను తెరపైకి తీసుకువస్తే, కేసీఆర్ సర్కారును సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపి, సీనియర్ నేత జితేందర్‌రెడ్డి పేరు గత కొద్దికాలం నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన బిజెపిలో క్రియాశీలకంగా పనిచేసినకాలం

నుంచీ, బిజెపి నాయకత్వంతో సత్సంబంధాలున్నాయి.అది ఆయనకు ప్లస్ కావచ్చంటున్నారు. ఆర్ధికంగా బలవంతుడితో పాటు, అన్ని వర్గాలను సమన్వయం చేసుకునే సామర్ధ్యం ఉన్న ఆయనకు, సీనియర్లు కొందరు మద్దతునిస్తున్నారు.ఆస్గనైజర్, వివాదరహితుడిగా పేరున్న మరో సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఆయనకు బండారు దత్తాత్రేయ ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు.హైదరాబాద్ నగర అధ్యక్షుడు, గతంలో బిజెపి రాష్ట్ర కమిటీలో పనిచేసిన ఎన్.రామచందర్‌రావు పేరు కూడా కొత్తగా తెరపైకొస్తోంది. ఆయనకూ వివాద రహితుడనే పేరుంది. ఒకవేళ ఈ సమీకరణలేవీ కుదరకపోతే, ఆయనకు ఆ పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. కాకపోతే ఈ పరిస్థితిలో, అందులోనూ సంఖ్యాపరంగా పెద్దగా బలంలేని బ్రాహ్మణ వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తారా అన్నది చూడాలి.
ఏపీలోనూ ఎన్నికల సందడి
ఇక ఏపీలోనూ అధ్యక్ష సందడి పెరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బిజెపిని ఓ జాతీయ ప్రముఖుడు సమాధి చేసిన తర్వాత, మళ్లీ జీరో స్థాయి నుంచి ఇక్కడి దాకా తీసుకురావడంలో కన్నా కృషి ఉందని సీనియర్లు చెబుతున్నారు. టిడిపి తోక పార్టీగా మారి నిర్వీర్యమైన పార్టీకి పూర్తి స్థాయిలో జవసత్వాలివ్వకపోయినా, మళ్లీ పార్టీలో చైతన్యం నింపి.. అసలు రాష్ట్రంలో బిజెపి ఉనికి ఉందని చెప్పడానికి కన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏపీలో ఏ అధ్యక్షుడూ తిరగనన్ని  జిల్లాలు, నియోజకవర్గాల్లో ఒక్క కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే పర్యటించారు.
రాష్ట్ర విభజన తర్వాత అధ్యక్షుడైన కంభంపాటి హరిబాబు విశాఖకే పరిమితమయ్యారు.కమిటీలను భర్తీ చేయలేకపోయారన్న విమర్శలుండేవి.కన్నా అధ్యక్షుడైన తర్వాత దాదాపు అన్ని కమిటీలను భర్తీ చేశారు. రాష్ట్ర కమిటీ కూర్పులో ఆయనపై కొన్ని విమర్శలున్నప్పటికీ, మొత్తంగా పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తూ, అసలు రాష్ట్ర కమిటీలో ఇప్పటి వరకూ స్థానం లభించని వారిని, కమిటీల్లో నియమించిన ఘనత కన్నాదేనంటున్నారు. అమరావతిపై పార్టీ విధానాన్ని స్పష్టం చేస్తూ తీర్మానం చేయించిన కన్నా ప్రయత్నాల ఫలితంగా, రాజధాని రైతులతోపాటు, వివిధ వర్గాలు కూడా బిజెపి వైపు సానుకూలత ప్రదర్శించడానికి కారణమయింది. అయితే కొందరు సీనియర్లు అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో లాబీ చేస్తుంటే.. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచీ లాబీయింగ్ చేయడం తెలియని కన్నా లక్ష్మీనారాయణ దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, మరోసారి అవకాశం ఇస్తే పనిచేద్దాం. లేకపోతే పార్టీ అప్పగించిన పని చేద్దామన్న ధోరణిలో ఉన్నారు. అయితే, తిరిగి ఆయననే అధ్యక్ష పద విలో కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సీనియర్లు మాత్రం.. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో, ప్రభుత్వంపై పోరాడేందుకు  కన్నా లాంటి వారే అధ్యక్షుడిగా ఉండటం మంచిదంటున్నారు.
కాగా, సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో సోము వీర్రాజుకే ఢిల్లీ స్థాయిలో ఎక్కువ పరిచయాలున్నాయి. పైగా గతంలో పవన్ కల్యాణ్‌ను ఆయనే మోదీ వద్దకు తీసుకువెళ్లి, ఆయనను బిజెపి-టిడిపి కూటమికి ప్రచారం చేశాలా చూడటంలో కీలకపాత్ర పోషించారు.వివిధ అంశాలపై అవగాహన, ప్రత్యర్ధులపై విమర్శలకు సంబంధించి దూకుడుగా వెళ్లే  సోము పేరు తాజాగా తెరపైకొచ్చినట్లు చెబుతున్నారు. ఇక బీసీ వర్గానికి చెందిన మాధవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఓ జాతీయ కార్యదర్శి మద్దతునిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంకా ఆయనకు చాలా వయసు ఉన్నందున, ఇప్పుడే అధ్యక్ష పదవి ఇవ్వడం అనుమానమేనంటున్నారు.