నీవు నేర్పిన విద్యే ‘నారా’జాక్ష!

521

టిడిపి నేతల సెక్యూరిటీ తొలగింపు
గతంలో మాజీ మంత్రులకు సెక్యూరిటీ ఇవ్వని బాబు సర్కారు
ఇప్పుడు అదే దారిలో జగన్ సర్కారు

(మార్తి సుబ్రహ్మణ్యం)

నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్లు… గతంలో చంద్రబాబునాయుడు రాజకీయ ప్రత్యర్ధులకు చెప్పిన పాఠాలే ఇప్పుడు జగన్ నేర్పుతున్నారు. టిడిపికి చెందిన మాజీ మంత్రుల భద్రతను తొలగిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని, టిడిపి నేతలు తప్పుపట్టడం ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ, బిజెపి, కాంగ్రెస్‌కు  చెందిన మాజీ మంత్రులు, ఫ్యాక్ష న్ ప్రాంతాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్లు ఇవ్వలేదు. వారు డిజిపి, ఇంటలిజన్స్ ఏడీజీలకు వినతిపత్రాలిచ్చినా బాబు ప్రభుత్వం స్పందించలేదు. ఇరవై ఏళ్లు మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణకు గన్‌మెన్లు ఇచ్చేందుకు బాబు సర్కారు నిరాకరించింది. అయితే  ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతనే గన్‌మెన్లు ఇచ్చారు. కానీ, యుపిఏ హయాంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశరెడ్డి వంటి వారికి మాత్రం బాబు సర్కారు సెక్యూరిటీ ఇచ్చింది. 

జగన్ సీఎం అయిన తర్వాత దాదాపు 8 నెలల పాటు మాజీ మంత్రులు, సమస్యాత్మక ప్రాంతాల మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ల సౌకర్యం కొనసాగించింది. కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో వారి గన్‌మెన్లను ఉపసంహరించడం వివాదానికి దారితీసింది. మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, అఖిలప్రియ, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులుకు గతంలో ఇచ్చిన గన్‌మెన్లను ఉపసంహరించుకుంది. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసుతోనే ఈ నిర్ణయం తీసుకుంది. గన్‌మెన్లను సాయంత్రం లోగా రిపొర్టు చేయాలని ఆదేశించింది.అయితే దీనిపై టిడిపి నేతలు మండిపడతున్నారు. కాంగ్రెస్ హయాంలోనూ తమకు భద్రత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు హయాంలో వైసీపీ, బీజేపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ల సౌకర్యం తొలగించిన వైనం టిడిపికి ఇరకాటంగా పరిణమించింది. ఈ విషయంలో గతంలో చంద్రబాబునాయుడు అనుసరించిన విధానమే, ఇప్పడు జగన్ అమలుచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం తప్పయితే, గతంలో బాబు సర్కారు చేసిందీ తప్పేనని టిడిపి అంగీకరించాల్సి ఉంటుంది. గతంలో తమ భద్రత విషయంలో బాబు సర్కారు అమానుషంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. మరి దీనిపై టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ప్యాక్షన్ ప్రాంతాల్లో ఉండే మాజీ మంత్రులకు గన్‌మెన్లు ఉపసంహరించడం వల్ల,  కొత్త సమస్యలు తెలెత్తే ప్రమాదం లేకపోలేదంటున్నారు. 
నాడు తలసాని.. నేడు టిడి జనార్దన్
చాలామంది ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు గన్‌మెన్లు ఒక ఫ్యాషన్‌గా భావిస్తారు. ఫ్యాక్షనిస్టులు ఉండే ప్రాంతాల వారయితే దానిని  అత్యవసరంగా భావిస్తారు. ఒకవేళ ప్రభుత్వం సెక్యూరిటీ నిరాకరిస్తే డబ్బులు చెల్లించి భద్రత కొనసాగించుకుంటున్నారు. అదీ సాధ్యం కాకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల నుంచి గన్‌మెన్లు తెచ్చుకుంటారు. గతంలో కాంగ్రెస్ హయాంలో, టిడిపిలో మాజీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రభుత్వం గన్‌మెన్లు ఇవ్వలేదు. దానితో ఆయన ప్రభుత్వాన్ని బ్రతిమిలాడకుండా, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ నుంచి గన్‌మెన్లు పెట్టుకున్నారు.
ఏపీలో ఎన్నికలయిన తర్వాత టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైసీపీ-బిజెపి-కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రుల భద్రతను తొలగించింది. ఆ సందర్భంలో తమ భద్రత కొనసాగించమని చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టిడిపి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆ పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయకర్త టిడి జనార్దన్‌రావు మాత్రం, తనకు ఎమ్మెల్సీ హోదాలో ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ సౌకర్యాన్ని తిరస్కరించారు. వచ్చే ఏడాదితో ఆయన పదవీకాలం ముగుస్తున్నా, ఇప్పటివరకూ ఆయన గన్‌మెన్ సౌకర్యం వినియోగించుకోకుండా అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిరంతరం కార్యకర్తల మధ్య ఉండే తనకు భద్రత ఎందుకని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.