అయితే కన్నా…లేకపోతే సున్నా..

419

అమరావతి:- రాజకీయాలలో ఏ పదవిలో రాణించాలి అనుకున్నప్పటికీ …ఆ పదవికి తగ్గ స్టేచర్ ఉండాలి. స్థాయి ఉండాలి. అప్పుడే ఆ పదవికి..దానిని అందుకున్న వ్యక్తికీ గౌరవం…మన్నన లభిస్తాయి.
బీజేపీ ఆంధ్ర లో రెండేళ్ల క్రితం వరకు మృతప్రాయంగా ఉండేదని రాజకీయాలు మాట్లాడేవారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. విశాఖలో స్థిరపడిన కంభంపాటి హరిబాబు ఆ సమయంలో ఆంధ్ర బీజేపీకి అధ్యక్షుడు గా ఉండేవారు. ఆ సమయం లో బీజేపీ-తెలుగుదేశం ‘మిత్ర’ పక్షాలు. అందువల్ల కావచ్చు…బీజేపీ ని హరిబాబు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారని పరిశీలకులు అంటుంటారు. చంద్రబాబు నాయుడుకు కాలిలో ములుగుచ్చుకుంటే…తన కంట్లో సూది గుచ్చుకున్నట్టుగా ఆంధ్ర బీజేపీ ఆ రోజుల్లో విలవిల్లాడిపోయేది. చంద్రబాబుకు వ్యతిరేకంగా హరిబాబు నోరు విప్పితే ఒట్టు. అయితే…బీజేపీ మరీ నోరు..వాయి లేకుండా చచ్చుపడి లేదని చెప్పడానికా అన్నట్టు…సోము వీర్రాజు మాత్రం అప్పుడప్పుడూ నోటికి పని చెబుతూ ఉండేవారు. ఆంధ్ర బీజేపీ అనగానే, సోము వీర్రాజే చప్పున గుర్తుకు వచ్చేవారు. సోము వీర్రాజుది నోరా..తాటిపట్టా అంటూ తెలుగు దేశం వాళ్ళు కూడా అప్పుడప్పుడూ ఓ ఇదైపోతూ ఉండేవారు.బీజేపీ అధ్యక్షుడెవరని అడిగితే…హరిబాబు పేరు గబుక్కున గుర్తుకు వచ్చేది కాదు, ఆ రోజుల్లో.
సోము వీర్రాజు కు మాంఛి పదునైన నోరైతే ఉండేదికానీ…క్షేత్రస్థాయి నేత కాదు. ప్రజలలో నుంచి వచ్చినవారు కాదు. బీజేపీ కి మాతృక అయిన ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన వారు. అందువల్ల, చంద్రబాబు నిర్వాకాలను చీల్చి చండాడంలో ఆయన ముందు వరుసలో ఉన్నప్పటికీ…బీజేపీ కి ప్రాణవాయువు ను అందించడానికి అది ఒక్కటే సరిపోదని బీజేపీ కేంద్ర పెద్దలు భావించారు. అందువల్లనే…నాయకుడిగా ఒక ఇమేజ్…,క్షేత్రస్థాయి,బలం…,పుష్కలమైనపరిపాలనానుభవం..మొదలైన రాజకీయ ఆకర్షణలు దండిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చూపు పడింది. పైపెచ్చు, సోమూవీర్రాజు…కన్నా ల సామాజిక వర్గం ఒక్కటే. సామాజికవర్గ సద్భావన పరంగా చూసినా… కన్నా దే వీర్రాజు మీద పైచేయిగా ఉంటుందనే భావన బీజేపీ పెద్దల్లో వ్యక్తమైంది. పార్టీ పరంగా సోము వీర్రాజు సీనియర్ అయినప్పటికీ…క్షేత్ర స్థాయిలో రాజకీయ మల్ల యోధుడు, అనేక దఫాలుగా శాసనసభ్యత్వం…అనేక శాఖల మంత్రిత్వం నిర్వహించి…ముఖ్యమంత్రి పదవికి జానెడు దూరంలో ఆగిపోయిన కన్నా లక్ష్మీనారాయణ ను ఆంధ్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం మంచిదని అమిత్ షా భావించారు.
అధ్యక్ష పదవి కొద్ది లో తప్పిపోవడం తో సోము వీర్రాజు కొంత కుపితులైనప్పటికీ…కన్నా నియామకం తో ఆ పదవికి ఒక గుర్తింపు, నిండుతనం వచ్చాయి. బీజేపీ చంకను ఆయన ఎక్కడం కాకుండా..; ఆయన చంకనే ఆంధ్ర బీజేపీ ఎక్కింది.
ఆయన నియామకాన్ని తప్పు పట్టిన వారు కనిపించలేదు.
బీజేపీ కేంద్ర నాయకులు ఆశించినట్టుగానే….ఐ సీ యూ లో ఉన్న ఆంధ్ర బీజేపీ ని …కన్నా..అక్కడ నుంచి వార్డులోకి మెల్లగా తీసుకువచ్చారు. అక్కడ నుంచి చిన్నగా నడిపించడం ప్రారంభించారు. ఈ రెండేళ్లలో అది పరుగులు తీయలేకపోయినా…చక్కగా నడవగలుగుతున్నది. శుభ్రంగా కాలూ చెయ్యీ కూడదీసుకున్నది. ఏ సామాజిక వర్గంలోనూ బీజేపీ పై గతం లో ఉన్న చిన్నచూపు ఇప్పుడు లేదు. అది రాజకీయంగా పరుగులు దీసే స్థితికి రాకపోయినా..ఒక గౌరవ ప్రదమైన భావన కల్పించడం లో కన్నా కృతకృత్యులయ్యారనడంలో సందేహం లేదు.
ఈ కృషిలో రెండేళ్లు గడిచిపోయినట్టుంది. ఇప్పుడు ఆంధ్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలా అని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
ఆయనకు వ్యతిరేకం గా పనిచేసేవారు ఢిల్లీలోను.. ఇక్కడా గట్టిగానే ఉన్నారు. లాబీయింగ్ చేసుకోవడం కన్నాకు పెద్దగా తెలియదని కన్నాకు సన్నిహితులైన కొందరు జర్నలిస్టులు చెబుతుంటారు.(ఆయనను నేను 2008 లో ఒకే ఒకసారి కలిశాను, ప్రభుత్వ జలయజ్ఞం మీడియా అడ్వైజర్ హోదాలో)
అయితే ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా కనపడుతున్నది. కన్నా స్థానం లో మరొకరి పేరు ను పరిగణనలోకి తీసుకుంటేమాత్రం…రాష్ట్రం లో బీజేపీ మరోసారి నవ్వుల పాలు కావడం తథ్యం. ఆ స్థాయి, అనుభవం,నిండుతనం, పెర్సనాలిటీ కలిగిన నేత మరొకరు కనిపించడం లేదు. బీజేపీ కేంద్ర నేతలు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటారా…పక్క పార్టీల వాళ్ళు కూర్చున్న కొమ్మలను నరుకుతారా అనేది చూడాలి.
ఎందుకంటే….
అయితే కన్నా…లేకపోతే సున్నా అనే భావనలో బీజేపీ పరిశీలకులు ఉన్నారు.
—–భోగాది వేంకట రాయుడు.