మళ్లీ బిజెపి తల్ల‘ఢిల్లీ’..

493

కమిలిన కమలం
ఓటమి నేర్పిన గుణపాఠాలెన్నో
స్థానిక అంశాలను గుర్తించని వైఫల్యం
అసెంబ్లీకి అక్కరకు రాని జాతీయ అంశాలు
స్వేచ్ఛనివ్వని ఫలితమే ఇది

(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశ రాజధాని హస్తినలో జరిగే ఎలాంటి ఎన్నికయినా దేశం మొత్తం ప్రభావితం చేస్తాయి. అందరినీ అటు వైపు దృష్టి సారించేలా చేస్తాయి. అలాంటి రాజధాని రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, కమల వికాసానికి బదులు కమలం కమిలిపోవడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడని అంశమే. ఎన్నికల ప్రచారంలో ‘ఆప్’ను మించినా, ఫలితాల్లో మాత్రం దానికి సమీపంలో కూడా నిలబడకపోవడం విషాదరకమే. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ అవసరమే. కానీ మితిమీరిన విశ్వాసం, ప్రత్యర్ధులపై చిన్నచూపు, అంతా ఆ ఇద్దరిదేనన్నట్లు వ్యవహరిస్తే ఫలితాలు ఇంతకు భిన్నంగా ఏమీ ఉండవు. అంటే 8 సీట్లకు పరిమితం అయేంతగా! ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి.  విజయం తెచ్చిన అహంకారం తలకెక్కించుకున్నప్పుడు ఎదురయ్యే పరీక్షలో విఫలమైతే, అంతర్గత ప్రత్యర్ధుల నుంచీ కష్టాలు తప్పవు. ఢిల్లీ ఎన్నికలు కమల ద్వయ నాయకత్వానికి ఇచ్చిన సంకేతమిదే. 
జెపి నద్దా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే, ఆ పార్టీ పరాజయం పాలయింది. యుపిలో ఆయన ప్రతిభ బిజెపిని విజయతీరాలకు చేరిస్తే, పార్టీ సారథి అయిన తర్వాత స్వయంగా పర్యవేక్షించిన ఎన్నికల్లో మాత్రం పార్టీ విజయం సాధించకపోయినా, మునుపటి  కంటే ఓట్లు, సీట్లు పెంచుకోగలిగింది. అంతే తప్ప విజయలక్ష్మిని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఢిల్లీని చీపురుతో ఊడ్చేసిన కేజ్రీవాల్ ముందు చిన్నబోవలసి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ వనరులు, యంత్రాంగంతో  పోలిస్తే.. భాజపా కేంద్రీకరించిన శక్తులు, సైన్యమే ఎక్కువ. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కమలదళాలు ఢిల్లీలోనే మోహరించి పనిచేశాయి. కేంద్ర క్యాబినెట్ అంతా అక్కడే తిష్టవేసింది. కానీ విజయం ముందు అవి తేలిపోవలసి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఢిల్లీలో మూడుసార్లు హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క సీటు కూడా సాధించలేక చతికిల పడింది. అయితే, నేను ఓడినా ఫర్వాలేదు అవతలివాడు గెలవకూడదన్నట్లు… బిజెపిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ చివరలో ఆమ్‌ఆద్మీకి సహకరించి, బిజెపిని ఓడించానన్న ఆత్మానందం పొందింది. 
కేజ్రీవాల్ కేవలం తాను సాధించిన విజయాలతోపాటు, స్థానిక అంశాలనే ప్రస్తావించి ఢిల్లీ ఓటరు మనసు గెలుచుకున్నారు. అదే బిజెపి మాత్రం, స్థానికులకు సంబంధం లేని జాతీయ అంశాలనే తెరపైకి తీసుకురావడం ద్వారా, వారికి దూరం కావలసి వచ్చింది. ఢిల్లీ అంటేనే మినీ భారతం. వివిధ రాష్ట్రాలకు చెందిన వారి సమూహం. దాన్ని మాత్రం  గుర్తించిన బిజెపి, ఆయా రాష్ట్రాలకు చెందిన నేతను ప్రచారంలోకి దింపింది. కానీ ప్రచారంలో మాత్రం జాతీయ అంశాలకే పరిమితమయింది. క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్‌కు బదులు ఫుట్‌బాల్ ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది. బహుశా గత లోక్‌సభ ఎన్నికల్లో 7 ఎంపీ స్థానాలకు గాను ఏడింటిని గెలిచినందున, మళ్లీ అదే మంత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేస్తుందని భావించడమే ఈ ఓటమికి కారణం కామోసు. 
లోక్‌సభ ఎన్నికలు జాతీయ దృష్టికోణంలో కనిపిస్తే, అసెంబ్లీ ఎన్నికలను ఓటరు  రాష్ట్ర కోణ ంలోనే చూస్తాడు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తెరాసకు పట్టం కట్టిన ఓటరు, అదే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుమార్తెనూ ఓడించారు. కాంగ్రెస్-బిజెపికీ చోటిచ్చారు. అంటే లోక్‌సభలో మా ఓటు మేం వేసుకుంటామని చెప్పారన్నమాట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని ఆర్టికల్ 370, సీఏఏ, అయోధ్య వంటి అనవసర అంశాలను కమలదళాలు నమ్ముకుంటే, కేజ్రీవాల్ కేవలం స్థానిక అంశాలను మాత్రమే ప్రచారాంశాలుగా తీసుకుని సానుకూల ఫలితం సాధించారు. ప్రభుత్వ పాఠశాలల స్వరూపం, స్థితిగతులను పూర్తిగా మార్చి, తలిదండ్రులకు చేరువయ్యారు. తాను ప్రవేశపెట్టిన మొహల్లా క్లినిక్కులతో వైద్యం, పరిమిత యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకాలనే ప్రచారం చేసుకుని విజయం సాధించారు. ప్రధానంగా ఖరీదైన కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించిన కేజ్రీవాల్‌ను, ఢిల్లీ ఓటరు నెత్తిన పెట్టుకున్నట్లు ఫలితాలు చాటాయి.  ఎన్నికల ముందు అనధికార కాలనీలను బిజెపి  క్రమబద్దీకరించినా, ఆ పార్టీని నమ్మకపోవడం ప్రస్తావనార్హం. ఏపీలో చంద్రబాబు కూడా ఇలాగే ఎన్నికల ముందు పసుపుకుంకుమ పేరుతో నగదు ఇచ్చినా, మహిళలు ఆ పార్టీ కళ్లలో కారం కొట్టారు. 
ఇక అభ్యర్ధుల ఎంపిక కూడా స్థానిక శ్రేణుల మనోభావాల కంటే, బిజెపి నాయక ద్వయం ఆలోచనల ప్రకారమే సాగడం పరాజయానికి మరో కారణమంటున్నారు. జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్రలో కమిలిపోయిన కమలం, తాజా ఢిల్లీ ఎన్నికలలో చేదు ఫలితాలతో కుమిలిపోవవలసి వచ్చింది. ఈ ఎన్నికలు కచ్చితంగా కమలదళానికి కనువిప్పు కావలసిందే. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ.. మమత బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్, జగన్, నవీన్‌పట్నాయక్ బలంగానే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ విజయంతో ప్రాంతీయ పార్టీలకు నైతిక బలం వచ్చినట్లే. రాష్ట్రాలపై అవగాహన లేకుండా, ఎప్పుడూ ‘ఆ ఇద్దరి’ చరిష్మా, ఎత్తుగడే పనిచేస్తుందన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంచనా భ్రమల నుంచి బయట పడి, వాస్తవంలో జీవిస్తేనే కమల వికాసం సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఎన్నికా లోక్‌సభ మాదిరి కాదుకదా?!