దేశ ద్రోహమా?.. దొండకాయనా?

730

ఏబీ కేసు కోర్టులో నిలుస్తుందా?
జీఓలో తక్కువ.. లీకు వార్తల ప్రచారం ఎక్కువ
ప్రైవేటు కంపెనీ కొనుగోళ్లు దేశద్రోహమవుతుందా?
ఇంకా కొనని పరికరాలపై విచారణ ఎలా?
మరి నాటి డిజిపి, కమిటీనీ విచారిస్తారా?
ఏపి సర్కారుతో ఏబీ కొడుకు కంపెనీ ఒప్పందమే లేదట
ఎనిమిది నెలలు  ఏబీని ఎందుకు విచారించలేదు?
సోషల్ మీడియానే కేసు విచారిస్తుందా?
విషయం తక్కువ..అధికార లీకులు ఎక్కువ
ఏబి వెంకటేశ్వరరావు కేసు నుంచి బయటపడతారా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

అదేదో రెండు దేశాల మధ్య కుదిరిన ఆయుధాల ఒప్పందం కాదు. రక్షణ శాఖ నుంచి లీకయిన డాక్యుమెంట్లు అంతకన్నా కాదు. ఇందులో గూఢచారి 116 సినిమాలో మాదిరిగా రహస్యపు అరలు, దానిని బద్ధలు కొట్టి కోడ్ కనిపెట్టడాలేవీ ఉండవు. అదో  దేశపు ప్రైవేటు కంపెనీ. మన పెళ్ళిళ్లలో తీసే డ్రోన్ కెమెరాల లాంటిదే బెలూన్ గ్యాస్ కెమెరా. డ్రోనయితే చార్జింగ్ సమయం తక్కువ కాబట్టి, గ్యాస్ ద్వారా వెళ్లే బెలూన్ అయితే ఎక్కువ రోజులు ఆకాశంలో నిలుస్తుంది. అది పై నుంచే కింద ఉన్న పరిసరాలను తన కెమెరాలో బంధిస్తుంది. ఇది సరిహద్దులు, అటవీప్రాంతాల్లో ఉండే ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలు ఆరా తీసేందుకు పనికొస్తుందని ఏపీ పోలీసులు గుర్తించారు. అది ఇజ్రాయల్‌లో ఓపెన్‌గా తయారుచేసే కంపెనీ. అమెరికాలో దానిని షట్టరు తెరచి మరీ అమ్మే వస్తువు. ఆ డీలరు అక్కడే ఉంటాడు మరి. దానిని ఇప్పటికే మన భద్రతాదళాలు వాడుతున్నాయి. ఆ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. అంటే ఇదంతా ఓపెన్ యవ్వారమే. మరిక్కడ దేశ రహస్యాలు, దేశద్రోహం అనే భారీ డైలాగులు చెప్పేంత సీనెక్కడుంది?కానీ.. ఏపీ రాజకీయ నాయకత్వం దృష్టిలో మాత్రం అది దేశద్రోహమేనట. దొండకాయ, వంకాయేమీ కాదూ?! ఏపి మాజీ నిఘా దళపతి ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి ఓ పరికరాల కొనుగొలును సాకుగా చూపిన సర్కారు చేసిన ఆరోపణలు కోర్టులో చివరాఖర వరకూ నిలుస్తాయా? అన్నది సందేహం. అసలు జగన్ సర్కారు ఇచ్చిన జీఓకు, దానికి విరుద్ధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, దానికి వంతపాడుతున్న కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహానికి, వాస్తవ పరిస్థితులకు, వైసీపీ నేతల ఆరోపణలకు, ఆయనను దేశం విడిచిపోకుండా చూడాలన్న మతిలేని డిమాండ్లకు  ఏమాత్రం పొంతన లేనట్లు కనిపిస్తోంది. సర్కారు విచారణ కమిటీ వేసేలోపే సోషల్ మీడియాతోపాటు, అధికార మిత్రపత్రికలే తుది తీర్పు ఇస్తుండతటం ఆశ్చర్యం. దీనిపై ‘సూర్య’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
 భద్రతా పరికరాల కొనుగోలుకు సంబంధించిన అవకతవకలకు సంబంధించి.. డిజిపి స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చిన జగన్ సర్కారు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా విజయవాడను విడిచిపెటకూడదని ఆదేశించింది. ఇదీ ఉత్తర్వుల ప్రకారం ఏబీవీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కానీ, సోషల్ మీడియాతో పాటు, వైసీపీ అనుకూల మీడియా సంస్థలు, వైసీపీ సోషల్‌మీడియా విభాగాలు, వైసీపీ నేతలు చేస్తున్న ప్రత్యక్ష-పరోక్ష ప్రకటలు, లీకులు, కథనాలే విస్మయం కలిగిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏబిని వ్యతిరేకిస్తున్న పార్టీ-పోలీసు పెద్ద తలలే ఉన్నట్లు మెడ మీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది.
నిజానికి జగన్ సీఎం అయి 8 నెలలవుతోంది. ఏబికి అప్పటినుంచీ పోస్టింగు ఇవ్వలేదు. ఏబి, సతీష్‌చంద్ర టిడిపి నేతలుగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఈసీకీ ఫిర్యాదు చేశారు.  మరి ఈ ఎనిమిది నెలల నుంచి ఆయన అక్రమాలపై విచారణ చేయకుండా ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది? మామూలుగా అయితే… తన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రాయబారం సాగించారని ఆరోపించిన ప్రతిపక్షం, ఎన్నికల తర్వాత అధికార పక్షంగా మారినప్పుడు.. సదరు అధికారి చర్యలపై వెనువెంటనే చర్యలకు ఉపక్రమించాలి. ఆయన ఆ పోస్టులో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను కూపీ  లాగి, ముద్దాయిగా నిలబెట్టాలి కదా? ఏబి విజయవాడ కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిందని కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన ఆరోపణలు నిజమనుకుంటే, ఆ తర్వాత సీపీగా వచ్చిన గౌతం సవాంగ్ దానిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు. వారిద్దరికీ సరిపడదని పోలీసువర్గాలకు తెలుసు. అసలు ఏబినే సవాంగ్‌కు డిజిపి రాకుండా అడ్డుపడ్డారని సవాంగ్ అనుమానిస్తున్నారన్న చర్చ అప్పట్లో జరిగిందనీ తెలుసు. అలాంటిది ఏబిపై ఆరోపణలు వస్తే సవాంగ్ వాటిని విచారించి, ఏబిని దోషిగా నిలబెట్టే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారన్నది మరో ప్రశ్న. అంటే ఈ 8 నెలలపాటు ఏబిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అది కూడా ఆయన తన వేతనం, పోస్టింగు గురించి లేఖ రాసిన తర్వాతనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పోలీసువర్గాలు చెబుతున్నాయి. నిజానికి అప్పట్లో కొత్త డిజిపిగా కౌముది పేరును ఏబి సిఫార్సు చేశారని, అందుకే ఆ తర్వాత వచ్చిన డిజిపి ఠాకూర్‌కూ, ఏబీకి సరిపడేది కాదన్న ప్రచారమూ లేకపోలేదు. ఠాకూర్ కోసం సతీష్‌చంద్ర లాబీయింగ్ చేశారని, సీఎం చంద్రబాబు సవాంగ్ వైపు మొగ్గు చూపినా, సతీష్‌చంద్ర, ఒక యువనతే పట్టుదల వల్లే సవాంగ్‌కు డిజిపి పదవి చేజారిపోయిందన్న ప్రచారమూ లేకపోలేదు. అంటే ఏబి వల్ల తనకు డిజిపి రాలేదని సవాంగ్, ఏబి సిఫార్సు చేయకపోయినా తనకు డిజిపి వచ్చిందన్న భావన ఠాకూరుదీ అన్నమాట. ఇందులో రెంటికీ చెడింది మాత్రం ఏబీనేనని ఇప్పటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 
ఏబి వెంకటేశ్వరరావును బాబు సర్కారు ఏరి కోరి నిఘా దళపతిగా నియమించుకుందన్నది బహిరంగమే. ఏ సీఎం అయినా తనకు నమ్మకస్తుడైన అధికారినే ఆ పోస్టులో నియమించుకుంటారు. సమర్థత కూడా చూస్తారు. ఆ ప్రకారంగా నక్సల్స్ అణచివేత వంటి అంశాల్లో నిష్ణాతుడైన ఏబీ వైపు ఆయన మొగ్గుచూపారు. అతి పెద్ద ఎన్‌కౌంటర్ అయిన రాంగూడ ఎన్‌కౌంటర్ ఆయన హయాంలో జరిగిందే. ఆ సంప్రదాయం బాబుతో మొదు కాలేదు, ఆయనతో ముగియలేదు. కాకపోతే ఏబి నాటి సీఎం బాబుకు చెందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడమే ఆయనపై వచ్చిన అదనపు ఆరోపణలకు మరో కారణం. ఈ ఆరోపణలు పక్కకుపెడితే.. పోలీసు అధికారిగా ఏబీ, కొన్నేళ్ల క్రితం మూతపడిన నిఘా శిక్షణ స్కూలును తిరిగి తెరిపించారు. ఐబి, రాలతో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బెవజాడలో నైట్ ఫుడ్‌కోర్టులు ఆయన ప్రారంభించినవే. 
ఆ మాటకొస్తే జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్వ్రీంద్రను ఏపికి తీసుకువచ్చి, ఆయనను నిఘా దళపతిగా నియమించాలని ప్రయత్నించారు. అసలు చాలారోజుల పాటు సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉండి వ్యవహారాలు చక్కదిద్దారన్న చర్చ కూడా జరిగినా, అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. గతంలో జగన్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని, ఇప్పటికీ ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆమె విజయసాయిరెడ్డితో ఉన్న ఫొటోలు పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. అయితే వారిద్దరి బదిలీ విషయంలో కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అది వేరే విషయం. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిఘా బాసుగా ఉన్న అరవిందరావు, అంతకుముందు బాబు సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన శివశంకర్, తెలంగాణకు సంబంధించి మహేంద్‌రెడ్డిని కూడా.. విపక్షాలు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తిన విషయాన్ని విస్మరించలేం.నిఘా దళపతి పోస్టంటే  అన్నింటినీ భరించాల్సిందే. ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అన్ని విమర్శలూ ఉంటాయి. అందరికీ శత్రువయ్యే పోస్టు అది. ఆ పోస్టులో ఉన్న అధికారి నిజానికి డిజిపిల కంటే శక్తివంతుడు. ఎందుకంటే డిజిపిల కంటే రోజూ సీఎంలతో చర్చించే అవకాశం, పాలకులతో సన్నిహితంగా ఉంటే వెసులుబాటు నిఘా దళపతులకే ఎక్కువ ఉంటుంది. దానితో సహజంగా డిజిపిలకు-నిఘా బాసులకు పొసగదు. అధికారులు కూడా సహజంగా ఎక్కువ పలుకుబడి ఉన్న నిఘా దళపతులనే ఆశ్రయిస్తుంటారు. ఆ సీఎంలు మారిన తర్వాత నిఘా దళపతులు బదిలీ అవుతుంటారు. అప్పుడు వారిని ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వస్తే, సదరు నిఘా దళపతులకు లూప్‌లైన్‌లో బదిలీ చేస్తుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. కానీ, ఏపీలో జరుగుతున్న విచిత్ర రాజకీయాల ఫలితంగా నిఘా దళపతిగా పనిచేసిన అధికారికి 8 నెలల పాటు ఎలాంటి పోస్టింగే ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఇలాంటి పరిస్థితి వైఎస్ హయంలోనూ ఎక్కడా కనిపించలేదని అధికారులే చెబుతున్నారు.
నిఘాలో నిష్ణాతుడు, సౌమ్యుడు, వివాదరహిత అధికారిగా పేరున్న అరవిందరావు వంటి అధికారికీ ఇవి తప్పలేదు. కాబట్టి, ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలు కూడా ఆ కోవకు చెందినవిగానే  భావించక తప్పదు. ఏ నిఘా దళపతి అయినా శాంతిభద్రతలు, నక్సల్స్ ఆపరేషన్‌తోపాటు.. రాజకీయ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీ అంటేనే రాజకీయాలతో కూడిన రాష్ట్రం కాబట్టి, ఆ బాధ్యతల మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే నిఘా దళపతులు రాజకీయ నేత మాదిరిగానే ఆలోచించి, వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ఐఏఎస్, ఐపిఎస్, డిఎస్పీ, సీఐ పోస్టింగులపై నిఘా దళపతి పాత్ర ఎక్కువగా ఉంటుంది.  సీఎంఓలో పనిచేసే అధికారుల పాత్ర కూడా ఇంతే ఉంటుంది. ఎమ్మెల్యే, మంత్రులు, వారిచ్చే సిఫార్సుల జాబితాను అమలుచేయడం, వారితో చర్చించడం వంటి రాజకీయ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. కాకపోతే సీఎంఓ పాత్రపై జనాలకు పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి, దాని గురించి ఎవరికీ తెలియదు. బాబు హయాంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సతీష్‌చంద్ర కూడా ఏబీ మాదిరిగానే వైసీపీ ఎమ్మెల్యేలతో రాయబారం చేసి, వారిని టిడిపిలోకి తీసుకువచ్చారని ఇదే వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే విచిత్రంగా, ఏబివీకి ఇప్పటివరకూ పోస్టింగు ఇవ్వని వైసీపీ సర్కారు.. అదే ఆరోఫలకు గురైన సతీష్‌చంద్రకు మాత్రం కీలక శాఖ కట్టబెట్టడం మరో విచిత్రం. దీనికి ఐఏఎస్‌లలో ఉండే ఐక్యత, ఐపిఎస్‌లలో ఉండే అనైక్యతే కారణం. ఇది కూడా చదవండి.. ‘ ఐఏఎస్‌ల్లో ఉన్న ఐక్యత ఐపిఎస్‌లకేదీ?
సరే… ఇక ఏబీవీ, ఆయన కుమారుడిపై చేస్తున్న దేశద్రోహ ఆరోపణలు పరిశీలిద్దాం. ఇజ్రాయల్ వంటి విదేశీ కంపెనీల నుంచి ఫోన్‌ట్యాపింగ్, నిఘా కెమరాలు కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయన్న లీకు వార్తలన్నీ బురదచల్లడానికే పనికివస్తాయనిపిస్తోంది. నిజానికి నిత్యం ఉగ్రవాదులతో పోరాడే ఇజ్రాయల్‌కు బోలెడు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అందుకే  ఇండియా నుంచి అనేక రాష్ట్రాల పోలీసు అధికారులు ఇజ్రాయల్ వెళుతుంటారు. ఇప్పుడు ఏపీలోని చాలామంది ఐపిఎస్ అధికారులు అక్కడికి వెళ్లిన వారే. అందులో భాగంగానే నాటి డిజిపి, నిఘా దళపతి, ఎర్రచందనం టాస్కుఫోర్స్ ఉన్నతాధికారి అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న బెలూన్ కెమెరాలను కొనుగోలు చేయాలని భావించి, వాటి పనితీరు పరిశీలించారు.నిజానికి వాటి కొనుగోలుకు ఆ దేశ రక్షణ శాఖ అనుమతి కొన్ని పరికరాలకు ఉండగా, మరికొన్నింటికి అవసరం లేదు. ఇప్పుడు ఏపికి తీసుకురావాలనుకున్న ఆ పరికరాలకూ ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దానికి ఇజ్రాయల్, ఇండియా రక్షణ శాఖ నుంచి గానీ  ఏ అనుమతులూ అవసరం లేదు. ఇందులో భద్రతా సమాచారం చేతులు మారాల్సిన అవసరం కూడా కనిపించదు. అసలు అదేమీ రహస్య పరికరం కాదు. ఓపెన్ మార్కెట్‌లో ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం బిఎస్‌ఎఫ్ కూడా దానిని వినియోగిస్తోంది. ఏపీకి దానిని తీసుకువచ్చే విషయంలో 3 సార్లు గ్లోబల్ టెండరు పిలవడం, అందులో రెండుసార్లు సింగిల్ టెండర్ వస్తే దానిని రద్దు చేసి, మూడవ దానిని ఖరారు చేయడం జరిగిపోయింది. అయితే రకరకాల కమిటీల పరిశీలనల తర్వాత చివరాఖరకు అసలు కొనాలనుకున్న ఆ పరికరాలు కొనకుండానే రద్దయిపోయింది. అసలు కొనుగోలు ఆర్డర్ రిలీజ్ చేసిందే కేంద్రం ఆధ్వర్యంలోని ఎస్‌టిసి అయినప్పుడు, అందులో మిగిలిన వారి పాత్ర ఎంతన్నది మరో ప్రశ్న.  ఈ వ్యవహారంలో ఏబి కుమారుడి పాత్ర ఉందని ఆరోపిస్తున్న కంపెనీ, ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వ్యాపారం చేయలేదు. ఎలాంటి టెండరు వేయలేదు. ఆ కంపెనీ వ్యాపారంమంతా ప్రైవేటు సెక్టార్‌లోనే అయినప్పుడు ఇందులో దేశద్రోహం ఎక్కడిదన్నది ప్రశ్న. అదే విషయాన్ని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఇదీ.. మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఇజ్రాయిల్ పరికరాల కథ. 
మరి ఇందులో దేశద్రోహం, సమాచారం లీకనే ముచ్చట ఎక్కడ? ఇజ్రాయల్-గాజా సరిహద్దులో వాడే పరికరాలు నాసిరకానివా అని మెడ మీద తల ఉన్న వాళ్లు ఆలోచించాలి కదా?! పోనీ.. ఒకవేళ అదే నిజమైతే 8 నెలల పాటు ఈ ఆరోపణలపై విచారించకుండా ఏం చేశారన్నది మరో ప్రశ్న. వైసీపీ నేతలు, సోషల్‌మీడియాలో వస్తున్న కథనాలు నిజమైతే, నాటి డిజిపి, మరో ఐపిఎస్ అధికారి పాత్ర కూడా ఉందనే కదా అర్ధం? మరి వారిని కూడా విచారిస్తారా?  ఎందుకంటే దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలతోపాటు, పరికరాల తయారీకి నేరుగా ఆర్డరు  డిజిపి కార్యాలయం ఇస్తే, ఇంటలిజన్స్ విభాగం యూజర్ ఏజెన్సీగా పనిచేసింది. అందుకే ఈ ఆరోపణలన్నీ అసలు కోర్టులో నిలిచేవి కాదంటున్నారు.